ప్రతిష్టాత్మక పోరు: ‘కైరానా’ మే హైరానా!

31 Jan, 2022 14:03 IST|Sakshi
నహిద్‌ హసన్, మృగాంక సింగ్‌

నాలుగు దశాబ్దాలుగా సింగ్, హసన్‌ కుటుంబాల మధ్యే ఎన్నికల పోరు

గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన నహిద్‌ హసన్‌

ఈసారి హసన్‌ను దెబ్బతీసేలా బీజేపీ వ్యూహాలు 

యూపీలో హాట్‌ సీట్లలో ఒకటైన కైరానాలో నాలుగు దశాబ్దాలుగా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న పోరు ప్రస్తుత ఎన్నికల్లోనూ ప్రతిష్టాత్మకంగా మారింది. సమాజ్‌వాదీ తరపున పోటీ చేస్తున్న నహిద్‌ హసన్, బీజేపీ తరపున పోటీ చేస్తున్న మృగాంక సింగ్‌ల మధ్యే ఈ ఎన్నికల్లోనూ గట్టి పోరు జరుగనుంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నహిద్‌ హసన్‌ గెలుపొందగా, 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుకుంసింగ్‌ కుటుంబాన్ని పక్కనబెట్టిన బీజేపీ, ప్రదీప్‌ చౌదరిని నిలబెట్టి గెలిపించుకుంది. అయితే ఈసారి తొలిదశలో ఫిబ్రవరి 10న జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి మృగాంకను బరిలో నిలిపిన కమలదళ పెద్దలు, తమ సత్తా చాటేందుకు క్షేత్రస్థాయిలో ఇప్పటికే రంగంలోకి దిగారు.      
– సాక్షి, న్యూఢిల్లీ

వలసలు, శాంతిభద్రతల సమస్యలపైనే నజర్‌ 
2017లో వలసల సమస్యతో పాటు శాంతిభద్రతల అంశాన్ని తెరపైకి తెచ్చి అప్పటి ఎస్పీ ప్రభుత్వాన్ని కమలదళం చుట్టుముట్టింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశాన్నే ప్రచారాస్త్రంగా చేసుకొని బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటికీ, కైరానాలో ప్రజలు మాత్రం ఎస్పీ అభ్యర్థి నహిద్‌ హసన్‌ వైపే మొగ్గు చూపారు. అయితే గతంలో మాదిరిగానే వలసలు, శాంతిభద్రతల అంశాలను బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. అందుకే  కైరానాలో బీజేపీ అభ్యర్థికి ఓట్లు వేయాలని కోరుతూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ఇంటింటికీ వెళ్లి ప్రచారాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వలస బాధితులను కూడా కలిశారు. గతేడాది నవంబర్‌లోనూ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ కూడా వలస బాధితులను కలిశారు. (క్లిక్‌: అన్నయ్యతో అవ్వట్లేదు... ప్రియాంక అలుపెరుగని పోరాటం)

అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కైరానా వలసల అంశాన్ని లేవనెత్తిన బీజేపీకి మాత్రం కైరానాలోనే ఎదురుదెబ్బ తగిలింది. కాగా బీజేపీ లేవనెత్తిన ఈ అంశాన్ని ఎదుర్కొనేందుకు ఎస్పీ కూటమి  పరస్పర సోదరభావ అంశంతో పాటు నహిద్‌ హసన్‌ను గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద అరెస్ట్‌ చేయడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడంపై దృష్టి సారించింది. ప్రస్తుతం ఎస్పీ–ఆర్‌ఎల్‌డీ కూటమి నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే నహిద్‌ హసన్‌ ఎస్పీ టికెట్‌పై అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన మరుసటి రోజే గ్యాంగ్‌స్టర్‌ చట్టం కేసులో పోలీసులు అరెస్టు చేసి, 14 రోజుల రిమాండ్‌కు పంపారు. దీంతో కైరానాలో అతని తరపున ప్రచార బాధ్యతలను చెల్లెలు ఇక్రా హసన్‌ నిర్వహిస్తున్నారు.  

రెండు కుటుంబాల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం
కైరానా ప్రాంతంలో సుమారు 120 ఏళ్ళ క్రితం మాజీ ఎంపీ బాబు హుకుం సింగ్, మునవ్వర్‌ హసన్‌ల పూర్వీకులు ఒకే కుటుంబానికి చెందినప్పటికీ, అందులో ఒకరు ఇస్లాంను స్వీకరించడంతో మొదలైన వైరం ఇప్పుడు తర్వాత తరానికి చేరింది. సుమారు నాలుగు దశాబ్దాలుగా ఒక్కొక్కసారి ఒక్కో కుటుంబానిది పైచేయిగా సాగుతోంది. 2009 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీ నుంచి పోటీ చేసిన మునవ్వర్‌ హసన్‌ భార్య తబస్సుమ్‌ హసన్, హుకుంసింగ్‌ను ఓడించారు. 2012 అసెంబ్లీ ఎన్నికల్లో హుకుంసింగ్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014లో కైరానా నుంచి ఎంపీగా గెలవడంతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.

అనంతరం 2014లో జరిగిన ఎమ్మెల్యే ఉపఎన్నికలో మునవ్వర్‌ కుమారుడు నహిద్‌ హసన్‌ సమాజ్‌వాదీ తరపున పోటీ చేసి గెలుపొందారు. అయితే 2018లో హుకుంసింగ్‌ మరణంతో ఖాళీ అయిన స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ తరపున పోటీ చేసిన తబస్సుమ్‌ హసన్‌ చేతిలో దివంగత హుకుం సింగ్‌ కుమార్తె మృగాంక సింగ్‌ ఓడిపోయారు. అంతకు ముందు 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ మృగాంక సింగ్‌పై నహిద్‌ హసన్‌ విజయం సాధించారు. ఆ తర్వాత 2019 లోక్‌సభ ఎన్నికల్లో హుకుంసింగ్‌ కుటుంబాన్ని పక్కనబెట్టిన బీజేపీ... ప్రదీప్‌ చౌదరిని బరిలో దింపడంతో తబస్సుమ్‌ హసన్‌ మరోసారి పరాజయం పాలయ్యారు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!)

మరిన్ని వార్తలు