డ్యామిట్‌ కథ అడ్డం తిరిగింది.. రేవంత్‌కు కష్టాలు.. తెలివిగా తప్పుకున్న కోమటిరెడ్డి

23 Aug, 2022 14:40 IST|Sakshi

రాజకీయాలలో నోరు జారితే ఒక్కోసారి అది ప్రమాదకరంగా మారుతుంది. అందులోను ముఖ్యమైన స్థానాలలో ఉన్నవారు మరీ జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ పార్టీలు ఒకదానిపై ఒకటి పలు విమర్శలు చేసుకుంటూనే ఉంటాయి. అలాగే నేతలు పలు ఆరోపణలు గుప్పిస్తుంటారు. కొన్నిసార్లు హద్దులు కూడా దాటుతుంటారు. కానీ కొన్ని సందర్భాలలో అది పెద్ద సమస్య అవుతుందని చెప్పడానికి తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న ఉదంతాలనే ఉదాహరణలుగా తీసుకోవచ్చు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై పిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి, మరో నేత అద్దంకి దయాకర్‌లు చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం రేపాయి.

కోమటిరెడ్డి బ్రదర్స్‌గా పేరొందిన రాజగోపాలరెడ్డి, వెంకటరెడ్డిలు నల్లగొండ ఉమ్మడి జిల్లాలో కీలకంగా ఉన్న నేతలు. రాజగోపాలరెడ్డి కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పి బీజేపీలో చేరారు. ఈ సమయంలో ఆయన సోదరుడు ఎంపీ అయిన వెంకటరెడ్డి ఏమి చేస్తారన్న ప్రశ్న వచ్చింది. ఆయన కాంగ్రెస్‌ను వీడనని చెప్పారు. కానీ అదే సమయంలో ఆయన మునుగోడు శాసనసభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలో ఎంతవరకు పార్టీకి సహకరిస్తారన్నదానిపై సందేహాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఎవరి వ్యూహాలు వారు అమలు చేస్తుంటారు. వెంకటరెడ్డి ఈ విషయంలో ఆచితూచి అడుగు వేస్తున్నప్పుడు కాంగ్రెస్ నేతలు ఎలా పడితే అలా విమర్శలు చేయడం వల్ల జరిగే నష్టాన్ని సరిగా అంచనా వేసుకున్నట్లు లేరు.

రాజకీయ నేత ఎవరైనా తమకు ఎలా అవకాశాలు వస్తాయా? తద్వారా తాము అనుకున్నవైపు వెళ్లవచ్చని చూస్తుంటారు. రాజగోపాలరెడ్డి బిజెపిలోకి వెళ్లినా, వెంకటరెడ్డి ఇప్పటికిప్పుడు ఆ ఆలోచన చేయలేకపోతున్నారు. ఆయన కూడా కేంద్ర మంత్రి అమిత్ షాను కలిసినా, పార్టీ మారతారా?లేదా అన్నదానిపై క్లారిటీ ఇవ్వలేదు. కాకపోతే తనను కాంగ్రెస్ నుంచి వెళ్లగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. అలాంటి తరుణంలో మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నిక నిమిత్తం కాంగ్రెస్ ఆధ్వర్యంలో చండూరు వద్ద ఒక సభ నిర్వహించారు. రాజగోపాలరెడ్డి కి వ్యతిరేకంగా జరిగిన ఈ సభను తనకు తెలియకుండా పెడతారా అని వెంకటరెడ్డి నిరసన తెలిపారు. తాను ఆ సభకు వెళ్లనని కూడా స్పష్టం చేశారు. అయినా వీరి అండ లేకపోయినా, జన సమీకరణలో కాంగ్రెస్ నేతలు సఫలం అయ్యారు.

కానీ ఆ సభలో వెంకటరెడ్డిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ చేసిన వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది. ఆయన ఒక అసభ్య పదాన్ని కూడా వాడారు. దాంతో వెంకటరెడ్డి మరింత మండిపడ్డారు. అలాగే రేవంత్ రెడ్డి కూడా మరో సందర్భంలో కాంగ్రెస్‌లో  సీనియర్, జూనియర్ అన్న పాయింట్ పై మాట్లాడుతూ హోంగార్డు ఎంత సీనియర్ అయినా, ఐపిఎస్ కాలేరు కదా అని వ్యాఖ్యానించారు. సహజంగానే కాంగ్రెస్ సీనియర్‌లలో ఇది కాక పుట్టిస్తుంది. అసలే ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్న వెంకటరెడ్డి వెంటనే దీనిని అందుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో హోంగార్డుల వంటి తాము ఎందుకని, ఐపిఎస్ హోదా ఉన్న నాయకులే గెలిపించుకుంటారులే అని బదులు చెప్పారు. అసలు సభ పోయి, ఈ వివాదమే మునుగోడులో ప్రధాన అంశం అయి కూర్చుంది.

ఒక వైపు కాంగ్రెస్‌లో టికెట్ కోసం కొందరు నేతల మధ్య పోటీ, దానిని తేల్చుకోలేక సతమతమవుతున్న తరుణంలో వెంకటరెడ్డి వివాదం కాంగ్రెస్‌కు తలనొప్పిగా మారింది. అద్దంకి దయాకర్ , రేవంత్ రెడ్డిలు తమ వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పారు. అయినా వెంకటరెడ్డి శాంతించలేదు. దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలన్న కొత్త డిమాండ్ పెట్టారు. అలాగే రేవంత్ వ్యాఖ్యలపై పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాందీ వద్దే తేల్చుకుంటానని ఆయన ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం కూడా అధిష్టానానికి కొందరు నేతలు రేవంత్‌పై పిర్యాదు చేయకపోలేదు. అందరిని కలుపుకుని వెళ్లాలని రేవంత్‌ను డిల్లీ కాంగ్రెస్ పెద్దలు  ఆదేశించారు. అయినా రేవంత్ తొందరపాటుతో నోరు జారారు. అదే వెంకటరెడ్డికి ఆయుధం అయింది. ఒక దశలో రాజగోపాలరెడ్డిపై వెంకటరెడ్డినే పోటీకి నిలబెట్టాలన్న ఆలోచన  కూడా చేశారని అంటారు.

ఇప్పుడు ఆ పరిస్థితి నుంచి అసలు తాను మునుగోడులో  ప్రచారం చేయవలసిన అవసరం లేని దశకు వెంకటరెడ్డి వెళ్లారు. ఆయన భవిష్యత్తులో పార్టీలో ఉంటారో, ఉండరో కానీ, ఆయా అంశాలపై చికాకు సృష్టిస్తారన్న భావన కలుగుతుంది. వ్యూహాత్మకంగా వెంకటరెడ్డిని ఉక్కిరి బిక్కిరి చేయవలసిన కాంగ్రెస్ నేతలు, అందుకు విరుద్దంగా ఆయన వ్యూహంతో సతమతమవుతున్నారు. ఇదే వెంకటరెడ్డి కొంతకాలం క్రితం రేవంత్ ను పిసిసి అధ్యక్షుడిగా ప్రకటించినప్పుడు తీవ్రమైన ఆరోపణ చేశారు. పార్టీ తెలంగాణ ఇన్ చార్జీ మాణిక్కం ఠాగూర్‌కు పాతిక కోట్లు ఇచ్చి పదవి కొనుకున్నారని ఆయన ఆరోపించారు. దానిపై తొలుత ఠాకూర్ సీరియస్ అయినా, ఆ తర్వాత సర్దుకుని, వెంకటరెడ్డికి స్టార్ కాంపెయినర్ హోదా ఇచ్చారు. ఆ సందర్భం అలాంటిది. పార్టీలో ఉన్నంతవరకు వెంకటరెడ్డితో తగాదా పెట్టుకుంటే వచ్చే ఇబ్బందులు ఏమిటో పార్టీ నేతలకు తెలుసు. ఎవరైనా నేత పార్టీకి దూరంగా ఉండాలని అనుకున్నా, పార్టీ నుంచి వైదొలగాలని అనుకున్నా, దాగుడుమూతల గేమే ఆడతారు.

పరిస్థితి మొత్తం తనకు అనుకూలంగా ఉందని ఆయన భావించే వరకు రాజకీయం ఇలాగే ఉంటుంది.  మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాలరెడ్డి పార్టీని వీడడం, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఉపఎన్నిక రాబోతోంది. అది కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకం అవుతుంది. ఇలాంటి సమయంలో ఈ రచ్చ పార్టీకి పెద్ద తలనొప్పి అవుతుంది. దయాకర్ ఒకప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్‌తో సన్నిహితంగానే ఉండేవారు. కానీ ఈ మధ్యకాలంలో రేవంత్‌కు దగ్గరైనట్లు ఉన్నారు. అయినా అనకూడని మాట అని వివాదంలో ఇరుకున్నారు. రేవంత్ మొదటి నుంచి దురుసుగా మాట్లాడే వ్యక్తే. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై గత కొద్ది సంవత్సరాలుగా ఆయన ఆరోపణలు గుప్పించడమే కాకుండా, కొంత అభ్యంతర భాషను కూడా వాడుతుంటారు. దానికి ప్రతిగా టిఆర్ఎస్ నేతలు కూడా అంతే ఘాటుగా మాట్లాడుతుంటారు.

అది రాజకీయ వివాదంగానే ఉంటుంది. కానీ సొంత పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు సహజంగానే వాటికి ప్రాధాన్యత ఏర్పడుతుంది. అసలే అవకాశం కోసం ఎదురు చూస్తున్న వెంకటరెడ్డికి రేవంత్ వ్యాఖ్యలు కలిసి వచ్చాయి. దీనివల్ల బిజెపి పక్షాన పోటీచేయనున్న తన సోదరుడు రాజగోపాలరెడ్డికి వ్యతిరేకంగా ప్రచారం చేయకుండా వెంకటరెడ్డి తప్పించుకునే అవకాశం వచ్చింది. ఉప ఎన్నికలో బిజెపి గెలిస్తే వెంకటరెడ్డి రాజకీయ నిర్ణయాలు ఒక రకంగా ఉండవచ్చు. అలాకాకుండా రాజగోపాలరెడ్డి ఓటమి చెందితే, ఆయనకు వచ్చే ఓట్ల ఆధారంగా పరిస్థితిని అంచనా వేసుకుని రాజకీయ నిర్ణయం తీసుకోవచ్చు. ఎటు వచ్చినా తమ రాజకీయ ప్రయోజనాలకు విఘాతం కలగకుండా కోమటిరెడ్డి చూసుకోగలుగుతారు.

కాగా కాంగ్రెస్‌ను వీడడంపై రాజగోపాలరెడ్డి ద్రోహి అంటూ మునుగోడులో పోస్టర్లు వెలిశాయి. ఇది రేవంత్ కుట్ర అని ఆయన విమర్శిస్తున్నా, ఉప ఎన్నికలో విజయం సాధించేవరకు ఆయన ఇలాంటి చిక్కులు ఎదుర్కోక తప్పదు. కాగా టిఆర్ఎస్‌లో కూడా అసమ్మతి చికాకుగానే ఉంది. మాజీ ఎమ్మెల్యే కె.ప్రభాకరరెడ్డికి మళ్లీ టిక్కెట్ ఇవ్వాలని కెసిఆర్ ఆలోచిస్తున్నారని వార్తలు వచ్చాయి. ఆయనకు పోటీగా కొందరు నేతలు జట్టుకట్టి కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. అయినా ఇంకా ప్రభాకరరెడ్డి వైపే కేసీఆర్ ఆలోచన చేస్తే, స్థానికంగా ఆయనను వ్యతిరేకించే నేతలు టిఆర్ఎస్ విజయానికి ఎంత కృషి చేస్తారన్న డౌటు వస్తుంది. టిఆర్ఎస్, బిజెపిలు పోటాపోటీ సభలు నిర్వహించాయి. అమిత్ షా సభకు ఒక రోజు ముందుగానే కెసిఆర్ సభ నిర్వహించి  బిజెపికి సవాల్ విసిరారు. భావి తెలంగాణ రాజకీయానికి దిక్సూచి వంటి మునుగోడు ఉప ఎన్నికకు తేదీ ఇంకా రాకముందే రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ప్రత్యర్ధి రాజకీయ పార్టీలతో పోరు, మరో వైపు సొంత పార్టీలో అసమ్మతి తలనొప్పులతో కాంగ్రెస్,టిఆర్ఎస్‌లు ఇబ్బంది పడుతున్నాయి.


-కొమ్మినేని శ్రీనివాసరావు
సీనియర్‌ పాత్రికేయులు 
 

మరిన్ని వార్తలు