ఏ  బాక్సులో...ఏముందో

2 Dec, 2020 05:30 IST|Sakshi

డివిజన్‌ ఇన్‌చార్జిల్లో గుబులు 

అధిష్టానం దృష్టిలో పలుచన అవుతామనే భయం 

గ్రేటర్‌ వార్‌ ముగిసింది. నాయకుల్లో మరో టెన్షన్‌ మొదలైంది. ఓటింగ్‌ శాతం తగ్గడం ఎవరిని ముంచుతుందో... అనే ఆందోళన ఒకవైపు నెలకొంది. మరోవైపు నిక్షిప్తమైన ఓటరు తీర్పు ఎటువైపనే భయం వెంటాడుతోంది. ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్‌చార్జిల్లో ఇప్పుడు గుబులు మొదలైంది. తేడా వస్తే అధిష్టానం దృష్టిలో పలుచనవుతామని భయపడుతున్నారు. ఎప్పటిలాగా కాకుండా జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఈసారి ఒక ఊపుమీద జరిగాయి. ప్రచారంలో చాలామంది కనిపించినా ఓటింగ్‌కు మాత్రం నగర యువత దూరంగా ఉంది. ఓటింగ్‌ శాతం భారీగా తగ్గడంతో మెజారిటీ దేవుడు ఎరుగు... గట్టెక్కితే చాలనే అభిప్రాయంతో డివిజన్ల ఇన్‌చార్జిలు ఉన్నారు. ఓటర్‌ అంతరంగం అంతుపట్టడం లేదంటున్నారు. అభివృద్ధి మీద కాకుండా... మతం, దేశం పేరిట భావోద్వేగాలతో పార్టీలు ప్రచారం ముగించాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎవరి అంచనాలు తారుమారవుతాయి, ఎవరికి దెబ్బపడుతుందనేది... ఈనెల 4న బాక్సులు తెరిచి ఓట్లు లెక్కిస్తే తేలనుంది. అప్పటిదాకా వేచిచూడాల్సిందే.     
–సాక్షి, హైదరాబాద్‌ 

సమయమే లేదు... 
ప్రచారానికి కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే చిక్కింది. పెద్దగా సమయం లభించలేదు. ఏం చేయాలి, ఎలా చేయాలని ఆలోచించుకొని పూర్తిస్థాయిలో కార్యరంగంలోకి దిగేసరికి ప్రచారం గడువు ముగిసింది. ప్రతీ ఓటర్‌ను కలిసి ఓటు అడిగే సమయం దొరకలేదని అభ్యర్థులు, నాయకులు అంటున్నారు. టీఆర్‌ఎస్‌ మంత్రులను, ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి ఒక్కో డివిజన్‌ బాధ్యతను అప్పగించింది. గ్రేటర్‌ ప్రచారబాధ్యత తీసుకున్న కేటీఆర్‌ అన్నీ తానై రోడ్‌షోలు నిర్వహించారు. వివిధ సంఘాలతో, వాణిజ్యవర్గాలతో భేటీ అయ్యారు. చివర్లో... నవంబర్‌ 28న జరిగిన సీఎం సభ టీఆర్‌ఎస్‌లో జోష్‌ నింపిందని చెప్పొచ్చు. బీజేపీ కూడా ముఖ్యులకు డివిజన్ల బాధ్యతలు అప్పగించినా... ఎక్కువగా స్టార్‌ క్యాంపెయినర్ల ప్రచారంపైనే ఆధారపడింది. 

అమిత్‌ షాతో సహా పలువురు కేంద్ర మంత్రులు, యూపీ సీఎం యోగి, జాతీయ అధ్యక్షుడు నడ్డా తదితరులు ప్రచారానికి ఊపు తెచ్చారు. అయితే పార్టీని చివర్లో ఓటర్ల దగ్గరికి తీసుకెళ్లలేకపోయారనే భావన నెలకొందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పార్టీ అగ్రనేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్‌ ఒవైసీలు ప్రచారం నిర్వహించినా... ఎంఐఎం ప్రధానంగా ఎమ్మెల్యేలపై భారం మోపింది. పాతబస్తీలో పట్టు నిలుపుకునేందుకు శ్రమించింది. వరదల కారణంగా బస్తీల్లో కొంత వ్యతిరేకత వచ్చినా... అది పార్టీకి ఇబ్బందికరంగా పరిణమించదనే భావనలో మజ్లిస్‌ ఉంది. కాంగ్రెస్‌ పార్టీ ఇళ్లు సర్దుకొని రంగంలోకి దిగేసరికి ప్రచారం ముగింపుకొచ్చింది. పెద్ద నాయకులు విస్తృతంగా తిరగకపోవడం, పార్టీ నేతలు ఎవరికి వారే అన్నట్లుగా వ్యవహరించడం కాంగ్రెస్‌కు ప్రతికూలమని చెప్పొచ్చు.  

ఎంతచేసినా...  ఓటింగ్‌ పెరగలేదు 
ఆయా డివిజన్లకు పార్టీలు నియమించిన ఇన్‌చార్జీల్లో గుబులు మొదలైంది. గ్రేటర్‌ పోరు ప్రతిష్టాత్మకంగా మారడంతో ఈ ఇన్‌చార్జీలు తమ సొంత నియోజకవర్గాల నుంచి పార్టీ కేడర్‌ను దింపి మరీ ప్రచారం చేయించారు. ప్రచారంలో ఉన్న జోష్‌ ఓటింగ్‌లో లేకపోవడం... వీరికి ఇబ్బందిగా మారింది. స్థానిక నాయకులకు బాధ్యతలు అప్పగించినా... ఓటింగ్‌ శాతాన్ని పెంచలేకపోయామని మధనపడుతున్నారు. ఫలితంలో తేడా వస్తే... తమ రాజకీయ జీవితంపై ఇదొక రిమార్క్‌గా ఎక్కడ మారుతుందోనని ఆందోళన చెందుతున్నారు. పోటీ ముఖ్యంగా టీఆర్‌ఎస్, మజ్లిస్, బీజేపీ మధ్యే ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 31 మంది ఎక్స్‌అఫీషియో సభ్యుల బలంతో టీఆర్‌ఎస్‌ మేయర్‌ రేసులో ముందుంటుందని భావిస్తున్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు