కేసీఆర్‌ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారు?: రేవంత్‌రెడ్డి

4 Nov, 2023 16:09 IST|Sakshi

సాక్షి,హైదరాబాద్: కోదండరాంపై ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బీఆర్‌ఎస్‌ నేతలను చెప్పుతో కొడతారని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు. కోదండరాం కాంగ్రెస్‌ కోసం పోటీ చేయకపోతే కేఏ పాల్‌ బీఆర్‌ఎస్‌ కోసమే పోటీ చేయడం లేదా చెప్పాలని ఫైర్‌ అయ్యారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్‌ కుటుంబంపై మండిపడ్డారు.

కేసీఆర్‌ అవినీతికి కాళేశ్వరం ప్రాజెక్టు బలయిందని రేవంత్‌ విమర్శించారు. కేసీఆర్ కుటుంబం ఆర్థిక ఉగ్రవాద కుటుంబం అని ఆరోపించారు. ఈ కుటుంబాన్ని శిక్షించడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కాపడడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తోందన్నారు. కాళేశ్వరంపై జాతీయ స్థాయిలో ఒక కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు. ప్రాజెక్టులో అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరగాలన్నారు. ప్రధాని మోదీ తెలంగాణకు వచ్చినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించాలని కోరారు. మేడిగడ్డ బ్యారేజ్‌కు జరిగిన డ్యామేజ్ పై చర్యలు తీసుకోవాలన్నారు.

అవినీతి వాసననే పడని మోదీ కేసీఆర్‌ సర్కారు కంపుని ఎలా భరిస్తున్నారని రేవంత్‌ ప్రశ్నించారు. మోదీకి కంపు కొట్టకుండా కేసీఆర్ ఏదైనా సెంటు కొట్టి వశీకరణ చేస్తున్నారా? చెప్పాలన్నారు.ఇద్దరం ఒకటే అని కేసీఆర్,మోదీ చెప్పదలచుకున్నారా? అని నిలదీశారు. కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చారన్నారు.కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ఆలోచనలు మారి ఆశలు పెరిగాయన్నారు.

‘మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజుల  ప్లానింగ్ వేరు,నిర్మాణం వేరుకావడం వల్లే మునిగిపోతున్నాయి.కేసీఆర్ ధనదాహానికి మేడిగడ్డ కుంగింది. కాళేశ్వరం కోసం తన మెదడును ఖర్చు చేశానని చెప్పిన కేసీఆర్ లోపాలు బయట పడగానే తప్పించుకుంటున్నారు. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అడిగే ప్రశ్నలకు కేసీఆర్‌ ఎందుకు సమాధానం ఇవ్వడం లేదు. ఎల్ అండ్ టీ కంపెనీపై చర్యలు తీసుకోవడానికి కేసీఆర్ ఎందుకు వెనకాడుతున్నారు. కమిషన్లు నొక్కేయడానికే  కేసీఆర్ ప్రణాళిక బద్దంగా ప్లాన్ వేశారు’అని రేవంత్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు