గెలిపిస్తే హైదరాబాద్‌ పేరు మారుస్తాం : యోగి

29 Nov, 2020 10:10 IST|Sakshi
శనివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచార రోడ్‌ షోలో యూపీ సీఎం యోగి అభివాదం

అవినీతి లేని స్వచ్ఛమైన పాలన బీజేపీతోనే సాధ్యం

తెలంగాణలో కేసీఆర్, మజ్లిస్‌లే అభివృద్ధి చెందాయి

గ్రేటర్‌ ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌  

భాగ్యగర్‌ కాలనీ/ యాకుత్‌పుర: నిజాం నిరంకుశ పాలనకు చరమగీతం పాడినట్లుగానే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మజ్లిస్, టీఆర్‌ఎస్‌ పార్టీలను ఓడించాలని ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ పిలుపునిచ్చారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం కోసం ఆయన శనివారం నగరంలోని శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, చార్మినార్‌ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఆల్విన్‌ కాలనీ, పాతబస్తీ లాల్‌దర్వాజా ప్రాంతాల్లో నిర్వహించిన సభల్లో యోగి ప్రసంగించారు.  ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ప్రజలు తిరిగి పట్టం కట్టారని చెప్పారు. 

కరోనా నియంత్రణలో మోదీ అద్భుత కృషిని ప్రపంచ దేశాలు కొనియాడుతున్నాయన్నారు. యూపీలో 10 కోట్ల మంది ప్రజలకు ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అందిస్తున్నామనీ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. మజ్లిస్, టీఆర్‌ఎస్‌ పార్టీలు, వారి కుటుంబాల అభివృద్ధికే తప్ప ప్రజలకు చేసిన మేలేం లేదన్నారు. హైదరాబాద్‌లోని నిజాం నిరంకుశ పాలనకు సర్ధార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ చరమగీతం పాడారని గుర్తు చేశారు. ప్రజలు సహకరిస్తే హైదరాబాద్‌కు భాగ్యనగరంగా పేరు మార్చనున్నట్లు చెప్పారు. నియంతలా వ్యవహరిస్తున్న కేసీఆర్‌ అవినీతి పాలన అంతం కావాలంటే ప్రజలు బీజేపీని గెలిపించాలన్నారు. 

వరద సాయాన్ని ప్రజల బ్యాంక్‌ ఖాతాల్లో వేయకుండా, నేరుగా నగదు రూపంలో ఎందుకు పంచారని టీఆర్‌ఎస్‌ను ప్రశ్నించారు. నాలుగువందల ఏళ్లుగా పరిష్కారానికి నోచని అయోధ్య వివాదానికి ప్రధాని మోదీ నేతృత్వంలో అద్భుతమైన పరిష్కారం లభించిందని, రామమందిర నిర్మాణం త్వరలోనే సాకారమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్రసింగ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.

సీఎం మాటలు సిగ్గుచేటు: బండి
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో లబ్లిపొందేందుకు మజ్లిస్‌కు, టీఆర్‌ఎస్‌కు సంబంధం లేదని సీఎం చెప్పడం సిగ్గు చేటని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. ఫామ్‌హౌజ్‌లో తప్పతాగి పడుకునే కేసీఆర్‌ హైదరాబాద్‌లో ప్రమాద పరిస్థితులు ఉన్నాయని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే రాజాసింగ్‌ మాట్లాడుతూ, అభివృద్ధి పేరుతో ముస్లింలను మోసగిస్తున్న మజ్లిస్‌ పార్టీకి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలన్నారు. చాంద్రాయణగుట్టలో అనేక మంది ముస్లిం మహిళలను ఇతర దేశాలకు విక్రయించారని ఆరోపించారు. ముస్లిం సోదరీమణులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు