మీ పాపాలే శాపాలై మిమ్మల్ని ఓడించాయి

14 Jan, 2021 05:19 IST|Sakshi

18 నెలలైనా ఈ విషయం తెలుసుకోలేకపోతున్నారా?

చంద్రబాబుపై ఎమ్మెల్యే కొలుసు ధ్వజం

అధికారం లేనప్పుడు ఒకమాట .. అధికారంలోకి వచ్చాక మరోమాట

వందల హామీలిచ్చి మోసం చేసినందుకే ప్రజలు బుద్ధి చెప్పారు

బీసీలను అవమానించి హక్కులు కాలరాసినందుకే ఓడించారు

రైతుల్ని గురించి మాట్లాడే అర్హతే మీకు లేదు

సాక్షి, అమరావతి: చంద్రబాబు చేసిన పాపాలే శాపాలై ఆయన్ను ఓడించాయని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ‘18 నెలలైనా ఇంకా నువ్వెందుకు ఓడిపోయావో తెలుసుకోలేకపోతున్నావా చంద్రబాబూ..’ అంటూ ఎద్దేవా చేశారు. ప్రజలు తననెందుకు ఓడించారో కూడా తెలుసుకోలేని చంద్రబాబు, అక్కసుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై అవాకులు చెవాకులు పేలడం అర్థరహితమని అన్నారు. భోగి మంటల సాక్షిగా అబద్ధాలు చెప్పిన చంద్రబాబుకు సంప్రదాయాలు, దేవుడిపై ఏమాత్రం విశ్వాసం లేదని రూఢీ అయిందన్నారు. బుధవారం విజయవాడలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్థసారథి ఏమన్నారంటే...

నిన్ను ఓడించింది ఇందుకే బాబూ
‘అధికారం పోయినప్పుడు మారిన మనిషినని, రైతుల కోసం పోరాటం చేస్తానని, దళితులు, మైనార్టీలు, బలహీనుల కోసం శ్రమిస్తానని హామీలిచ్చి.. అధికారంలోకి వచ్చాక వాళ్లనే రాష్ట్రానికి గుదిబండలన్నందుకు, పేదలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నందుకు అంతా నిన్ను ఓడించారు. హామీలిచ్చి, మోసం చేసినందుకు, బీసీలను అవమానించి, హక్కులు కాలరాసినందుకు ప్రజలు నీకు గుణపాఠం చెప్పారు.  

రైతుల గురించి నువ్వు మాట్లాడుతున్నావా?
వ్యవసాయం దండగ అంది నువ్వే. ఇవన్నీ మరిచిపోయి ఇప్పుడు రైతుల గురించి నువ్వు మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించిన చందంగా ఉంది. రూ.86 వేల కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తానని అధికారంలోకి వచ్చి, ఐదేళ్ళల్లో కేవలం రూ.12 వేల కోట్లు మాత్రమే మాఫీ చేశారు. అది కూడా రైతులకిచ్చే సున్నావడ్డీ రూ.74 వేల కోట్లు ఎగ్గొట్టి. గిట్టుబాటు ధర లేక రైతులు విలవిల్లాడితే, వారి పంటలను అతి తక్కువ ధరకు కొని, మీ హెరిటేజ్‌ ద్వారా ప్రజలకు ఎక్కువ ధరకు అమ్ముకుంది వాస్తవం కాదా? రైతులకు రూ.2 వేల కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగ్గొట్టి, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలకే సబ్సిడీలు ఇవ్వడం అన్యాయం కాదా బాబూ? 

మేం రైతుకు చేస్తున్న మేలు కన్పించడం లేదా?
మా ప్రభుత్వం రైతుకు ఏం అన్యాయం చేస్తోందో చంద్రబాబు చెప్పాలి. రైతుకు ఏడాదికి రూ.12,500 చొప్పున నాలుగేళ్ళలో రూ.50 వేల వ్యవసాయ పెట్టుబడి ఇస్తానని చెప్పిన వైఎస్‌ జగన్‌.. ఇప్పుడు ఏడాదికి రూ.13,500 చొప్పున, ఐదేళ్ళలో రూ.67,500 ఇస్తుంటే రైతులకు అన్యాయం చేసినట్టు కన్పిస్తోందా? విత్తు నాటిన రోజే పంటకు గిట్టుబాటు ధర ప్రకటించిన ప్రభుత్వం మాది తప్ప దేశంలో ఇంకెక్కడైనా ఉందా? ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు నెల రోజుల్లోనే పరిహారం చెల్లించి చరిత్ర సృష్టించిన ఘనత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానిది కాదా? రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేసి, రైతుకు మేలు చేయాలని నిబంధనలు కూడా పక్కన పెట్టిందీ ప్రభుత్వం. డిసెంబర్‌ 24 వరకు కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లిస్తే... చెల్లించలేదని చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేయడం దారుణం. ఓటమిని జీర్ణించుకోలేని చంద్రబాబు మతి  భ్రమించి మాట్లాడుతున్నాడు. మొన్నటిదాకా లోకేష్‌... ఇప్పుడు బాలకృష్ణ స్క్రిప్టు రాస్తున్నారా అన్పిస్తోంది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం హిందూ మతాన్ని గౌరవిస్తోంది. గుడికో గోవు పథకం, కొన్ని వందల గుడులు నిర్మించడం, రూ.70 కోట్లతో దుర్గమ్మ దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయడం ఇందుకు నిదర్శనం..’’   

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు