గ్యాస్ సిలిండర్ ధర రూ.3000 వరకు పెరుగుతుంది

3 Sep, 2023 14:09 IST|Sakshi

కోల్కతా: జల్‌పైగురి జిల్లాలోని ధుప్‌గురి ఉపఎన్నికల ప్రచార కార్యక్రమంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి గ్యాస్ ధర రూ.3000 అవుతుందని అన్నారు. 

ఇటీవల కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై రూ.200 తగ్గించడంపై స్పందిస్తూ డైమండ్ హార్బర్ ఎంపీ అభిషేక్ బెనర్జీ బీజేపీ పార్టీపైనా ప్రధాని నరేంద్ర మోదీపైనా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రధాని గ్యాస్ సిలిండర్ ధరను తగ్గిస్తూ ఇది రక్షాబంధన్ కానుక అంటారు.. ఏ.. రక్షాబంధన్ ఐదేళ్లకు ఒక్కసారే వచ్చిందా ఏంటి? ఎన్నికలు దగ్గర పడుతున్నందున ప్రధాని కొత్త డ్రామాకు తెర తీశారన్నారు. 2024 ఎన్నికల్లో ఒకవేళ బీజేపీ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే మాత్రం గ్యాస్ ధర రూ.3000కు చేరుతుందని అన్నారు. అదే కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే మాత్రం ఒక సిలిండర్ ధర కేవలం రూ.500కే అందిస్తామని అన్నారు. 

బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు వేస్తామని అన్నారు.. మీకెవరికైనా ఆ డబ్బులు వచ్చాయా అని ప్రశ్నించారు. కేంద్రం ఆ డబ్బులు ఇవ్వకపోగా ఉపాధి హామీ నిధులను నిలిపివేసిందని అన్నారు. వందరోజుల పని దినాలు పథకం కింద పని చేసిన వారికి కూడా డబ్బులు ఎగ్గొట్టారని ఆరోపణలు చేశారు. పైగా వారంతా ఇక్కడికొచ్చి బాంగ్లాదేశ్ నినాదమైన 'జోయ్ బెంగాల్' ని ఇక్కడ బెంగాల్‌లో నినదించి ఈ ప్రాంతాన్ని అవమానిస్తారు.

సెప్టెంబర్ 5న జరగబోయే ఉపఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఘోరంగా ఓడించాలని ఈ ఓటమికి ఆ అభ్యర్థి ఇంట్లో నుంచి బయటకు రావడానికి కూడా సిగ్గుపడాలని ప్రజలను అభ్యర్ధించారు. ఈ దెబ్బతో బీజేపీ పార్టీకి ప్రజల బలం ఏమిటో తెలిసి రావాలని అన్నారు. ఈ సందర్బంగా అభిషేక్ ఈ ఉపఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే సీఎంతో మాట్లాడి ధుప్‌గురికి మూడు నెలలో సబ్ డివిజన్ హోదా కల్పిస్తామని అన్నారు.  

అభిషేక్ బెనర్జీ వ్యాఖ్యలపై స్పందించిన ప్రతిపక్ష నేత సువెందు అధికారి.. ముందు ఆశా వర్కర్ల జీతాలు, గ్రూపు-డి ఉద్యోగుల జీతాలు ఎందుకంత తక్కువగా ఉన్నాయని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రంతో సమానంగా డీఏ చెల్లించే విషయమై ఎంతకాలం ఎదురుచూడాలని ప్రశ్నించారు. మరో బీజేపీ నేత సమీక్ భట్టాచార్య మాట్లాడుతూ.. అభిషేక్ బెనర్జీకి రాజ్యాంగం పట్ల కొంచెం కూడా గౌరవం లేదని ఉంటే ఎన్నికల సమయంలో ఆచరణసాధ్యం కానీ హామీలు ఇచ్చేవారు కాదని విమర్శించారు. 

ఇది కూడా చదవండి: ఇకపై బహుభార్యత్వం నిషేధం..  డిసెంబర్‌లో బిల్లు

మరిన్ని వార్తలు