Bengal Results: మరీ దారుణం.. ఒక్కచోటా గెలవని కమ్యూనిస్టులు

3 May, 2021 09:21 IST|Sakshi

బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటైనా దక్కని వైనం 

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ను 1977 నుంచి 2011 దాకా.. 34 ఏళ్లపాటు అప్రతిహతంగా పాలించిన లెఫ్ట్‌ ఫ్రంట్‌ నేడు దయనీయ స్థితికి దిగజారింది. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొని పోటీ చేసినా ఈ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేక చతికిలపడింది. ప్రజా ఉద్యమాలు, భూ సంస్కరణలతో ఒకప్పుడు బెంగాలీల మనసు గెలుచుకొని సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కమ్యూనిస్టులకు.. ఈ దుస్థితి ఎందుకు దాపురించిందన్న ప్రశ్నకు రకరకాల కారణాలు చెబుతుంటారు.

అందులో ప్రధానమైంది.. 2008లో భారత్‌–అమెరికా అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వానికి లెఫ్ట్‌ పార్టీలు మద్దతును ఉపసంహరించుకున్నాయి. దీంతో బెంగాల్‌లో కాంగ్రెస్‌ పార్టీ కమ్యూనిస్టులను పక్కనపెట్టి, తృణమూల్‌తో జట్టుకట్టింది. అప్పటి నుంచే బెంగాల్‌లో కమ్యూనిస్టు పార్టీల పతనం మొదలయ్యింది. తర్వాత జరిగిన ఎన్నికల్లో లెఫ్ట్‌ పార్టీలపై తృణమూల్‌ ఆధిక్యత సాధించడం ప్రారంభించింది. 

బెంగాల్‌లో లెఫ్ట్‌ ఫ్రంట్‌లోని ప్రధాన పార్టీలు సీపీఎం, సీపీఐ, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌(ఏఐఎఫ్‌బీ), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్‌ఎస్పీ). 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఈ నాలుగు పార్టీలు కలిసి బెంగాల్‌లో 50.7 శాతం ఓట్లు సాధించగా, 2009 ఎన్నికల్లో 43.3 శాతం ఓట్లు దక్కించుకోగలిగాయి. 2007లో జరిగిన నందిగ్రామ్‌ భూసేకరణ వ్యతిరేక పోరాటంలో తృణమూల్‌ అధినేత మమతా బెనర్జీ కీలకంగా వ్యవహరించారు. 2008లో పంచాయతీ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీలను మట్టికరిపించారు. నందిగ్రామ్‌ ఉద్యమం తర్వాత రాష్ట్రంలో చాలా వర్గాలు కమ్యూనిస్టులకు దూరమయ్యాయి.

2011లో సీపీఐ 2, సీపీఎం 40 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగాయి. మొదటిసారిగా తృణమూల్‌ అధికారంలోకి వచ్చింది. 2016 శానసనభ ఎన్నికల్లో సీపీఐ ఒక్కటి, సీపీఎం 26 స్థానాలకే పరిమితమయ్యాయి. ఓట్ల శాతం భారీగా తగ్గింది. ఇప్పుడు ఖాతా కూడా తెరవలేదు. ఇక 2014 లోక్‌సభ ఎన్నికల్లో లెఫ్ట్‌ కూటమి కేవలం 2 సీట్లు గెలుచుకొని, 29.71 శాతం ఓట్లు సాధించగా, 2019లో ఒక్క స్థానం కూడా సొంతం చేసుకోలేకపోయింది. ఓట్ల శాతం 6.34 శాతానికి పడిపోయింది.

చదవండి: West Bengal Election Result 2021: దీదీ హ్యాట్రిక్‌!

>
మరిన్ని వార్తలు