అవినీతికి అండగా నిలబడే దుర్గతికి ఈనాడు

30 Nov, 2023 18:50 IST|Sakshi

దిన పత్రికలు, లేదా టెలివిజన్ చానళ్లు వార్తలు ఇస్తాయి. ఆ పైన విశ్లేషణలు ఇస్తాయి. ఇది ప్రపంచంలో ఎక్కడైనా జరుగుతుంది. కాని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఒక వర్గం  మీడియా రోధిస్తుంటుంది. ఏడ్చి పెడబొబ్బలు పెడుతుంటుంది.ఇదే ఇక్కడి ప్రత్యేకత. నిత్యం ఏపీలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విషం చిమ్మే ఈనాడు , ఆంధ్రజ్యోతి మీడియాలు మళ్లీ విశాఖపట్నంలో విధ్వంసం సృష్టించాలని విపరీతంగా యత్నిస్తున్నాయి. వారు ప్రజాస్వామ్య విధ్వంసానికి పాల్పడుతూ ముఖ్యమంత్రి జగన్‌పై నిత్యం  ఆరోపణలు చేస్తూ రాస్తుంటారు. విశాఖపట్నంలో  అడ్మినిస్టేటివ్ కాపిటల్ ఏర్పాటు చేయడం ద్వారా ఏపీకి ఒక పెద్ద నగరాన్ని అందించి, దానిని  గ్రోత్ ఇంజన్గా మార్చాలని జగన్ చేస్తున్న కృషికి  టీడీపీ మీడియా ప్రత్యేకించి ఈనాడు అడుగడుగునా అడ్డుపడుతోంది. 

✍️తద్వరా ఏపీ ప్రజలపై తన కక్ష తీర్చుకుంటోంది. విశాఖలో వివిధ ప్రభుత్వ శాఖల క్యాంప్ ఆఫీస్ లు ఏర్పాటు చేయడానికి గాను ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎఎస్ అధికారుల కమిటీ ఇచ్చిన సిఫారసుల మేరకు మిలినియం టవర్స్‌లో  ఆయా ప్రభుత్వ శాఖలు ఏర్పాట కానున్నాయి. ఈ జీవో వచ్చిందో, రాలేదో వెంటనే ఈనాడు పత్రిక ,టీవీ చానల్ ఏడుపు లంఘించుకున్నాయి. ప్రభుత్వ భవనాలలో ప్రభుత్వ ఆఫీస్ లు పెడితే అది సర్కారు కబ్జా  అని హెడింగ్ పెట్టి ప్రజలను మోసం చేయాలని యత్నించారు. విశాఖకు దొడ్డిదారిన పరిపాలన రాజధానిని తరలిస్తున్నారని ప్రచారం మొదలు పెట్టాయి. ఇంత స్పష్టంగా జీవో ఇచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి జగన్ పలుమార్లు తన అభిమతాన్ని తెలియచేసిన తర్వాత ఇందులో దొడ్డిదారి ఏమి ఉంటుంది? కాకపోతే క్యాంప్ ఆఫీస్ లని జీవో లో పేర్కొన్నారు కాబట్టి ఈ విమర్శ చేస్తున్నారు. 

✍️మూడున్నరేళ్లుగా ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న ప్రయత్నాలను తెలుగుదేశం, జనసేన, ఈనాడు, జ్యోతి తదితర మీడియా సంస్థలు అడ్డుపడుతున్న నేపధ్యంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయక తప్పని పరిస్థితి సృష్టించారు.మిలినియం టవర్స్ లో ఒకదానిని ప్రభుత్వం వాడుకోవడం వల్ల యువత ఉద్యోగావకాశాలకు పణంగా పెట్టినట్లు వితండ వాదన తెచ్చింది. మోకాలికి,బోడిగుండుకు లింక్ పెట్టడం అంటే ఇదే. ఆ భవనం ఖాళీగా ఉంటే అందులో ప్రభుత్వ ఆఫీస్ లు వస్తే నగరంలో బోలెడంత యాక్టివిటి వస్తుంది కదా! ఐటి రంగం కోసం వేరే టవర్స్ కూడా ఇప్పటికే నిర్మించారు కదా! అయినా ఈనాడుకు విశాఖపై ఎంత ద్వేషమో!పైకి మాత్రం నగరంపై ఏదో ప్రేమ ఉన్నట్లు నటిస్తూ, లోపల మాత్రం ఎన్ని కుట్రలైనా చేయడానికి ఈనాడు రామోజీరావు వెనుకాడడం లేదు.అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పల్లెటూళ్లలో ఏభైఐదు వేల ఎకరాల పచ్చని పోలాలను బీడు భూములుగా మార్చి  నాశనం చేస్తే  అదేమో గొప్ప సంగతి అట.పర్యావరణం పాడు కాలేదట.పంటలకు నష్టం జరగలేదట.

✍️టీడీపీ, ఈనాడు వంటి వారి రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం అమరావతిలోనే రాష్ట్ర ప్రజల ఆదాయాన్ని అంతా ఖర్చు చేయాలని వీరు కుట్ర చేస్తున్నారు. లక్షకోట్లు వ్యయం చేస్తేనే అది ఒక రూపానికి వస్తుందని వారే చెబుతారు. మరో వైపు పెద్ద ఖర్చు లేకుండా విశాఖను రాజధానిగా వాడుకుని హైదరాబాద్ కు పోటీగా తీసుకు వద్దామని జగన్ ప్రయత్నిస్తుంటే విధ్వంసం అని రాస్తారు. ప్రచారం చేస్తారు. అ మరావతిలో సింగపూర్ ప్రైవేటు రియల్ ఎస్టేట్ కంపెనీకి 1600 ఎకరాలు ఇవ్వడమే కాకుండా,  వారి కోసం సుమారు ఆరువేల కోట్ల రూపాయలతో  మౌలిక సదుపాయాలు కల్పించానికి చంద్రబాబు ప్రభుత్వం పూనుకుంటే , అది ప్రజా శ్రేయస్సు కోసం అని జనాన్ని నమ్మించాలని యత్నంచారు. విశాఖ రిషి కొండ వద్ద 400 కోట్లతో ప్రభుత్వ భవనం నిర్మిస్తే  మాత్రం ఏదో ఘోరం జరిగిపోయినట్లు దుష్టప్రచారం చేస్తుంటారు. 

✍️జగన్ వీరికి  దుష్ట చతుష్టయం అని ఏ మూహూర్తాన పేరు పెట్టారో కాని ఈనాడు రామోజీరావు తదితరులు దానిని సార్ధకం చేసుకుంటున్నారు.విశాఖ నుంచి హెచ్ఎస్బిసి ని వెళ్లగొట్టారట. ఎంత నిస్సిగ్గుగా ఈనాడు అబద్దపు ప్రచారం చేస్తోంది చూడండి.ఆ సంస్థ వారు అంతర్జాతీయంగా వారి వ్యాపార కార్యకలాపాలను పరిగణనలోకి తీసుకుని వివిధ ప్రాంతాలలో తమ శాఖలను మూసివేశారు.అందులో విశాఖ కూడా ఒకటి.దానికి ప్రభుత్వానికి,ఏమి సంబంధం. బుద్ది,జ్ఞానం ఉన్నవారెవరైనా ఇలాంటి చెత్త పోలికలు పెడతారా?మరో వైపు విశాఖకు వచ్చిన ఇన్ఫోసిస్ గురించి ఒక్క ముక్క రాయరు.అదాని సంస్థ తలపెట్టిన భారీ డేటా సెంటర్ తదితర కంపెనీల గురించి ప్రస్తావించరు. ఏపీ ప్రభుత్వం తన క్యాంప్ కార్యాలయాలను విశాఖలో ఏర్పాటు  చేసుకుంటే రామోజీకి వచ్చిన నష్టంఏమిటి?కేవలం ఉత్తరాంధ్ర అంతటా దాని  ప్రభావం పడి తెలుగుదేశంకు నష్టం జరిగి మళ్లీ అధికారం రాకుండా పోతుందేమోనన్న బాధ తప్ప మరొకటి ఉంటుందా?ఒక విషయం చూద్దాం. 

✍️ఈనాడు పత్రిక,టీవీ చానల్ తదితర గ్రూపు సంస్థల హెడ్ ఆఫీస్ లు, ఇతర కార్యాలయాలు   తొలుత హైదరాబాద్ లోని సోమాజీగూడాలో ఉండేవి.రామోజీరావు కూడా బేగంపేటలో ఉండేవారు. ఆ తర్వాత కాలంలో సిటీకి ఏభై కిలోమీటర్ల దూరంలో రామోజీ ఫిలిం సిటీ ని ఏర్పాటు చేసుకున్నారు.తదుపరి ఏమైందోకాని ఆయన తన గ్రూపు సంస్థలన్నిటిని అక్కడకు తరలించారు. దాంతో వాటిలో పనిచేసే ఉద్యోగులు  పడే కష్టాలు అన్నీ,ఇన్ని కావు. రామోజీ ఏమో అక్కడ ఒక కొండపై భారీ వ్యయంతో ఇల్లు నిర్మించుకున్నారు.ఆయనకు ఇబ్బందిలేదు. ఆ కొండమీద ఇల్లు పర్యావరణానికి వ్యతిరేకం కాదని అనుకోవాలి.ఒక విశాఖ రిషికొండ మీద ఏదైనా కడితే మాత్రమే వీరికి కడుపు మంట. 

✍️అదే గత ప్రభుత్వాల హయాంలో నిర్మించినప్పుడు ఇలాంటి విషపు రాతలు ఎందుకు రాయలేదు? రామోజీ ఫిలిం సిటీకి తన కంపెనీలను తరలించినప్పుడు  ఉద్యోగుల గురించి ఆయన ఎన్నడైనా ఆలోచించారా?ఉంటే ఉండండి ,లేకుంటే పొండి అన్న చందంగానే ఉద్యోగులతో వ్యవహరించారు.ప్రభుత్వం  విశాఖలో ఏమి కబ్జా చేయలేదు.కాని  రామోజీపై  మాత్రం ఫిలిం సిటీ ప్రాంతంలో భూములు కబ్జా చేశారని ఆరోపణలు  వచ్చాయి. ఒక మాజీ ఎమ్మెల్యే దీనిపై కేసులు కూడా వేశారు. అది నిజమో కాదో, ఆయనే చెప్పాలి. ఇలాంటి వ్యక్తి విశాఖ నగరంలో ప్రభుత్వ ఆఫీస్లు పెడుతుంటే ఏదో  జరిగిపోతోందని  గగ్గోలు పెడుతుంటారు. విశాఖ ఏమీ పల్లెటూరులోలేదు.మహానగరంగా విరాజిల్లుతోంది.దానిని మరి కొంత ముందుకు తీసుకువెళితే ఏపీ మొత్తానికి ప్రయోజనం కలుగుతుందని జగన్ ఆలోచిస్తుంటే, నిత్యం ఈనాడు, జ్యోతి,తదితర కొన్ని టీడీపీ మీడియా సంస్థలు దానిని చెడగొట్టే పనిలో ఉంటున్నాయి. ఆ క్రమంలోనే  ఇలాంటి చెత్త వార్తలను ఆ మీడియా  కధనాలుగా ఇస్తోంది. 

✍️మామూలుగా అయితే ఏమి చేయాలి. తొలుత వార్తను, వార్తగా ఇవ్వాలి. ఆ తర్వాత దాని వల్ల కలిగేమంచి ఏమిటి?చెడు ఏమిటి అన్నదానిపై విశ్లేషణ చేయాలి. అదేమీ లేకుండా ఏడుపుగొట్టు స్టోరీలు వండి వార్చుతోంది.ప్రతి రోజూ ఇదే గోల అయిపోయింది. గతంలో చంద్రబాబునాయుడు తాము ఎలా  ఆదేశిస్తే అలా చేశారు కనుక జగన్ కూడా అలా చేయాలని  వారి కోరిక కావచ్చు. వారి ఎజెండా కోసం జగన్  ఎందుకు పనిచేస్తారు? ఏపీతో సంబంధాలు వదలుకున్న రామోజీ,అసలు వ్యాపారం తప్పవేరే అనుబంధం లేని రాధాకృష్ణ వంటివారు ఏ స్వార్దంతో ఇలాంటి తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారో ప్రజలకు తెలియదా!రామోజీ లేదా రాధాకృష్ణ తదితర టీడీపీ  మీడియా సంస్థల అధిపతులు ఎవరైనా ఏపీలో కనీసం నివసించడం లేదు. 

✍️వారికి ఈ ప్రాంతంపై మమకారం లేదు. ఎంత సేపు తమ పెత్తనం కోసం తప్ప.తద్వారా తమ ఆర్జన యధేచ్చగా సాగిపోవాలన్న తలంపు  తప్ప. ఇంత నీచంగా రాస్తున్న ,ప్రచారం చేస్తున్న వీరు ఏనాడైనా  చంద్రబాబునాయుడు ఓటుకు నోటు  కేసులో పట్టుబడిపోయిన తర్వాత హైదరాబాద్ వదలి విజయవాడ పారిపోయిన విషయం గురించి రాశారా?దాని వల్ల   ఏపీ ప్రజలు ఉమ్మడి రాజధాని కోల్పోయి ఎంత  నష్టం చెందారో ఒక్క లైన్ అయినా రాశారా?పైగా అదేదో ఏపీ ప్రజల కోసమే విజయవాడ వెళ్లిపోయినట్లు బిల్డప్ ఇచ్చారే! చంద్రబాబు  చేసింది తప్పుకాదు..కెసిఆర్ టెలిఫోన్ టాపింగ్ చేసి చంద్రబాబు  ఎమ్మెల్యేల కొనుగోలు లావాదేవీలను కనిపెట్టడమే తప్పు అని రాశారే!అవినీతికి ఆనాడు ఆ రకంగా మద్దతు  ఇచ్చారు. చంద్రబాబు ప్రభుత్వ  పాలనలో  జరిగిన  అవినీతిపై కేసులు వస్తే కూడా అవినీతికి అండగా నిలబడే దుర్గతికి ఈనాడు చేరుకుంది.  ఇలాంటి దిగజారిన విలువలు పాటిస్తున్న వీరు ఇప్పుడు ఏపీపై విషం చిమ్ముతుంటే  దానిని ఎదుర్కోవడం  తప్ప చేసేదేముంది!


-కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్

మరిన్ని వార్తలు