దీదీ నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్: మోదీ

13 Apr, 2021 03:36 IST|Sakshi

బీజేపీ సెంచరీ చేసింది

బెంగాల్‌ ప్రచారంలో ప్రధాని

బర్ధమాన్‌: పశ్చిమబెంగాల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇన్నింగ్స్‌ ముగిసిందని బీజేపీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో సోమవారం ఆయన క్రికెట్‌ పరిభాషలో కాసేపు మాట్లాడారు. గడచిన నాలుగు విడతల ఎన్నికల్లో బెంగాల్‌ ప్రజలు ఫోర్లు, సిక్సులు కొట్టారని, బీజేపీ సెంచరీ కొట్టేసిందని వ్యాఖ్యానించారు. సగం మ్యాచ్‌లోనే టీఎంసీని ప్రజలు ఊడ్చేశారన్నారు. ‘ఓటర్లు దీదీని నందిగ్రామ్‌లో క్లీన్‌బౌల్డ్‌ చేశారు.

బెంగాల్‌లో ఆమె ఇన్నింగ్స్‌ ముగిసింది. ఆమె మొత్తం టీమ్‌ను కూడా గ్రౌండ్‌ నుంచి వెళ్లిపోవాలని ప్రజలు తేల్చేశారు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. ఒక టీఎంసీ నాయకురాలు దళితులను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలతో బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ ఆత్మ క్షోభిస్తుందన్నారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్‌ కులాల వారిని భిక్షగాళ్లు అని ఇటీవల టీఎంసీ మహిళానేత, ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా ఉన్న సుజాత మోండల్‌ వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ‘దీదీ తనను తాను రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ అని చెప్పుకుంటారు.

ఆలాంటి టైగర్‌ అనుమతి లేకుండా పార్టీ నేత ఆ వ్యాఖ్యలు చేయగలరా? అలాంటి మాటలతో బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ ఆత్మ క్షోభిస్తుంది. మమత బెనర్జీ  కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించలేదు. క్షమాపణ చెప్పలేదు’ అన్నారు. దళితులను అవమానించి మమత పెద్ద తప్పు చేశారన్నారు. బంగ్లాదేశ్‌లో తాను మథువా సామాజిక వర్గానికి చెందిన సంస్కర్త హరిచంద్‌ ఠాకూర్‌ జన్మస్థలాన్ని సందర్శించడాన్ని మమత తప్పుబట్టారని మథువా వర్గం బలంగా ఉన్న కల్యానిలో జరిగిన సభలో ప్రధాని పేర్కొన్నారు. ఒక్కసారి అధికారం కోల్పోతే తిరిగి రాలేనన్న విషయం మమతకు అర్థమైందని వ్యాఖ్యానించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు