బీజేపీ గెలుపు తాత్కాలికమే : ఒవైసీ

5 Dec, 2020 16:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో నగర ప్రజలు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. ఆయన ఎన్నికల ఫలితాలపై శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ పాతబస్తీలో బీజేపీ ప్రభావం లేదని అన్నారు. ముస్లింలు, హిందువులు అందరూ ఎంఐఎంకు ఓటు వేశారని తెలిపారు. అయితే తమ పార్టీకి వచ్చిన ఫలితాలపై సమీక్ష జరుపుతున్నామన్నారు. గ్రేటర్‌లో బీజేపీ గెలుపు తాత్కాలికమేనని, దాని ప్రభావం రాష్ట్రంలో ఉండదని పేర్కొన్నారు. ఇక మేయర్‌ అభ్యర్థిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఒవైసీ అ‍న్నారు. 

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రభావం రాష్ట్రంలో ఉండదని, తెలంగాణ ప్రజలకు కేసీఆర్‌పై ఎనలేని గౌరవం ఉందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ బలహీనపడటం వల్లే బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు. పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆయన తెలిపారు. కాగా ఎంఐఎం పాతబస్తీపై తమ పట్టును మరోసారి నిరూపించుకుంది. 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. 2016లోనూ ఎంఐఎంకు సరిగ్గా ఇన్ని సీట్లే రావడం గమనార్హం.

2023లో బీజేపీదే గెలుపు
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన స్థానాలు వచ్చాయని కేంద్రమంత్రి కిషన్‌ అన్నారు. ఈ ఫలితాలు అధికార టీఆర్‌ఎస్‌కు చెంపపెట్టు అన్నారు. తెలంగాణలో బీజేపీ క్రమంగా బలపడుతోందని తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఒవైసీ కానీ, కేసీఆర్‌ ఆపలేదన్నారు.

మరిన్ని వార్తలు