Macherla Constituency: టీడీపీకి దిక్కేది.. జూలకంటి జాడేది!

24 Dec, 2022 20:10 IST|Sakshi
మాచర్ల నియోజకవర్గం

55 ఏళ్లుగా ప్రత్యక్ష రాజకీయాల్లో...

మాచర్ల, గురజాల నుంచి ఏడుసార్లు పోటీ

మూడు సార్లు మాత్రమే గెలుపు

ఎవరూ లేకేనా బ్రహ్మారెడ్డి వైపు టీడీపీ!

సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మాచర్ల నియోజకవర్గంలో జూలకంటి కుటుంబానికి ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. 55 ఏళ్లుగా ఆ కుటుంబం ప్రత్యక్ష ఎన్నికల్లో తలపడుతూ మధ్యలో టికెట్టు దక్కక విరామం తీసుకుంటూ కొనసాగుతోంది. ఇండిపెండెంట్‌గా, కాంగ్రెస్, టీడీపీ తరఫున పోటీ చేసి గెలుపు ఓటములను చవిచూడటమూ ఆ కుటుంబ పోటీదారులకు రివాజే. దాదాపు దశాబ్దం పాటు మౌనం వహించిన జూలకంటి పేరు తాజాగా పల్నాడులో వినిపిస్తోంది.   

వాడుకుని వదిలేయడంలో బాబు దిట్ట   
తన వ్యక్తిగతంతోపాటు పార్టీ అవసరాలకు సమయానుకూలంగా ఎవరినైనా వాడుకుని పక్కకు విసిరిపారేయడంలో అందెవేసిన నేతగా ప్రత్యేక గుర్తింపున్న చంద్రబాబునాయుడు తాజాగా జూలకంటిని వాడేసుకుంటూ ఫ్యాక్షన్‌  రాజకీయాలకు పాలుపోస్తున్నారనే మాట పల్నాడులోని ప్రతినోటా వినిపిస్తున్నదే. రాజకీయాల గురించి కనీస అవగాహన ఉన్న వారెవరైనా చర్చిస్తున్న తాజా అంశమిదే. అధికార, ప్రతిపక్షాలు ఏవైనా ప్రాంతాల అభివృద్ధిలో పోటీపడాలే తప్ప ప్రజల్లో అశాంతిని  రేకెత్తించే కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వడంలో ఔచిత్యమేంటని ప్రశ్నిస్తున్నారు. పాలకపక్ష నాయకుల తప్పులుంటే ఎత్తిచూపడంలో తప్పులేదని, ప్రశాంతతతో పాటు వేగంగా ప్రగతిబాట పడుతున్న పల్నాడులో మళ్లీ ఫ్యాక్షన్‌ రాజకీయాలు పడగవిప్పేలా చేస్తున్న వారెవరినీ క్షమించకూడదని పార్టీల రహితంగా ముఖ్యులు అభిప్రాయపడుతున్నారు. అదే సమయంలో టీడీపీ అధినేత తీరును, జూలకంటి కుటుంబ రాజకీయ నేపథ్యాన్ని గుర్తుచేస్తున్నారు. మొత్తంమీద ఏడుసార్లు జూలకంటి కుటుంబం ఎన్నికల్లో తలపడగా 1972, 1983, 1999లలో విజయం సాధించడం పరిశీలనాంశం.  

n జూలకంటి నాగిరెడ్డి 1967లో ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా మాచర్ల నియోజకవర్గం నుంచి పోటీచేసి స్వల్పతేడాతో ఓటమి చెందారు. 1972లో అదే స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా 1978లో రంగంలోకి దిగి మూడో స్థానంలో నిలిచారు. 1983లో గురజాల స్థానం నుంచి టీడీపీ తరఫున గెలుపొందారు. నాగిరెడ్డి భార్య దుర్గాంబ 1999లో మాచర్ల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి పిన్నెల్లి లక్ష్మారెడ్డి(కాంగ్రెస్‌)పై విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూలకంటి కుటుంబాన్ని ఓటర్లు ఆదరించలేదు.   

2004 నుంచి ఓటమెరుగని పిన్నెల్లి కుటుంబీకులు 
మాచర్ల నియోజకవర్గం నుంచి పిన్నెల్లి కుటుంబం తిరుగులేని ఆధిక్యతను ప్రదర్శిస్తూ వస్తోంది. 1994 ఎన్నికల్లో మాత్రం పిన్నెల్లి సుందరరామిరెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తరువాత 2004లో లక్ష్మారెడ్డి గెలుపొందగా ఆయన వారసునిగా శాసనసభ అభ్యర్థిగా రంగంలోకి దిగిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 2009, 2012 (బై ఎలక్షన్‌), 2014, 2019లలో వరుసగా విజయాలు సాధించారు. ఏడుగురి హత్యకేసుతోపాటు వివిధ కేసుల్లో చిక్కుకున్న జూలకంటి బ్రహ్మానందరెడ్డి (బ్రహ్మారెడ్డి) 2004, 2009 ఎన్నికల్లో లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డిల చేతుల్లో ఓటమి చవిచూశారు. గత రెండు ఎన్నికల్లో చంద్రబాబు టికెట్టు ఇవ్వకపోగా దూరంగా పెట్టడంతో బ్రహ్మారెడ్డి మౌనం దాల్చక తప్పలేదు. 

చివరికి నీవే శరణం అన్నట్టు..
మాచర్ల నియోజకవర్గంలో టీడీపీకి దిక్కూమొక్కూ లేకుండా పోయిన దశలో చంద్రబాబునాయుడు కొన్ని నెలల కిందట జూలకంటిని రంగంలోకి దించారు. పరస్పర అవసరాల ప్రాతిపదికన రాజకీయ రచ్చకు ప్రాధాన్యమిస్తూ ఫ్యాక్షన్‌ కు ప్రాణం పోస్తున్నారనేది పరిశీలకుల విశ్లేషణ. అభివృద్ధి కోణంలో పల్నాడులో మరే ప్రాంతాలకు తీసిపోని రీతిలో వేగంగా అడుగులు పడుతున్నాయని ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమా అని పలుసార్లు బహిరంగంగా పిలుపునిచ్చినా టీడీపీ నుంచి కనీస స్పందన కరవైందని పాలకపక్ష ప్రజాప్రతినిధులు గుర్తుచేస్తున్నారు. టీడీపీ హింసా రాజకీయాలకు ప్రాధాన్యమిస్తోందంటూ... గతంలో నరసరావుపేటలో కోడెల శివప్రసాద్‌ బాంబులతో రాజకీయాలు నడిపారని, గురజాలలో అరాచకాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని, ఇప్పుడేమో మాచర్లలో ఫ్యాక్షన్‌ కు ఊతమిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తరహా రాజకీయాలకు చంద్రబాబు ఫుల్‌స్టాప్‌ పెడితే మంచిదని హితపు పలుకుతున్నారు.  

2004 నుంచి గెలుపే లేని టీడీపీ 
టీడీపీ ఆవిర్భావం తర్వాత మాచర్ల నియోజకవర్గంలో మొత్తం పది సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా కేవలం నాలుగు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది. మూడుసార్లు కాంగ్రెస్, మూడుసార్లు వైఎస్సార్‌ సీపీ గెలుపొందాయి. 2012 నుంచి వైఎస్సార్‌ సీపీ తరఫున పీఆర్కే జయకేతనం ఎగురవేస్తుండడం విశేషం. టీడీపీ నుంచి 1983లో కొర్రపాటి సుబ్బారావు, 1989లో నిమ్మగడ్డ శివరామ కృష్ణప్రసాద్, 1994లో కుర్రి పున్నారెడ్డి, 1999లో జూలకంటి దుర్గాంబ గెలిచారు. కాంగ్రెస్‌ నుంచి 1995లో నత్తువ కృష్ణమూర్తి, 2004లో పిన్నెల్లి లక్ష్మారెడ్డి,  2009లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (పీఆర్కే) గెలిచారు. వైఎస్సార్‌ సీపీ నుంచి 2012, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా పీఆర్కే విజయ పరంపర కొనసాగించారు. (క్లిక్ చేయండి: టీడీపీ నేతల్లో కొత్త టెన్షన్‌.. ఇదేం కర్మరా బాబు?)

మరిన్ని వార్తలు