BJP Leaders House Arrest: కల్వకుంట్ల  రాజ్యాంగాన్ని అడ్డుకుంటాం

11 Feb, 2022 03:56 IST|Sakshi

పార్టీ నేతల గృహ నిర్బంధంపై భగ్గుమన్న బీజేపీ

ప్రజల ప్రాణాల కంటే సీఎం సభ ముఖ్యమా అన్న సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: తమ ఎమ్మెల్యేలు టి.రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, ఈటల రాజేందర్, ఇతర నాయకులను గృహ నిర్బంధంలో ఉంచడంపై రాష్ట్ర బీజేపీ భగ్గుమంది. జనగామలో బుధవారం టీఆర్‌ఎస్‌–బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలో గాయపడిన బీజేపీ కార్యకర్తలను పార్టీ నేతలు పరామర్శించడానికి వీల్లేకుండా అడ్డుకో వడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శుక్రవారం సీఎం కేసీఆర్‌ జనగామ, ఇతర జిల్లాల పర్యటన నేపథ్యంలో బీజేపీ ముఖ్యనేతలు, ఎమ్మెల్యేల కదలికలపై ఆంక్షలు విధించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్రంగా తప్పుబట్టారు.

ప్రజాస్వామ్యం మంటగలిసింది 
తెలంగాణలో ప్రజాస్వామ్యం మంట కలిసిందని బండి సంజయ్‌ విమర్శించారు. 317 జీవోపై ప్రజా స్వామ్యబద్ధంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన ఉపాధ్యాయులను ఎక్కడికక్కడ నిర్బంధించిన పోలీసులు.. టీఆర్‌ఎస్‌ నిరసనలకు అనుమతిని వ్వడం సిగ్గుచేటన్నారు. జనగామలో గాయాలపా లైన కార్యకర్తలు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే.. వారి ప్రాణాల కంటే పోలీసులకు సీఎం సభే ముఖ్యమైందా అని సంజయ్‌ మండిపడ్డారు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బీజేపీ అడ్డుకుని తీరుతుందని, ఇందుకోసం ఎంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు.

నియంతృత్వానికి నిదర్శనం
ఎమ్మెల్యేలను గృహ నిర్బంధంలో ఉంచడం అప్రజాస్వామిక చర్యకు, నియంతృత్వానికి నిదర్శనమని ఎంపీలు ధర్మపురి అర్వింద్, సోయం బాపూరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఖబడ్దార్‌ కేసీఆర్‌.. ఈట్‌ కా జవాబ్‌.. పత్తర్‌ దీయెంగే’ (ఇటుకకు జవాబు రాయి ఇస్తుంది) అంటూ హెచ్చరించారు.  

మరిన్ని వార్తలు