కాంగ్రెస్‌ చేసిన తప్పు అదేనా?

4 Dec, 2023 16:58 IST|Sakshi

Election Results: దేశంలో తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్‌ ఘోర పరాభవాన్ని మూటకట్టకుంది. ఈశాన్య రాష్ట్రం మిజోరంను పక్కనపెడితే ఒక్క తెలంగాణలో తప్ప మిగిలిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. నామామాత్రపు సీట్లకు పరిమితమైంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే కాంగ్రెస్‌ రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అధికారాన్ని కోల్పోయింది.

అయితే ఈ పరాజయానికి మిత్ర పక్షాలన్నీ కాంగ్రెస్‌ను నిందిస్తున్నాయి. అన్ని చోట్ల ఒంటరిగా వెళ్లడమే కాంగ్రెస్‌ పార్టీ చేసిన తప్పిదమని తేల్చేస్తున్నాయి. ఆయా అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి కాంగ్రెస్ తప్పు చేసిందని బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు చెందిన జేడీయూ స్పష్టం చేసింది.  బీజేపీ ఆరోపించిన మతోన్మాద రాజకీయాలను సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోవడమే ఈ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓటమికి కారణమని జేడీయూ ముఖ్య అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీరజ్ కుమార్ ఆరోపించారు.

కృత్రిమంగా ‘ఇండియా’ కూటమి
బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకొని జాతీయ స్థాయిలో ‘ఇండియా’ (INDIA) కూటమి ఏర్పాటైంది. రాష్ట్రాలలో విడిగా పోటీ చేస్తూ జాతీయ స్థాయిలో పొత్తు ఉందని చెప్పడంలో అర్థం లేదని జేడీయూ నేత నీరజ్‌ కుమార్‌ పేర్కొన్నారు. పెద్దగా సమావేశాలు నిర్వహించుకుండా, పొత్తుతో క్షేత్రస్థాయికి వెళ్లకుండా ‘ఇండియా’ కూట మి చాలా కృత్రిమంగా కనిపిస్తుందని ఆయన ఆక్షేపించారు. కాగా మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయడంతో జేడీయూ కూడా విడిగా 5 స్థానాల్లో అక్కడ పోటీ చేసింది.

కాంగ్రెస్‌ ఓటమికి అదే కారణం
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమికి కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ కారణమని శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నాయకుడు సంజయ్ రౌత్ కూడా ఇదివరకే ఆరోపించారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ కొన్ని సీట్లను ‘ఇండియా’ (INDIA) కూటమిలోని భాగస్వామ్యులతో పంచుకుని ఉంటే మరోలా ఉండేదన్నారు.

>
మరిన్ని వార్తలు