నీ కొడుకు వయసుదాన్ని..సిగ్గుండాలి : కంగనా ఫైర్

26 Oct, 2020 13:06 IST|Sakshi

సాక్షి,ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేపై బాలీవుడ్ ఫైర్  బ్రాండ్ కంగనా రనౌత్ కౌంటర్ ఎటాక్ చేశారు. ప్రధానంగా వారి సొంత రాష్ట్రంలో తిండికి గతిలేనవారు ముంబైకి డబ్బు సంపాదించుకుని, నమ్మక ద్రోహానికి పాల్పడుతున్నారన్న ఉద్ధవ్ వ్యాఖ్యలపై ఆమె ఫైర్ అయ్యారు. హిమాలయాల అందం ప్రతి భారతీయుడికి ఎలా చెందుతాయో, ముంబై అందించే అవకాశాలు కూడా ప్రతి ఒక్కరికి చెందుతాయంటూ కౌంటరిచ్చారు. ఈ రెండు రాష్ట్రాలు తనకు  తన సొంత ఇళ్లతో సమానమని కంగనా ప్రకటించారు.  ముఖ్యమంత్రి స్థానంలో ఉండి, దసరా రోజున ఒక మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసి మొత్తం రాష్ట్రం పరువు తీశారంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు. (మౌనం వీడిన ఉద్ధవ్ ఠాక్రే : కంగనాపై ధ్వజం)

వారసత్వంతో అధికారంలోకి వచ్చారంటూ ముఖ్యమంత్రి  ఉద్ధవ్ పై సోమవారం కంగనా వరుస ట్వీట్లలో తీవ్ర విమర్శలు  చేశారు. "ముఖ్యమంత్రీ,  నీలాగా తండ్రి పవర్ ని అడ్డంపెట్టుకుని అధికారంలోకి  రాలేదు.. నేను కూడా గొప్ప కుటుంబానికి చెందినదాన్నే.. వాళ్ల సంపదపై  ఆధారపడి జీవించాలనుకుంటే.. అక్కడే (హిమాచల్ ప్రదేశ్) ఉండేదాన్ని'' అన్నారు. తాను నెపోటిజం బ్రాండ్ కాదనీ, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం ఉన్నాయన్నారు. తాను స్వయంశక్తితో ఎదిగిన మహిళనని చెప్పుకొచ్చారు. తమ ప్రజాస్వామ్య హక్కులను హరించే సాహసానికి పూనుకోవద్దని,  తమను విభజించవద్దని సీఎంను హెచ్చరించారు.

ఇకనైనా అసభ్యకర ప్రసంగాలు కట్టిపెట్టాలని కంగనా సీఎంపై మండిపడ్డారు. అలాగే గతంలో సంజయ్ రౌత్ హరాం ఖోర్ అన్నారు.. ఇపుడు ఉద్ధవ్ నమక్ హరాం అంటున్నారంటూ కంగనా ఆగ్రహం వ్యక్తం చేశారు. "నేను మీ కొడుకు వయసుదాన్ని, నాపై అలాంటి వ్యాఖ్యలు చేయడానికి సిగ్గుండాలి'' అంటూ ట్వీట్ చేశారు. కాగా గతంలో ముంబై మున్సిపల్ అధికారులు తన ఇంటి కూల్చివేతపై సందర్బంగా నా ఇంటిలానే… త్వరలో ఉద్ధవ్  అహంకారం కూలి పోతుందంటూ మహా సీఎంపై కంగనా మండిపడిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు