ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేంద్రం 

1 Apr, 2023 01:15 IST|Sakshi

దేశ సంపదను కొల్లగొడుతున్న బీజేపీ 

బీజేపీ, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వాలను గద్దెదించాలి 

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క 

బెల్లంపల్లి రూరల్‌: ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నియంతపాలన సాగిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. భట్టి చేపట్టిన పీపుల్స్‌మార్చ్‌ యాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పెర్కపల్లి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. దేశ సంపదను అదానీ, లలిత్‌ మోదీ, నీరవ్‌ మోదీ కార్పొరేట్‌ కంపెనీలకు అప్పగించి మోదీ ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తోందని ఆరోపించారు.

దోపిడీదారులకు కొమ్ముకాస్తూ నిరంకుశ పాలనతో ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ అక్రమాలను ప్రశ్నిస్తున్న రాహుల్‌గాంధీపై అక్రమ కేసులు వేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజావ్యతిరేక పాలన సాగిస్తూ ప్రజలకు తీరని అన్యాయం చేస్తోందన్నారు. సింగరేణి ఆస్పత్రుల్లో వసతులు, ప్రత్యేక వైద్యులు లేక కా ర్మికులు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు.

కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే సమస్యలు పరిష్కారమై మెరుగైన పాలన అందుతుందని తెలిపారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, పీసీసీ సభ్యుడు చిలుముల శంకర్, నాయకులు మల్లేశ్‌ పాల్గొన్నారు. 

పాదయాత్రలో కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ 
భట్టి పీపుల్స్‌ మార్చ్‌› పాదయాత్ర శుక్రవారం సాయంత్రం బెల్లంపల్లి మండలం పెర్కపల్లి నుంచి ప్రారంభమై నెన్నెల మండలం గుండ్ల సోమారం, నార్వాయిపేట్‌ వరకు సాగింది. ఈ పాదయాత్రలో కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్‌ పాల్గొని సంఘీభావం తెలిపారు. భట్టి శుక్రవారం బెల్లంపల్లి ఏఎంసీ మైదానం నుంచి నెన్నెల మండలం గుండ్లసోమారం–నార్వాయిపేట్‌ వరకు దాదాపు 18 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు.  

మరిన్ని వార్తలు