పోలింగ్‌ డే హాలీడే.. హైదరాబాద్‌లో పెరగని పోలింగ్‌!

30 Nov, 2023 15:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణవ్యాప్తంగా ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మధ్యాహ్నం మూడు గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 52 శాతం పోలింగ్‌ నమోదైనట్టు ఎ‍న్నికల అధికారులు తెలిపారు. ఇక, హైదరాబాద్‌లో మాత్రం పోలింగ్‌ శాతం 32గా ఉంది. సిటీలో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ముందుకు రావడం లేదు. 

ఇదిలా ఉండగా.. గ్రేటర్ హైదరాబాద్‌లో పోలింగ్ డేను సెలవు రోజుగానే చదువుకున్న ఓటర్లు చూస్తున్నారు. గతంలానే ఓటేసేందుకు హైదరాబాదీలు ముఖం చాటేశారు. సెలబ్రేటీలు ఉదయాన్నే ఓటు వేసి బాధ్యతను గుర్తు చేసినా, ఎన్నికల సంఘం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటింగ్‌ శాతం మాత్రం పెరగలేదు. ఇక, మెదక్‌లో అత్యధికంగా 70 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది. 

మరోవైపు.. మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గంలో సాయంత్రం నాలుగు గంటలకు పోలింగ్‌ ముగియనుంది. ఇల్లందు, భద్రాచలం, పినపాక, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజక వర్గాల్లో నాలుగు గంటలకే పోలింగ్‌ ముగియనుంది. ఒకటి, రెండు ప్రాంతాల్లో తప్ప మిగతా అన్నిచోట్ల ప్రశాంతంగా పోలింగ్‌ జరుగుతోంది. మిగతా స్థానాల్లో ఐదు గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. 

మరిన్ని వార్తలు