DK Shivakumar: నేను వెన్నుపోటు పొడవను.. డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు..

16 May, 2023 14:46 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటక సీఎంగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనే విషయంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఎవరికి నచ్చినా నచ్చకపోయినా బాధ్యతయుతంగా ఉంటానని స్పష్టం చేశారు. తాము 135 సీట్లు గెలిచామని, ఎవరినీ విడగొట్టాలని అనుకోవడం లేదని చెప్పారు.

సీఎం ఎంపిక విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు తాను కట్టుబడి ఉంటానని డీకే స్పష్టం చేశారు. వెన్నుపోటు పొడవనని, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేయనని గాంధీ కుటుంబం పట్ల తన విధేయతను చాటుకున్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్‌కు 20 సీట్లు తేవడమే తము ముందున్న సవాల్ అని డీకే తెలిపారు. చరిత్రలో తన గురించి తప్పుగా ఉండాలని కోరుకోవడం లేదని, చెడ్డపేరుతో వెళ్లాలనుకోట్లేదని చెప్పుకొచ్చారు.

సీఎం ఎంపికపై చర్చించేందుకు అధిష్ఠానం పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లడానికి ముందు  ఏఎన్‌ఐ వార్తాసంస్థకు  ఇచ్చిన ఇంటర్వ్యూలో శివకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా.. తిరుగుబాటు ఉండదనే సంకేతాలు ఇచ్చారు.

రెండున్నరేళ్లు వద్దు..!
కాగా.. కర్ణాటక సీఎం కుర్చీ కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్యీ తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అంతిమ నిర్ణయం ఏఐసీసీ అధ్యక్షుడిదేనని సీఎల్‌పీ ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానించింది. అయితే సీఎంగా ఇద్దరికీ చెరో రెండేళ్లు ఇస్తామని హైకమండ్ చేసిన ప్రతిపాదనకు డికే ససేమిరా అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో ఢిల్లీలో రెండు రోజులుగా ఈ విషయంపై అదిష్ఠానం మంతనాలు జరుపుతోంది. సిద్ధరామయ్య కూడా ఢిల్లీలోనే ఉన్నారు. డీకే శివకుమార్‌ను కూడా సోమవారమే ఢిల్లీకి పిలిచినప్పటికీ అనారోగ్య కారణాల వల్ల ఆయన వెళ్లలేదు. ఒక రోజు ఆలస్యంగా మంగళవారం వెళ్తున్నారు.

సాయంత్రంలోగా కర్ణాటక సీఎం ఎవరనే విషయంపై స్పష్టత అవకాశం ఉంది. నూతన సీఎం ప్రమాణస్వీకారం గురువారం జరగనుంది. మంత్రులు కూడా ఆరోజే ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జన్ ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు.

మే 10 జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. 135 సీట్లు కైవసం చేసుకుని తిరుగులేని మెజార్టీ సాధించింది. అధికార బీజేపీ కేవలం 66 స్థానాలకే పరిమితమైంది. జేడీఎస్ 19 సీట్లతో సరిపెట్టకుంది. ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు.
చదవండి: గహ్లోత్‌కు సచిన్‌ పైలట్‌ అల్టిమేటం

మరిన్ని వార్తలు