కోకాపేట ప్రభుత్వ భూముల వేలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం

18 Jul, 2021 01:09 IST|Sakshi

అగ్రకులాలకు హైటెక్‌సిటీ, బీసీ మైనారిటీలకు గుట్టల్లో భూములా?అని ప్రశ్న

బౌద్ధనగర్‌ (హైదరాబాద్‌): కోకాపేట ప్రభుత్వ భూముల వేలాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ వేలంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అక్రమ సంపాదన పెరిగిందని ఆరోపించారు. శనివారం పార్శిగుట్టలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. విపక్షాలను పక్కదోవ పట్టించడానికి వేలంలో వచ్చిన డబ్బులను దళిత సాధికారిత కోసం ఉపయోగిస్తామని సీఎం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు.

వెలమ, కమ్మ అగ్రకులాల ఆత్మగౌరవ భవనాలకు హైటెక్‌ సిటీలో కోట్లు విలువైన భూములు కేటాయించి బీసీ, మైనార్టీలకు కొండగుట్టల్లో ఎలా కేటాయిస్తారని సీఎం కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. దీంతో ప్రజల్లో అసమానతలు పెరుగుతాయన్నారు. దళితుల్లో ఉన్న 59 ఉప కులాల వారికి ఒక సెంటు భూమి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేటాయించలేదని పేర్కొన్నారు. నగర శివార్లలోని 200 ఎకరాల్లో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం భూమిని కేటాయించాలని కోరారు. కేసీఆర్‌ ఏడేళ్ల పాలనలో దళితుల సాధికారిత ముందుకు సాగిందా, వెనక్కి వెళ్లిందా? అనే అంశంపై ఈ నెల 22న సోమాజిగూడ ప్రెస్‌ క్లబ్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు