Christmas 2022: రక్షణోదయం క్రిస్మస్‌

25 Dec, 2022 05:50 IST|Sakshi

యేసు అంటే రక్షణ. యేసు జననమే రక్షణోదయం. అదే క్రిస్మస్‌. రక్షణకు పుట్టిన రోజు. ఆ రక్షణా కార్యానికి దేవునిచే నియుక్తుడై, అభిషిక్తుడైన ఆ క్రీస్తును ఆరాధించడమే క్రిస్మస్‌. లోకాన్ని బాధించి వేధించే చీకటి కుట్రల సమస్యల నుండీ, మానసిక సమస్యల నుండీ తప్పించి శాంతిని ప్రసాదించేదే ఈ క్రిస్మస్‌! మానవుల్ని రక్షించడం కోసం నియమితుడైన క్రీస్తును ఆస్వాదించడం, ఆ రక్షణలో ఆనందించడం, అందు మమేకం కావడం, అదే ఆరాధించడం అంటే!

ఇంతకూ ఆ రక్షణలో ఏముంది? ఆ రక్షణలో వెలుగుంది. పెడ దారిన పడనీయకుండా నడిపే ఆ వెలుగు, ఒక మంచి మార్గం చూపిస్తుంది. ఎక్కడో కొండల్లో, కోనల్లో లోయల్లో గొర్రెల కాపరుల్ని అర్ధ రాత్రి తోక చుక్క రూపంలో నడిపించింది, బెత్లెహేం పురానికి చేర్చింది. పశుల శాలలో శిశువు రూపాన ఉన్న చిన్ని దేవుడ్ని చూపించింది. ఆ మహాప్రకాశాన్ని ఆరాధించేట్టు చేసింది.

క్రిస్మస్‌ అంటే వెలుగును ఆరాధించడం. దేవ శబ్దానికి కాంతి అనీ, కాంతితో పాటు అన్నీ ఇచ్చు వాడనేది మన భారతీయ ఆధ్యాత్మిక తాత్త్విక నైఘంటి కార్థం. ఆ యేసు రక్షణ కాంతితో పాటు ఇంకేమేమి ఇస్తున్నట్టు?

లోకం నేడు కల్ల బొల్లి మాటల గారడీల్లో చిక్కుకు పోయింది. కుట్రలకు మోసాలకూ లోనైంది. మూఢ ఆచారాలకు, సాంఘిక దురాచారాలకు బానిసయై పోయింది. వీటినుండి రక్షింప బడడానికై అసలైన సిసలైన సత్య కాంతి అవసరం. అది ఈ బాల దేవుని దగ్గర వాక్య రూపేణా పుష్కళంగా లభిస్తుంది. మన శ్శాంతి దొరుకుతుంది. అందుకే దాన్ని అందుకోవాలనే అందరూ ఆరాధించారు. 

లోకాన్ని ఎంతగానో ప్రేమించిన దేవాది దేవుడు తన ఏకైక ప్రియ కుమారుడ్ని తన ప్రేమ చిహ్నంగా భూమండలానికి పంపించాడు. ప్రాణానికి ప్రాణమైన ఆ తీపిప్రాణం మన మానవ కోటి రక్షణార్థంగా బలై పోయింది. ఆ ప్రభుని ప్రేమనూ, త్యాగాలనూ తమలోకి ఆహ్వానించుకోవడం, ఆయన చూపిన ప్రేమను సాటి వ్యక్తులక్కూడా  అందించడమే క్రిస్మస్‌!

– డాక్టర్‌ దేవదాసు బెర్నార్డ్‌ రాజు
(క్రిస్మస్‌ సందర్భంగా) 

మరిన్ని వార్తలు