సంతానలేమి దక్షిణాదిలోనే ఎక్కువ.. కారణమేంటో తెలుసా!

1 Dec, 2023 16:20 IST|Sakshi

సంతానలేమి దక్షిణాదిలోనే ఎక్కువ..

అధ్యయనంలో వెల్లడి.. అనారోగ్య సమస్య కూడా...

ఉత్తరాది రాష్ట్రాల కంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక,  తెలంగాణలలో సంతానలేమి రేటు ఎక్కువగా ఉందని ఇటీవలి అధ్యయనం వెల్లడించింది. దీని ప్రకారం, వివాహ వయస్సు, జీవసంబంధ కారకాలు,  జీవనశైలి కారకాలు వంధ్యత్వంతో ముడిపడి ఉన్నాయని స్పష్టం చేసింది.

ఈ సమస్యకు సంబంధించి దక్షిణాది రాష్ట్రాల తర్వాత స్థానంలో గోవా, ఢిల్లీ, సిక్కిం, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి ఇతర రాష్ట్రాలున్నట్టు ప్లస్‌వన్‌ జర్నల్‌లో ప్రచురించిన అధ్యయనం తెలిపింది. అయితే, ‘భారత్‌లో వంధ్యత్వ ధోరణులు.. ప్రవర్తనా నిర్ణాయకాలు’ పేరిట అధ్యయనం నిర్వహించారు.

అనారోగ్యమే..
ప్రస్తుతం అత్యధిక సంఖ్యలో దంపతుల్ని వెంటాడుతున్న సమస్య సంతానలేమి. అయితే, ఈ సమస్యను ఒక అనారోగ్య సమస్యగా కాకుండా అదొక ప్రత్యేక సమస్యగా పరిగణించడం జరుగుతోంది. కాగా, ఈ సమస్యకు ముందు, వెనుకా కూడా అనేక అనారోగ్య సమస్యలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. వంధ్యత్వానికి  కారణాల్లో అపసవ్య జీవనశైలి, లైంగిక వ్యాధులు వంటివి ఉన్నాయి. విచ్చలవిడి శృంగారం, పలువురు సెక్స్‌ భాగస్వాములను కలిగి ఉండటం తద్వారా లైంగికంగా సంక్రమించే అంటువ్యాధులు.. వంధ్యత్వానికి, అవాంఛనీయ గర్భస్రావాలకు కారణాలుగా మారుతున్నాయని అధ్యయనం అభిప్రాయపడింది. 

ముంబైలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ, ఇంటర్నేషనల్‌ ఇన్స్‌స్టిట్యూట్‌ ఫర్‌ పాపులేషన్‌ సైన్సెస్‌ ఆధ్వర్యంలో సెంటర్‌ ఆఫ్‌ సోషల్‌ మెడిసిన్‌ అండ్‌ కమ్యూనిటీ హెల్త్‌ నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం.. ‘లైంగికంగా సంక్రమించే ఇన్‌ఫెక్షన్లు తగిన ఆధునిక వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాలలో వంధ్యత్వ రేటు ఎక్కువగా ఉంది. పర్యావరణ, సామాజిక–ఆర్థిక  జీవనశైలి అలవాట్లు వంటి అనేక ఇతర అంశాలు సమస్య తీవ్రతకు దోహదం చేస్తాయి. ఒక జంట నివసించే వాతావరణం, వేడికి, శబ్దానికి తరచుగా గురికావడం ఆ జంట  పునరుత్పత్తి సామర్ధ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది’ అని అధ్యయనం పేర్కొంది. ‘అధిక బరువు దుష్పలితాలు రుతుస్రావం, వంధ్యత్వం, గర్భస్రావం, గర్భం  ప్రసవంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ధూమపానం, మద్యపానం, తరచు గర్భస్రావాల ముందస్తు గర్భనిరోధక మందుల వినియోగం కూడా వంధ్యత్వ ప్రమాదాన్ని పెంచుతాయని వెల్లడించింది.

మానసిక సమస్యలెన్నో..
అనారోగ్య కారణాలతో ఏర్పడే ఈ సమస్య ఆ తర్వాత కూడా అనేక రకాల అనారోగ్యాలకు కారణమవుతోంది. పురుషులతో పోలిస్తే సంతాన లేమి మహిళలను మరింత ఎక్కువగా వేధిస్తుందని వారి మానసిక ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని అధ్యయనం తేల్చింది. అంతేకాకుండా కుటుంబ, సమాజ ఒత్తిడిని వారు అతిగా భరించాల్సి వస్తుందని కూడా వెల్లడించింది. భారతదేశంలోని జంటలలో వంధ్యత్వం 1981లో 13 శాతం మాత్రమే కాగా అది 2001 నాటికి 16 శాతానికి పెరిగిందని నివేదిక పేర్కొంది. ‘1998–99 నుంచి 2005–06 మధ్య మాత్రం వంధ్యత్వ రేటు తగ్గింది. ఇక మిగిలిన కాలం అంతా పెరుగుదలే గమనించినట్టు అధ్యయనం స్పష్టం చేసింది. ప్రస్తుతం వివాహిత మహిళల్లో ఎనిమిది శాతం మంది ప్రాథమిక, ద్వితీయ వంధ్యత్వానికి గురవుతున్నారు. అందులో 5.8 శాతం మంది ద్వితీయ వంధ్యత్వానికి గురవుతున్నారు’ అని పేర్కొంది.

వైద్య పరిష్కారాలు ఉన్నాయి..
సంతానలేమి సమస్య తీవ్రంగానే ఉందని గత కొంత కాలంగా అధ్యయనాలు చెబుతున్నాయి. మా వద్దకు వస్తున్న జంటల సంఖ్య కూడా దీన్ని నిర్ధారిస్తోంది అని నోవా ఐవీఎఫ్‌ సెంటర్‌ నిర్వాహకులు డా.స్వప్న అంటున్నారు. ఇటీవల ఈ సమస్యపై ఆధునికుల్లో అవగాహన పెంచడానికి విజయవాడలో ఎపీఆర్‌సీఓజీ ట్రస్ట్, విజయవాడ అబ్సెటెట్రిక్‌ అండ్‌ గైనకాలాజికల్‌ సొసైటీలతో కలిసి సదస్సును నిర్వహించిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆధునిక వైద్య ప్రపంచం సంతానలేమికి విభిన్న రకాల పరిష్కారాలను అందిస్తోంది. అయితే, ఇవన్నీ జీవనశైలి మార్పులతో ముడిపడి ఉన్నాయని చెప్పారు. సంతానలేమి కారణాలపై యువతలో అవగాహన పెరగాలని, కనీసం 25 నుంచి 28 ఏళ్లలోపు మధ్య వయసులోనే సంతానం పొందేలా ప్లాన్‌ చేసుకోవాలని ఆమె సూచించారు.

మరిన్ని వార్తలు