కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్న విజయశాంతి!

11 Nov, 2023 16:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సీనియర్‌ సినీ నటి, మెదక్‌ మాజీ ఎంపీ విజయశాంతి కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఆమెకు ఈ దఫా అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్‌ దక్కలేదు. అలాగే చాలాకాలంగా ఆమె పార్టీ పట్ల అసంతృప్తి ఉన్నారు. బీజేపీ అధికారిక కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొనడం లేదు. మరోవైపు స్టార్‌ క్యాంపెయినర్‌ జాబితాలోనూ ఆమె పేరు లేకపోవడం చర్చనీయాంశాలుగా మారాయి.

ఈ తరుణంలో ఆమె కాంగ్రెస్‌ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, టీపీసీసీ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లు రవి ఈ విషయాన్ని ధ్రువీకరించారు కూడా. 

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే విజయశాంతి బీజేపీకి మద్దతుదారుగా ఉన్నారు. తమిళనాడులో 1996 ఎన్నికల సమయంలో అన్నాడీఎంకేకు, అటుపై లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి స్టార్‌ క్యాంపెయినర్‌గా వ్యవహరించి పరోక్ష రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్వయహరించారు. అటుపై 1998లో బీజేపీలో చేరి ప్రత్యక్ష రాజకీయాల్లో తన ప్రస్థానం ప్రారంభించారు. 1999 సార్వత్రిక ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి సోనియా గాంధీపై విజయశాంతి బీజేపీ తరఫున పోటీ చేయాలనుకున్నారు. అయితే సోనియా గాంధీ బళ్లారి నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకోవడంతో.. విజయశాంతి కడప రేసు నుంచి తప్పుకున్నారు. 

దాదాపు దశాబ్దంపాటు బీజేపీలో కొనసాగిన ఆమె.. 2009లో బయటకు వచ్చి తల్లీ తెలంగాణ అనే సొంత పార్టీని స్థాపించారు. అటుపై ఆ పార్టీని బీఆర్‌ఎస్‌(అప్పటి టీఆర్‌ఎస్‌)లో విలీనం చేశారు. 2009లోనే మెదక్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. కేసీఆర్‌తో విభేదాల వల్ల 2014లో ఆమె కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. నాలుగేళ్ల తర్వాత కాంగ్రెస్‌లో ఆమెకు ఎన్నికల స్టార్‌ క్యాంపెయినర్‌, టీపీసీసీకి ఎన్నికల ప్రచార కమిటీ సలహాదారుగా నియమించారు అప్పటి ఏఐసీసీ ప్రెసిడెంట్‌ రాహుల్‌ గాంధీ.

2019లో ప్రధాని మోదీపై ఆమె చేసిన విమర్శలు చర్చనీయాంశంగా మారాయి. 2020లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన విజయశాంతి.. అదే ఏడాది డిసెంబర్‌లో అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరారు. 

మరిన్ని వార్తలు