Tamilisai Soundararajan: ‘కాళేశ్వరం’ అవినీతిపై గవర్నర్‌ కీలక ప్రకటన

15 Dec, 2023 16:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉభయ సభలను ఉద్దేశించి తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ శుక్రవారం ప్రసంగించారు. అంతా ఊహించినట్లుగానే ఆరు గ్యారెంటీల అమలుతో పాటు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ​ హయాంలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకునే విషయంలో గవర్నర్‌ తన ప్రసంగంలో క్లారిటీ ఇచ్చారు. 

ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండింటిని ఇప్పటికే తమ ప్రభుత్వం ఇప్పటికే అమలు చేసిందన్నారు. మిగిలిన వాటిని 100 రోజుల్లో అమలులోకి తీసుకువస్తామ్ని చెప్పారు. మహాలక్ష్మి స్కీమ్‌లో మిగిలిన హామీల అమలుకు కసరత్తు ప్రారంభించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై తమ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందని గవర్నర్‌ తెలిపారు. 

‘తొమ్మిదేళ్లలో తెలంగాణ ఆర్థిక పరిస్థితిని చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక పరిస్థితిపై వాస్తవ పరిస్థితులను ప్రజల ముందు ఉంచుతాం. దివాళా తీసిన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే మా ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణలో మార్పును ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా పాలన సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజా దర్భార్‌లో ప్రజాసమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ఇది మా ప్రభుత్వం అనే భావన ప్రజల్లో కలుగుతోంది’ అని గవర్నర్‌ అన్నారు. 

‘యూపీఏ ప్రభుత్వమే తెలంగాణను ఏర్పాటు చేసింది. సీఎం రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం రోజే తన లక్ష్యాలను స్పష్టంగా చెప్పారు. ఇది నిజమైన ప్రజా పాలన. నిరుద్యోగుల కలను మా ప్రభుత్వం నెరవేరుస్తుంది. అమరుల ఆశయాలు, ప్రజల ఆకాంక్షల మేరకే పాలన సాగిస్తాం. తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు’అని గవర్నర్‌ అన్నారు. 

‘లక్ష్యాలను సాధించేందుకు స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. డ్రగ్స్‌ పై మా ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంది. మహాలక్ష్మి స్కీమ్‌లోని మిగిలిన పథకాలను త్వరలో అమలు చేస్తాం. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తాం. పాలకులు సేవకులే తప్ప పెత్తందారులు కాదు. 10 ఏళ్ల నిర్బంధపు పాలన నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకున్నారు. మా పాలన పౌరహక్కులు, ప్రజాపాలనకు నాంది పలికింది. వైద్య ఖర్చులు పెరగడంతో ఆరోగ్యశ్రీని రూ.10 లక్షలకు పెంచాం. త్వరలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేస్తాం’  అని గవర్నర్‌ తెలిపారు. 

ఇదీచదవండి..యశోద ఆస్పత్రి నుంచి కేసీఆర్‌ డిశ్చార్జ్‌

>
మరిన్ని వార్తలు