నిర్వాసితులందరికీ న్యాయం చేస్తాం

16 Jun, 2022 01:09 IST|Sakshi
మంత్రి హరీశ్‌తో చర్చలు జరుపుతున్న కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్, భూ నిర్వాసితులు

18 ఏళ్లు నిండినవారికి స్థలాలిచ్చి, ఇళ్లు కట్టించే అంశాన్ని పరిశీలిస్తాం 

వారే ఇళ్లు కట్టుకుంటామంటే రూ.3 లక్షలు ఇచ్చేందుకు కృషి 

అదనపు కలెక్టర్‌తో సర్వే చేయిస్తాం 

గౌరవెల్లి భూనిర్వాసితులతో హరీశ్‌

రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా పరిహారమిచ్చామని వ్యాఖ్య 

హుస్నాబాద్‌కు నీళ్లు రావొద్దని కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయని మండిపాటు

సాక్షి, సిద్దిపేట: ‘భూసేకరణ చట్టం–2013 ప్రకారం గౌరవెల్లి ప్రాజెక్టు కింద ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తాం. ఎవరైనా మిగిలిపోయి ఉన్నవారికి సైతం పరిహారం అందేలా కృషి చేస్తాం. వెం టనే ఆందోళన విరమించుకుని ప్రాజెక్టుల పనులకు సహకరిస్తే.. 18 ఏళ్లు నిండిన వారికి స్థలాలిచ్చి ఇళ్లు కట్టించే అంశాన్ని పరిశీలిస్తాం. ఒకవేళ ఇళ్లు వారే కట్టుకుంటామంటే రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సాయం ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తాం.

అర్హులందరికీ ప్రయోజనం అందే విధంగా అదనపు కలెక్టర్‌ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సర్వే నిర్వహిస్తాం..’’అని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా గౌరవెల్లి భూనిర్వాసితులకు ఎకరానికి రూ.15 లక్షల పరిహారం ఇస్తున్నామని చెప్పారు. బుధవారం సిద్దిపేట జిల్లా మందపల్లిలో గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులతో మంత్రి హరీశ్‌రావు చర్చించారు.

అంతకుముందు సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. గౌరవెల్లి రిజర్వాయర్‌కు సంబంధించి ఇప్పటివరకు 97.82 శాతం భూసేకరణ జరిగిందని, ఈ మేరకు రూ.200 కోట్లు చెల్లించామని తెలిపారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితుడికి న్యాయం చేస్తామన్నారు. 

కొద్ది కుటుంబాలకే పెండింగ్‌! 
గౌరవెల్లి ప్రాజెక్టు కోసం 3,900 ఎకరాలకుగాను 3,816 ఎకరాల భూమి సేకరించామని.. కేవలం 84 ఎకరాల నిర్వాసితులు పరిహారం తీసుకోలేదని హరీశ్‌రావు తెలిపారు. మొత్తంగా ప్రాజెక్టు కింద 693 నివాసాలు ముంపునకు గురైతే.. 2015లోనే 683 ఇళ్లకు రూ.83 కోట్ల మేర పరిహారం చెల్లించామన్నారు.

ఆర్‌అండ్‌ఆర్‌ (సహాయ పునరావాసం) కింద మొత్తం 927 కుటుంబాలకు పరిహారం చెల్లించామని, మరో 10 కుటుంబాలు కోర్టును ఆశ్రయించాయని వెల్లడించారు. గౌరవెల్లి ప్రాజెక్టు కోసం చైనా నుంచి మోటార్లు తెప్పించామని, వాటికి ఉన్న 3 ఏళ్ల వారెంటీ దగ్గరపడుతుండటంతో వెట్‌రన్‌ నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. మూడేళ్ల వారెంటీ పూర్తయ్యాక.. మోటార్లు నడవకపోతే ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు. 

నీళ్లు రావొద్దని ప్రతిపక్షాల కుట్ర 
కొందరు ఇరిగేషన్‌ అధికారులను అడ్డుకోవడం వల్లే.. అధికారుల కోరిక మేరకు పోలీసు భద్రత కల్పించామని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వెళ్లి వివాదం సృష్టించాయని.. హుస్నాబాద్‌ ప్రాంత రైతులకు నీళ్లు రావొద్దనే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు.

నాడు మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్‌ల పనుల సమయంలోనూ రైతులు పోలీసులపై తిరగబడేలా చేసి తప్పుకున్నారని.. ఇప్పుడూ అలాగే చేస్తున్నారని ఆరోపించారు. ‘‘నిర్వాసితులకు దండం పెట్టి చెప్తున్నా.. కాంగ్రెస్, బీజేపీల ట్రాప్‌లో పడకండి. సమస్యలుంటే మీ తరఫున ప్రతినిధి బృందం వచ్చి అధికారులతో చర్చించండి. ఎన్నిమార్లు మాట్లాడటానికైనా అధికారులు సిద్ధం. ప్రభుత్వం నిర్వాసితుల పట్ల సానుభూతితో ఆలోచిస్తుంది’’అని హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. 

మంత్రితో నిర్వాసితుల చర్చలు 
బుధవారం గుడాటిపల్లిలో నిర్వాసితుల దీక్షా శిబిరాన్ని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డి సందర్శించారు. దీక్షలు కాదు మంత్రి హరీశ్‌రావును కలిసి సమస్యలను విన్నవిద్దామంటూ నిర్వాసితులను తీసుకుని ట్రాక్టర్లు, ఇతర వాహనాల్లో సిద్దిపేటకు బయలుదేరారు. పోలీసులు వారిని ఆపారు.

10 మంది నిర్వాసితులు, మరో 10 మంది కాంగ్రెస్‌ నేతలను తీసుకుని చిన్నకోడురులోని మందపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్న మంత్రి హరీశ్‌రావు వద్దకు తీసుకెళ్లారు. అంతా అక్కడే మంత్రితో చర్చలు జరిపారు. నిర్వాసితుల డిమాండ్లను విన్న మంత్రి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. 

మరిన్ని వార్తలు