కరువు, కర్ఫ్యూ, ముడుపులు, ముఠాలకు కేరాఫ్‌ కాంగ్రెస్‌  

12 Oct, 2023 04:42 IST|Sakshi

ఆ పార్టీని ప్రజలు ఎప్పుడో మరచిపోయారు: మంత్రి హరీశ్‌రావు 

జనగామ: రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ తప్పిదారి అధికారంలోకి వస్తే.. కైలాసం ఆటలో పెద్ద పాము మింగిన విధంగా తెలంగాణ పరిస్థితి మారిపోతుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిని జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో, ఈ నెల 16న జనగామ జిల్లా కేంద్రంలో సీఎం కేసీఆర్‌ భారీ బహిరంగ సభ నేపథ్యంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఇందులో మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక్క చాన్స్‌ అంటూ ప్రజల ను బతిమిలాడుకుంటున్న కాంగ్రెస్‌కు.. ప్రజలు 11 సార్లు అధికారం కట్టబెడితే ఒరగబెట్టింది ఏమీ లేదన్నా రు.

ప్రత్యేక రాష్ట్రంలో కేసీఆర్‌ తెలంగాణను దేశం గర్వించే స్థాయికి తీసుకెళ్లారన్నారు. కరువులు, కర్ఫ్యూలు, ముడుపులు, ముఠాలు, మతం పేరిట గొడవలకు కాంగ్రెస్‌ కేరాఫ్‌ అడ్రస్‌ అని, ప్రజలు ఆ పార్టీని పక్కన బెట్టి ఎప్పుడో మరచిపోయారని అన్నారు. కర్ణాటకలో ప్రజలను నమ్మించి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్‌ పాలనలో కరెంటు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

 ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా, ప్రతి ఇంటికి మంచినీళ్లు అందించడంలో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలుస్తోందన్నారు. ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

అన్నా.. మీ ఆశీర్వాదం కావాలి 
సమావేశంలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మాట్లాడు తుండగా.. అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి యాదగిరిరెడ్డికి కాళ్లు మొక్కేందుకు వంగారు. ‘అన్నా.. మీ ఆశీర్వాదం కావాలి’అంటూ కడుపులో తలపెట్టి మోకాళ్లను పట్టుకున్నారు. ఇందుకు ప్రతి గా ముత్తిరెడ్డి మాట్లాడుతూ ‘తమ్ముడూ.. మీ గెలు పులో నా కృషి వందశాతం ఉంటుంది’అని బదులిచ్చారు.  

మరిన్ని వార్తలు