మూడోసారి గెలిపిస్తే మరింత అభివృద్ధి

19 Nov, 2023 04:36 IST|Sakshi

మంత్రి కేటీఆర్‌ హామీ

కామారెడ్డి జిల్లాలోనూ,హైదరాబాద్‌లోనూ ప్రచారం 

కాంగ్రెస్‌ దుర్మార్గపు పాలన మళ్లీ అవసరమా? 

రూ.15 లక్షల చొప్పున నగదు, 2 కోట్ల ఉద్యోగాలు మర్చిపోయిన మోదీ

100 సీట్లలో గెలుపుతో కేసీఆర్‌ సర్కార్‌ హ్యాట్రిక్‌ ఖాయం

సాక్షి, కామారెడ్డి/ నాంపల్లి (హైదరాబాద్‌): ‘తొమ్మిదిన్నరేళ్ల కిందట ఉన్నది కాంగ్రెస్‌ ప్రభుత్వమే కదా? అప్పుడు ఎన్ని కష్టాలు పడ్డం. మరిచిపోతమా. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు ఎప్పుడు వస్తదో, ఎప్పుడు పోతదో తెలవదు. దొంగరాత్రి వచ్చిపోయే కరెంటు కోసం ఎంతమంది రైతన్నలు పొలం కాడికి పోయి పాము కాట్లు, తేలు కాట్లు, కరెంటు షాకులతో ప్రాణాలు కోల్పోయిండ్రు.

ఆఖరుకు నక్సలైట్లు అనుకుని పోలీసులు కూడా కాల్చి చంపిరి. ఆ దుర్మార్గపు పాలన మళ్ల మనకు అవసరమా? రైతు ప్రభుత్వం కావాల్నా? రాబందు కాంగ్రెస్‌ కావాల్నా? ఒక్కసారి మనసుతోటి, గుండె లోతుల్లోంచి ఆలోచించుండ్రి. రైతు కష్టం తెలిసిన రైతుబిడ్డ ముఖ్యమంత్రిగా తొమ్మిదిన్నరేళ్లలో చేసిన మంచిని చూసి, మూడోసారి అధికారం అప్పగిస్తే రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుంది..’అని రాష్ట్ర మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డి, కాచాపూర్‌ గ్రామాలతో పాటు బీబీపేట మండల కేంద్రంలో, హైదరాబాద్‌లోని నాంపల్లిలో జరిగిన రోడ్‌షోల్లో ఆయన ప్రసంగించారు.
 
కాంగ్రెస్‌ గెలిస్తే అంధకారమే 
‘రాష్ట్రంలో కేసీఆర్‌ ప్రభుత్వం హ్యాట్రిక్‌ సాధించడం తథ్యం. ఈ ఎన్నికల్లో వంద సీట్లతో అధికారంలోకి రాబోతున్నాం. కాంగ్రెస్‌ వాళ్లకు 11 సార్లు అవకాశం ఇచ్చినం గదా. మళ్లీ పొరపాటున కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే అంధకారమే. ఎద్దు, ఎవుసం తెలియని సన్నాసుల చేతుల్లో పడితే రాష్ట్రం ఆగమవుతుంది. రైతుబంధు వద్దని, మూడు గంటల కరెంటు చాలని వాళ్లు అంటున్నారు.

రూ.50 లక్షలతో దొరికినోడు నీతి మాటలు చెబితే విందామా? కొత్తగా భట్టి విక్రమార్క పట్వారీ వ్యవస్థను తీసుకువస్తామని అంటున్నారు. దీనిపై అప్రమత్తంగా ఉండాలి. తెలంగాణ తెచ్చిన కేసీఆర్‌కు ఈ ప్రాంతం మీద ప్రేమ ఉంటది గని, రాహుల్‌ గాం«దీకో, మోదీకో ఉంటదా? గడచిన తొమ్మిదన్నరేళ్ళలో కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేడు ఇంటింటికీ అందుతున్నాయి.

అభివృద్ధి, సంక్షేమంతో పాటు ఎలాంటి గొడవలు, కర్ఫ్యూలు లేకుండా ప్రశాంతంగా సీఎం ప్రభుత్వాన్ని నడిపారు. డిసెంబర్‌ 3వ తేదీ తర్వాత కొత్త సంక్షేమ పథకాలు అమలవుతాయి. రైతుబంధు రూ.10 వేల నుంచి రూ.16 వేలకు పెరుగుతుంది. బీడీ కారి్మకులందరికీ రూ.5 వేల పింఛన్‌ ఇస్తాం. అన్నపూర్ణ పథకం ద్వారా సన్న బియ్యం, రూ.4 వందలకే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తాం. అలాగే 18 ఏండ్లు నిండిన మహిళలందరికీ రూ.3 వేలు ఇస్తాం. ’అని కేటీఆర్‌ హామీ ఇచ్చారు. 

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనార్టీలపై చిన్నచూపు 
‘అధికారంలోకి వచ్చాక జన్‌ధన్‌ ఖాతాను తెరిస్తే ధనాధన్‌ రూ.15 లక్షల చొప్పున నగదు వేస్తామని ఇచ్చిన హామీని మోదీ విస్మరించారు. రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని మాటిచ్చి మరిచిపోయారు. బీజేపీ అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై చిన్నచూపును ప్రదర్శిస్తున్నారు. కానీ తెలంగాణలో కేసీఆర్‌ అన్ని వర్గాల ప్రజలకు సమతూకాన్ని ప్రదర్శిస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో మైనార్టీలకు తొమ్మిదేళ్ళ కాలంలో రూ.12,780 కోట్ల బడ్జెట్‌ను కేటాయించిన ఘనత కేసీఆర్‌దే. ప్రస్తుతం హైదరాబాద్‌కు మించిన నగరం దేశంలో మరెక్కడా లేదు.

రజనీకాంత్, సన్నీ డియోల్‌ లాంటి బయటి వారికి హైదరాబాద్‌ గొప్పదనమేమిటో తెలుస్తుంటే, ఇక్కడే ఉండే హైద రాబాద్‌ గజినీలకు మాత్రం అర్ధం కావడం లేదు..’ అని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. మూడోసారి బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే హైదరాబాద్‌ను గ్లోబల్‌ సిటీగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. ఆయా సభల్లో ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్, ఎంపీ బీబీ పాటిల్, నాంపల్లి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆనంద్‌కుమార్‌ గౌడ్, దాసోజు శ్రవణ్‌ తదితరులు పాల్గొన్నారు. 

వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ చూస్తా 
చిలకలగూడ:  ‘నాకు క్రికెట్‌ అంటే చాలా ఇష్టం. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నా ఆదివారం జరిగే క్రికెట్‌ వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ను చూసేందుకు ప్రయత్నిస్తా. సెమీ ఫైనల్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీ చేశాడు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ కూడా సెంచరీ సీట్లు సాధించడం ఖాయం. సెమీ ఫైనల్‌లో బౌలర్‌ షమీ ప్రత్యర్థులను ఓడించినట్లు, సీఎం కేసీఆర్‌ కూడా ప్రత్యర్థులను ఓడించి హ్యాట్రిక్‌ సీఎం కావడం ఖాయం..’అని శనివారం రాత్రి హైదరాబాద్‌ మైలార్‌గడ్డ వద్ద రోడ్‌షోలో కేటీఆర్‌ దీమావ్యక్తం చేశారు.  

మరిన్ని వార్తలు