TCongress: నా యాత్ర ఎందుకు ఆపారు? ఎవరి ఒత్తిడికి తలొగ్గారు? మాణిక్‌రావు ఠాక్రేకు మహేశ్వర్‌ రెడ్డి లేఖ

14 Mar, 2023 12:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ మాణిఖ్ రావు ఠాక్రేకు  ఏలేటి మహేశ్వర్ రెడ్డి బహిరంగ లేఖ రాయడం పార్టీలో చర్చనీయాంశమైంది. తన హాత్ సే హాత్ జోడో యాత్రను అర్ధంతరంగా నిలిపివేయాలని ఆదేశించడం తనను తీవ్రంగా బాధించిందని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. యాత్ర ఆగిపోవడం తనను అప్రతిష్టపాలు చేసిందని, ఎవరి ఒత్తిళ్లకో తలొగ్గి నా యాత్రను నిలిపివేశారని అనిపిస్తోందని అనుమానం వ్యక్తం చేశారు. కాంగ్రెస్సే సర్వస్వం అనుకుని పని చేస్తున్న తనను ఇలా అవమానించడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.

'నా 18 ఏళ్ల రాజకీయ ప్రస్ధానంలో ఇలా బాధను, అసంతృప్తిని వ్యక్తం చేస్తూ లేఖ రాయడం కూడా ఇదే మొదటి సారి.  హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా నేను ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు తలపెట్టిన యాత్రను నాలుగు రోజులు నిర్వహించిన అనంతరం అర్ధంతరంగా నిలిపివేయాలని మీరు ఆదేశించడం నన్ను తీవ్రంగా బాధించింది. ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ కు తలపెట్టిన నా తెలంగాణ పోరు యాత్రను విరామం అనంతరం తిరిగి ఈ నెల పదో తేదీ నుంచి ప్రారంభించేందుకు నేను అన్ని ఏర్పాట్లు ముందే చేసుకున్నాను. కానీ మీరు నిర్మల్ సభ ముగిసిన అనంతరం, షెడ్యూల్ ప్రకారం  నా యాత్రను కొనసాగించడానికి వీల్లేదని, రద్దు చేసుకోవాలని ఆదేశించడం నన్ను షాక్ కు గురిచేసింది. ఈ సందర్భంలో మీరు నాతో మాట్లాడిన తీరు కూడా నన్ను తీవ్రంగా బాధించింది.  

అదే సమయంలో కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క గారు హాత్ సే హాత్ జోడో యాత్రను ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు నిర్వహిస్తానంటూ ముందుకురావడం, సహకరించాలని నన్ను కోరడంతో నేను నా యాత్రను భట్టి గారి యాత్రలో విలీనం చేస్తున్నట్టు, ఈ యాత్రను ఆయన కొనసాగిస్తారని ప్రకటించాల్సి వచ్చింది. నా యాత్రను మీరు ఉన్న పళంగా అకారణంగా రద్దు చేసిన అంశం వివాదం కావొద్దనే సదుద్దేశంతో నేను భట్టి విక్రమార్క గారి యాత్రకు సహకరిస్తున్నట్టు ప్రకటించాను. అయితే నాయాత్రను ఆపేయాలన్న మీరు అదే సందర్భం లో  ఇతర సీనియర్లు కూడా యాత్రలు చేస్తారని చెప్పడం వెనకున్న మతలబేంటి,  మరి విజయవంతంగా సాగుతున్న నా యాత్రను అర్ధంతరంగా ఎందుకు నిలిపివేసినట్టు, ఇంతలా నన్ను అవమానించడం ఎంత  వరకు సమంజసం?  

హాత్ సే హాత్ జోడో అభియాన్ అనేది  ఏఐసీసీ రూపొందించిన ప్రోగ్రామ్. ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ గా తెలంగాణలో హాత్ సే హాత్ జోడో యాత్రలను పర్యవేక్షించాల్సింది నేనే. అలాంటి బాధ్యతలో ఉన్న నన్ను, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ అయినే మీరే అడ్డుకోవడమేంటి? కాంగ్రెస్ ఇమేజ్ ను బలోపేతం చేసేందుకు పార్టీ జెండా పట్టుకుని యాత్ర చేస్తున్నానే తప్ప కొందరిలా సొంత ప్రతిష్ట పెంచు కోవాలనే అజెండాతో కాదే, మరి అలాంటపుడు ఎందుకని నా యాత్రను ఆపేయాలన్నారు? ఏఐసిసి  ప్రోగ్రామ్స్  అమలు విషయంలో నన్ను బైపాస్ చేస్తూ, అవమానిస్తున్న అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొచ్చాను.  అయితే జరుగుతున్న లోపాలను  సరిచేయాల్సిన మీరే అవేమీ పట్టించు కోకుండా ఏక పక్షంగా వ్యవహరించడం ఎంత వరకు సమంజసం. పదవులు నాకు ముఖ్యం కాదు, ప్రజా సేవే నా లక్ష్యం. ఇది నాకు తాత, తండ్రి నుంచి వచ్చిన రక్తగత లక్షణం. ఆత్మాభిమానాన్ని చంపుకుని అవమానాలు, భరిస్తూ పనిచేయడం నా విధానం కాదు. నేను లేవనెత్తిన అంశాలకు సమాధానం ఇస్తారని ఆశిస్తున్నా.' అని మహేశ్వర్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.
చదవండి: నా యాత్రలో అందరూ భాగస్వాములు కావాలి: భట్టి విక్రమార్క

మరిన్ని వార్తలు