వేదికపై స్టెప్పులేసిన మమతా బెనర్జీ

24 Dec, 2020 20:30 IST|Sakshi

సాక్షి, కోలకతా: టీఎంసీ అధినేత, ప‌శ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మ‌మ‌తా బెన‌ర్జీ, మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. బెంగాల్‌ సంగీత మేలా 2020లో తనదైన శైలిలో స్టేజ్‌పై స్టెప్పులేసి అందరి దృష్టిని ఆకర్షించారు. దీనికి సంబంధించిన వీడియో నెటిజనులకు ఆకట్టుకుంటోంది.రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదుర్కొంటున్న సీఎం మమతా  కమల నాధులకు  చుక్కలు చూపిస్తూ.. రాజకీయాల్లో తలమునకలై ఉన్నారు. అయితే  బం‍గ్లా మ్యూజిక్ ఫెస్టివ‌ల్‌ను ప్రారంభించిన ఆమె ఆటవిడుపుగా స్టేజ్‌పై స్టెప్పులేశారు.  ఈ ఉత్సవానికి వ‌చ్చిన జాన‌ప‌ద క‌ళాకారుల‌తో క‌లిసి  కాసేపు సందడి చేశారు.

ప్రముఖ సంత‌ల్ నృత్యకారిణి బ‌సంతీ హేమ్‌బ్ర‌మ్‌ను సన్మానించిన సీఎం మమత తనకూ కొన్ని స్టెప్స్‌ నేర్పించమని అడిగారు. ఈ క్రమంలో బసంతితో కలిసి దీదీ కూడా ఉత్సాహంగా అడుగులు కదిపారు. ఈ కార్య‌క్ర‌మంలో మ్యుజీషియ‌న్లు, సింగ‌ర్లు, డ్యాన్స‌ర్లు కూడా పాల్గొన్నారు.  అనంతరం తనదైన శైలిలో బీజేపీపై ధ్వజమెత్తారు. బెంగాల్‌ను ఎవరూ నాశనం చేయలేరనీ,  బెంగాల్‌ను ఎన్న‌టికీ గుజ‌రాత్‌లా మారనీయమని స్పష్టం చేశారు. సంగీతానికి సరిహద్దులు లేవని నొక్కిచెప్పిన మమతా బెనర్జీ, విభజన రాజకీయాలకు అనుమతించవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జాతీయ గీతం, జాతీయ పాట, జై హింద్ ఈనినాదాలను అందించిన ఘనతే  పశ్చిమ బెంగాల్‌దేనని ఆమె పేర్కొన్నారు. బెంగాల్ నేల జీవన వనరు. ఈ మట్టిని కాపాడుకోవాలి. దీనిపై మనం గర్వపడాలన్నారు. అంతేకాదు బయటినుంచి వచ్చిన వారెవరూ  మన రాష్ట్రాన్ని మార్చలేరు అంటే బీజేపీపై మరోసారి మండిపడ్డారు.

మరిన్ని వార్తలు