రావత్‌, తివారీ ట్వీట్లు; కాంగ్రెస్‌లో కలకలం

23 Dec, 2021 15:07 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీలో అధినాయకత్వానికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్న సీనియర్‌ నాయకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. హైకమాండ్‌ వైఖరిని తప్పుబడుతూ తాజాగా మనీష్ తివారీ ట్వీట్‌ చేయడం ఆ పార్టీలో కలకలం రేపుతోంది. ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ పార్టీలో ఏర్పడిన సంక్షోభానికి కేంద్ర నాయకత్వ విధానాలే కారణమన్నట్టుగా ఆయన ట్వీట్‌ చేశారు. ‘మొదట అసోం, తర్వాత పంజాబ్‌, ఇప్పుడు ఉత్తరాఖండ్‌.. ’ అంటూ ట్విటర్‌లో రాసుకొచ్చారు. ఉత్తరాఖండ్‌ మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ సొంత పార్టీ నాయకులపై అసంతృప్తి వ్యక్తం చేసిన మరుసటిరోజే మనీష్ తివారీ గళం విప్పడం గమనార్హం.

సొంత పార్టీలోనే సహాయ నిరాకరణ: రావత్‌

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అక్కడి రాష్ట్ర కాంగ్రెస్‌ ప్రచార చీఫ్, రాష్ట్ర మాజీ సీఎం హరీశ్‌ రావత్‌ సొంత పార్టీ నాయకుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తంచేశారు.  ‘ఎన్నికల్లో కష్టపడి పార్టీని విజయతీరాలకు చేర్చే పనిలో చేదోడువాదోడుగా ఉండాల్సిందిపోయి కాంగ్రెస్‌ నేతలే మొండిచేయి చూపిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలను మొసళ్లుగా వదిలింది. అయినాసరే పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఎన్నికల సంద్రాన్ని ఈదుతున్నాను. ఎన్నికల సాగరంలో నాకు సాయం చేయకపోగా కొందరు నా కాళ్లు చేతులూ కట్టేస్తున్నారు. ఇక రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవాలని పిస్తోంది’ అని రావత్‌ ట్వీట్‌ చేశారు. (చదవండి: మహిళా వివాహ వయసు పెంపు.. వాళ్లని బాధిస్తోంది)

కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తూ..

ట్వీట్లపై రావత్‌ మీడియా సలహాదారు సురేంద్ర స్పందించారు. ‘కొన్ని శక్తులు కాంగ్రెస్‌లో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తూ కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలను దెబ్బతీస్తున్నాయి’ అని అన్నారు. రావత్‌ నేతృత్వంలోకాకుండా ఉమ్మడి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాలని ఏఐసీసీ ఉత్తరాఖండ్‌ ఇన్‌చార్జ్‌ దేవేంద్ర యాదవ్‌ పట్టుబడుతుండటం గమనార్హం. కాగా, తాను చేసిన ట్వీట్‌పై వివరణ ఇచ్చేందుకు  హరీశ్‌ రావత్‌ నిరాకరించారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని విలేకరులతో అన్నారు. (చదవండి: జియా ఉల్‌ హక్‌ హయాం.. మోదీ పాలన ఒక్కటే)

మరిన్ని వార్తలు