జనసేనేమో బీజేపీవైపు.. తెలుగుదేశం ఏమో కాంగ్రెస్ వైపు!

6 Nov, 2023 13:57 IST|Sakshi

ఇంతకాలం విలువలు లేని రాజకీయాలు చూశాం. అనైతిక రాజకీయాలు చూశాం. కంత్రీ రాజకీయాలను కూడా చూశాం. ఇప్పుడు కొత్తగా కల్తీ రాజకీయాలు తెలుగు రాష్ట్రాలలో కనిపిస్తున్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంలో ఇది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రత్యేకించి  తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు ప్రత్యక్షంగాను, కాంగ్రెస్ పార్టీ పరోక్షంగానూ ఈ రాజకీయాలు చేస్తున్న తీరు ఇందుకు అద్దం పడుతుంది. ఈ తరహా పాలిటిక్స్ నడపడంలో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయనిపిస్తుంది. ఎన్డీఏలో బీజేపీతో పాటు జనసేన భాగస్వామి పార్టీ. ఆ ప్రకారం ఆయా రాష్ట్రాలలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేయాలి. కాని ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి జనసేన విడాకులు ఇవ్వకుండానే, తెలుగుదేశంతో సంబంధం పెట్టేసుకుంది. దానిని అధికారికం కూడా చేసింది. అయినా బీజేపీ ఏమీ ఫీల్ కాలేదు.

తన పార్టనర్ వేరేవారితో వెళ్లిపోవడం ఏమిటని బీజేపీ కనీసం ప్రశ్నించలేదు. మరోవైపు తెలంగాణలో మాత్రం జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుని  కొన్ని సీట్ల కేటాయింపు కూడా చేసుకుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీని జనసేన కూడా వదలివేసింది. తెలుగుదేశం పార్టీ పోటీలో లేకుండా చేతులెత్తేసినట్లు ప్రకటించింది. ఇది కాంగ్రెస్ పార్టీకి సాయం చేయడానికే అన్నది బహిరంగ రహస్యం. ఆ విషయాన్ని టీటీడీపీ అద్యక్షుడుగా ఉండి రాజీనామా చేసిన కాసాని జ్ఞానేశ్వర్ చెప్పేశారు కూడా. అంటే తెలంగాణలో జనసేనేమో బీజేపీవైపు, తెలుగుదేశం ఏమో కాంగ్రెస్ వైపు పనిచేస్తాయన్నమాట. మళ్లీ ఏపీకి వెళ్లేసరికి బీజేపీని వదలి ఈ రెండు పార్టీలు సంపారం చేస్తాయట. కాంగ్రెస్ నేతలు కొందరు బహిరంగంగానే అవినీతి అభియోగాలకు గురైన చంద్రబాబుకు మద్దతు ఇచ్చారు. ఈ మొత్తం వ్యవహారాలు చూస్తే ఇవన్ని  కల్తీ రాజకీయాలుగా కనిపించవా?కాలం మారింది.

సిద్దాంతంతో పనిలేదు. విధానాలతో అవసరం లేదు. రాజకీయ అవసరాల ప్రాతిపదికన ఈ పార్టీలు చేస్తున్న  విన్యాసాలు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాయన్నది మనం ఆలోచించడం అనవసరం. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఈ తరుణంలో హైదరాబాదులో కూర్చుని రాజకీయ చర్చలు జరుపుకోవడం మరో హైలైట్. రెండువేర్వేరు పార్టీలకు మద్దతు ఇస్తూ హాపీగా గంటల తరబడి మాట్లాడుకున్నా అటు బీజేపీ అభ్యంతరం చెప్పలేదు. కాంగ్రెస్ పార్టీ తనకు పోయిందేముందిలే అని చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే చంద్రబాబు అధికారికంగా కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించలేదు. కాని ఆయన మనసులో మాట టీడీపీ క్యాడర్‌కు, ప్రత్యేకించి తెలంగాణలో టీడీపీకి మద్దతు ఇచ్చే కమ్మ సామాజికవర్గానికి  తెలిసేలా చేయగలిగారు. బీజేపీ నేత ఈటెల రాజేందర్ వంటివారు టీడీపీ వైఖరిని తప్పు పట్టారు కాని, చంద్రబాబుతో స్నేహం ఏమిటని పవన్ కళ్యాణ్‌ను అడగలేకపోయారు.

ఈ విషయంలో చంద్రబాబు, పవన్‌ల కన్నా  వైఎస్సార్‌టీపీ నేత షర్మిల బెటర్ అని చెప్పాలి. మంచో, చెడో, తాను పోటీ నుంచి తప్పుకున్నానని, కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నానని, తనను క్షమించాలని నిజాయితీగా ప్రకటన చేశారు. చంద్రబాబు, పవన్‌లు మాత్రం అలా చేయకుండా కల్తీ రాజకీయాలు చేస్తూ కలిసి, మెలిసి నడుస్తున్నారు.  ఏపీ హైకోర్టువారు ఉదారంగా ఇచ్చిన కండిషనల్ బెయిల్ ఈ రకంగా రాజకీయాలకు చంద్రబాబు వాడుకోగలుగుతున్నారు. ఇకపై అవినీతి కేసులలో చిక్కుకున్నవారికి ఇది ఒక ప్రిసిడెన్స్ అయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు జైలులో ఉన్నా, బయట ఉన్నా తన పరపతిని , తన మానిప్యులేటివ్ స్కిల్స్‌ను బాగానే ప్రయోగించగలరని మరోసారి తేలింది. చంద్రబాబు జైలులో ఉండగా ఆయన  ఆరోగ్యంపై టీడీపీ మీడియా అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి ,టివి 5 వంటివాటిలో ప్రచారం అయిన తీరు చూస్తే ఆయనకు ఏమో అయిపోతుందేమోనన్న భయం కలిగేది.

ఆయనకు ఉన్న హోదా రీత్యా పలు సదుపాయాలు మొదటే కల్పించారు. తదుపరి ఎసి ఇచ్చారు. అయినా జైలు అధికారులపై, వైసిపి ప్రభుత్వంపై నిత్యం ఆరోపణలు చేసేవారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు కూడా ఆయన ఆరోగ్యంపై అపోహలు సృష్టించే యత్నం చేశారు. హైకోర్టువారు  ఈ నేపధ్యంలో మెడికల్ బోర్డుకు కూడా రిఫర్ చేయకుండానే మానవత్వంతో  బెయిల్ ఇచ్చారు. ఆ క్రమంలోనే ఆయన సాక్షులను ప్రభావితం చేయవద్దని అన్నారు కాని, అలా చేయకుండా ఉండడానికి ఏర్పాటు లేకుండా ఆదేశాలు ఇవ్వడం కాస్త ఆశ్చర్యమే. బెయిల్ లభించాక జైలు నుంచి బయటకు వచ్చిన చంద్రబాబును చూసి అంతా ఆశ్చర్యపోయారు. ఆయన నిగనిగలాడుతూ ఉండడమే కాకుండా చక్కగా నడుస్తూ ఎలాంటి సమస్య లేకుండా కారులో కూర్చుని పద్నాలుగు గంటలు జనం మద్యలో ప్రయాణించారు.

అంటే ఆ రకంగా చంద్రబాబును వైసిపి ప్రభుత్వం అనండి..జైలు  అధికారులు అనండి..అంత బాగా చూసుకున్నారని అర్ధం అయింది. ఈ సంగతి పక్కనబెడితే చంద్రబాబు ఈ అవకాశాన్ని తన రాజకీయాల కోసం బాగానే వాడుకోగలుగుతున్నారనుకోవాలి. పవన్ కళ్యాణ్ తో గంటల తరబడి భేటీ అయి ఏపీ, తెలంగాణ రాజకీయాలు చర్చించారు. తెలంగాణలో కాంగ్రెస్ కు పరోక్ష మద్దతు ఇస్తున్న చంద్రబాబు ఏపీలో మాత్రం బీజేపీ పొత్తు కోరుకుంటున్నారు. ఇందుకు పవన్ కళ్యాణ్ తో పాటు ఏపీ బీజేపీ అద్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా సహాయం చేస్తున్నారన్న అభిప్రాయం కలుగుతోంది.

చంద్రబాబు అరెస్టు అయితే తెలుగుదేశంవారితో పోటీ పడి ఆమె బాధపడడం, వ్యాఖ్యలు చేయడం, ఆయన జైలునుంచి విడుదల కాగానే స్వాగతం పలకడం , ఎక్కడా చంద్రబాబుపై వచ్చిన అవినీతి అభియోగాల గురించి మాట్లాడకపోవడం , తెలంగాణలో కాంగ్రెస్ కు  సాయం చేస్తున్నా బీజేపీ నేతలు పెద్దగా ఆక్షేపించకపోవడం ..ఇవన్ని చూస్తుంటే కల్తీ రాజకీయాలు ఇలా జరుగుతున్నాయన్న సంగతి బోధపడుతుంది.తెలంగాణలో పవన్ కళ్యాణ్  బీజేపీతో పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏపీ రాజకీయాలను దృష్టిలో ఉంచుకునే అన్న విషయం తెలిసిందే. ఇక్కడ సహకరిస్తే, తన మాట విని ఏపీలో టీడీపీతో బీజేపీ కలవకపోతుందా అన్నది ఆయన భావన కావచ్చు. మరో వైపు చంద్రబాబు కాంగ్రెస్‌కు పరోక్ష మద్దతు ఇవ్వడంలోని ఉద్దేశం ఏమిటంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తన మాట బాగా చెల్లుతుందని, తన శిష్యుడు రేవంత్ సీఎంఅయితే తనదే పెత్తనం అవుతుందని భావిస్తుండవచ్చు.

దానిని అడ్డం పెట్టుకుని జగన్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టవచ్చన్నది ఆయన ఆశ.ఏపీ  ఎన్నికల సమయంలో ఇది  తనకు అవసరం అని ఆయన అనుకుంటారు.ఈ విషయాన్ని గుర్తించిన బీఆర్‌ఎస్‌ నేతలు క్రమేపి టీడీపీపై విమర్శలు ఆరంబించారు. కాంగ్రెస్‌తో గత ఎన్నికల సమయంలో టీడీపీ నేరుగా పొత్తు పెట్టుకున్న అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అయినా కాంగ్రెస్ గెలవలేకపోయింది. ఇప్పుడు కూడా అదే జరుగుతుందన్నది వారి ధీమా!కాకపోతే చంద్రబాబు అరెస్టు తర్వాత కమ్మ సామాజికవర్గంలో  ఏర్పడిన అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు పోటీపడ్డాయి. కాని అదంతా కాంగ్రెస్ వైపు మళ్లే అవకాశం ఉందని అర్ధం కాగానే బీఆర్‌ఎస్‌ మేలుకుని ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోంది. మొత్తం మీద ఈ కల్తీ రాజకీయాల ప్రభావం తెలంగాణ ఎన్నికలపై ఎలా పడుతుందన్నది ఆసక్తికరమే. ప్రస్తుతానికి చూస్తే, టీడీపీ, జనసేన, బీజేపీ కల్తీ రాజకీయాల వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండకపోవచ్చు.తెలంగాణలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్న టీడీపీతో ఏపీలో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ అధిష్టానం సిద్దపడితే కల్తీ రాజకీయాలకు పరాకాష్టే అవుతుందని బావించవచ్చు. తెలుగు రాష్ట్రాలలో ఈ తరహా కల్తీ రాజకీయాలు కొత్త ట్రెండే అవుతాయి.

మరిన్ని వార్తలు