బీజేపీ ఓ రాజకీయ పార్టీనా?: మమత ఫైర్‌

20 Mar, 2021 17:00 IST|Sakshi

కోల్‌కతా : అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ. ప్రత్యర్ధి పార్టీలపై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. బీజేపీపై విమర్శల డోస్‌ను మరింత పెంచారు. శనివారం ఖేజురీ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆమె బీజేపీ లక్షల కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటోందని ఆరోపించారు. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఓ సాధారణ పౌరుడు రూ. 500 దొంగిలిస్తే అతడ్ని దొంగ అంటారు. కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని దోచుకుంటున్న బీజేపీని ఏమని పిలవాలి? బీజేపీ ఓ రాజకీయ పార్టీనా? భారత్‌లో అదో చెత్త పార్టీ. బీజేపీలో మహిళలకు కూడా రక్షణ లేదు. భారత్‌లో బీజేపీనే పెద్ద దోపిడీ దారు’’ అని అన్నారు. తాజాగా టీఎంసీని వీడి బీజేపీలో చేరిన వారిపై కూడా విరుచుకుపడ్డారు. ‘‘ ద్రోహులు టీఎంసీని వీడినందుకు ప్రశాంతంగా ఉంది. అదే మనల్ని కాపాడింది’’ అని పేర్కొన్నారు. 

కాగా, శుక్రవారం నాటి ఎన్నికల ప్రచారంలోనూ బీజేపీపై విమర్శలు చేశారామె. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి వీడ్కోలు చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ పార్టీ తమకు అవసరం లేదన్నారు. నరేంద్ర మోదీ ముఖం చూడడం  ఇష్టం లేదని తేల్చిచెప్పారు. అల్లర్లు, లూటీలు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, మీర్‌ జాఫర్‌ తమకు అక్కర్లేదని స్పష్టం చేశారు.

చదవండి : నోరు జారిన పన్నీర్‌సెల్వం.. అందరూ నవ్వడంతో..

మరిన్ని వార్తలు