మీ ముగ్గురికీ శంకరగిరిమాన్యాలే..

17 Dec, 2023 05:38 IST|Sakshi

నీకంత సీన్‌ ఉంటే 175 సీట్లలో సింగిల్‌గా పోటీచేయగలవా?

చంద్రబాబుకు మంత్రి అంబటి రాంబాబు సవాల్‌

మా పార్టీ గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్లలో మార్పులు  

ఇప్పుడు మళ్లీ 175కి 175 గెలిచే దిశగా అడుగులు వేస్తున్నాం 

వైఎస్‌ జగనే మళ్లీ సీఎం కావాలని 60 శాతానికి పైగా ప్రజలు కోరుకుంటున్నారు 

యువగళం పాదయాత్ర అట్టర్‌ఫ్లాప్‌ 

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేశ్‌ ఓడిపోవడం ఖాయమని.. వారికి శంకరగిరిమాన్యాలు తప్పదని, పవన్‌కళ్యాణ్‌ది కూడా అదే పరిస్థితి అని మంత్రి అంబటి రాంబాబు తేల్చిచెప్పారు. ఎన్టీఆర్‌ దెబ్బకు చంద్రగిరిలో చంద్రబాబు ఓడి కుప్పం పారిపోయాడని.. అలాగే, వైఎస్‌ జగన్‌ దెబ్బకు మంగళగిరిలో లోకేశ్, రెండుచోట్ల దత్తపుత్రుడు పవన్‌ చిత్తుచిత్తుగా ఓడిపోయి రోడ్లపై తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం అంత సీన్‌ ఉంటే 175 సీట్లలో సింగిల్‌గా పోటీచేయగలరా? అని సవాల్‌ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

బాబు మతిస్థిమితం కోల్పోయారు..
జగన్‌ ఒక్కడిపై అందరూ ఎందుకు గుంపుగా ఎన్నికల్లో పోటీచేస్తున్నారు? జనసేనతో జతకట్టి చంద్రబాబు ఎందుకు ఎన్నికలకు వస్తున్నారు? రాజమండ్రి జైలుకు వెళ్లొచ్చాక చంద్రబాబు మతిస్థిమితం కోల్పోయారు. అందుకే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల మార్పుపై అర్థంపర్థంలేని విమర్శలు చేస్తున్నారు. సీఎం జగన్‌పైనా, ప్రభుత్వంపైనా పిచ్చి విమర్శలు ఎన్నిచేసినా చంద్రబాబుకు మళ్లీ ఓటమి ఖాయం.

ఈసారి టీడీపీ, జనసేనల ఉనికి ఉండదు. ఆ దిశగానే మా పార్టీ వ్యూహరచన చేస్తోంది. వైఎస్‌ జగనే మళ్లీ సీఎం కావాలని 60 శాతానికి పైగా ప్రజలు కోరుకుంటున్నారు. వారే మా పార్టీకి బలం. 175 సీట్లు గెలవడమే మా టార్గెట్‌. పార్టీ గెలుపే ధ్యేయంగా కొన్ని సీట్లు మార్పులు జరుగుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలి. నిజానికి.. చంద్రబాబు ఏనాడైనా ప్రభుత్వ స్కూళ్లను పట్టించుకున్నారా? ఆయన కేవలం ప్రైవేట్‌ స్కూళ్లకు మాత్రమే రాచబాట వేశారు. అలాగే, ఒక్కసారైనా పేదలకు ఇళ్ల పట్టాలిచ్చారా? కానీ, 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలిచ్చిన నాయకుడు వైఎస్‌ జగన్‌. టీడీపీ దిగజారిపోయిన పార్టీ. ఎన్నికల తర్వాత ఆ పార్టీ భూస్థాపితమే. 

పవన్‌కు ఎన్ని సీట్లు ముష్టి వేస్తారు బాబు?
పవన్‌కళ్యాణ్‌కు చంద్రబాబు అసలు ఎన్ని సీట్లు ముష్టి వేయాలనుకుంటున్నారు? అలాగే, పవన్‌ ఎన్ని సీట్లు తీసుకోవాలనుకుంటున్నారు? పవన్‌ ఏమైనా పదేళ్లకు కాంట్రాక్టు మాట్లాడుకున్నారా? గతంలో టీడీపీ, జనసేన రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీచేసి అధికారంలోకి వచ్చినప్పుడు, కాపాడిన రాష్ట్ర భవిష్యత్తేంటో వాళ్లు చెప్పాలి. అధికారంలోకి రాగానే ఇద్దరూ ఒకరినొకరు విమర్శించుకున్నారు. ఇద్దరిదీ కలహాల కాపురం అని తేలిపోయింది. వాళ్లిద్దరూ కలిసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మళ్లీ ఇప్పుడు కలుస్తామంటున్నారు. అలాగే, మోదీని విమర్శించిన చంద్రబాబు మళ్లీ బీజేపీతో కలుద్దామనుకుంటున్నారు.

పోలవరాన్ని నాశనం చేసింది బాబే..
ఇక పోలవరం ప్రాజెక్టును నాశనం చేసింది చంద్రబాబే. దీనిపై ఆయనతో ఎక్కడైనా నేను చర్చకు సిద్ధం. అంకెల గారడీతో ఆయన ప్రజలను మోసం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబుకు రిటైర్మెంట్‌ ఖాయం. టీడీపీ, జనసేన రెండు పార్టీలను కాలగర్భంలో కలిపేస్తాం. 

>
మరిన్ని వార్తలు