అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై యడియూరప్ప కీలక వ్యాఖ్యలు..

31 Jan, 2023 15:18 IST|Sakshi

బెంగళూరు: త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై మాజీ సీఎం, బీజేపీ నేత బీఎస్ యడియూరప్ప కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తన వయసు 80 ఏళ్లని ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు.  బెళగావిలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈమేరకు ప్రకటన చేశారు.

అయితే తాను ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు శాయశక్తులా కృషి చేస్తానని యడియూరప్ప స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి బీజేపీని మరోసారి అధికారంలోకి తెస్తానని పేర్కొన్నారు.

రాష్ట్రానికే పరిమితం..
అలాగే తనకు జాతీయ రాజకీయాల పట్ల ఆసక్తి లేదని, కర్ణాటకకే పరిమితం అవుతానని యడ్డీ స్పష్టంచేశారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ తనను కేంద్రానికి రమ్మని అప్పుడే అడిగారని, కానీ తాను మాత్రం సున్నితంగా తిరస్కరించానని గుర్తు చేశారు.

తన ఇద్దరు కుమారులు రాఘవేంద్ర, విజయేంద్ర కూడా పార్టీ కోసం కష్టపడుతున్నారని, రాష్ట్ర నలుమూలలు తిరిగి బీజేపీని బలోపేతం చేసేందుకు తమ వంతు కృషి చేస్తున్నారని యడ్డీ వివరించారు.

140 సీట్లు ఖాయం..
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 140  స్థానాల్లో విజయం సాధిస్తుందని యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. గెలుపు గుర్రాలకే టికెట్లు ఇస్తామని చెప్పారు. రెండు సార్లు సర్వే చేసిన తర్వాత గెలిచే అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని చెప్పారు.

ఈ ఏడాది ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మేఘాలయ, మిజోరాం, నాగలాండ్, త్రిపురలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో ఏప్రిల్ లేదా మేలో ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.
చదవండి: నా శవం కూడా బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌తో వెళ్లదు

మరిన్ని వార్తలు