కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్‌: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!

14 Jan, 2024 21:00 IST|Sakshi

ఎన్నికల టైమ్‌లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్‌లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు?

గులాబీ పార్టీ తరపున కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్‌కుమార్‌కు సమీప బంధువు ఒకరికి జెన్‌కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్‌ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్‌కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్‌ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్‌ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్‌ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్‌లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు.  ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్‌ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది.

మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్‌ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్‌ హీట్‌ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

చదవండి: బీజేపీ, కాంగ్రెస్‌ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్‌

>
మరిన్ని వార్తలు