బురద చల్లడమే బాబు పని

7 Dec, 2021 04:31 IST|Sakshi

మీడియా మైకులు కనిపిస్తే చంద్రబాబు రెచ్చిపోతారు

ఓటీఎస్‌ కింద రిజిస్ట్రేషన్లు తప్పనడానికి చంద్రబాబు ఎవరు

మంత్రి బొత్స ధ్వజం

సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబుకు మీడియా మైకులు కనిపిస్తే రెచ్చిపోతారని, కడుపుమంట వెళ్లగక్కుతారని మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ప్రభుత్వంపై బురద చల్లడమే ఆయన పనిగా పెట్టుకున్నారన్నారు. చిత్తశుద్ధి, పని చేయాలనే తపన ఆయనలో లేదని దుయ్యబట్టారు. తాను అబద్ధాలు ఆడుతున్నానని బుచ్చయ్య చౌదరి చెబుతున్నారని, ధైర్యముంటే చర్చకు రావాలంటూ సవాల్‌ విసిరారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన సోమవారం మాట్లాడారు. రాజ్యాంగ పరిధిలో బాబు పాలన చేస్తే, 23 సీట్లకు ఎందుకు దిగజారారని ప్రశ్నించారు.

కాల్‌ మనీ సెక్స్‌ రాకెట్‌లో మునిగిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తప్పించేందుకే 2016లో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ జీవో ఇచ్చి, 2019 వరకు తొక్కిపెట్టారని చెప్పారు. అంబేడ్కర్‌ విగ్రహం పేరుతో డైవర్షన్‌ ప్లాన్‌ను అమలు చేశారని, విగ్రహం ఆకారం కూడా లేకుండా, అధికారంలో ఉన్న మిగతా మూడేళ్లూ డ్రామా ఆడారన్నారు. ఇప్పుడు మళ్లీ బాబు అంబేడ్కర్‌ గుర్తొచ్చారని మండిపడ్డారు. విజయనగరం వ్యక్తులు, భాష, సంస్కృతి గురించి బాబు విమర్శలు చేస్తున్నారని, వారిలాగా మోసం, దగా, వంచనతో రాజకీయాలు చేయబోమన్నారు.

ఉచితంగా ఇళ్లను ఎందుకు ఇవ్వలేదు?
ఓటీఎస్‌ కింద పేదలకు సంపూర్ణ హక్కులతో పక్కా ఇళ్లను ఇస్తున్నామని బొత్స తెలిపారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన బాబు ఇళ్లను ఉచితంగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.  ఓటీఎస్‌ కింద రిజిస్ట్రేషన్లు తప్పు అని చెప్పడానికి చంద్రబాబు ఎవరని ప్రశ్నించారు.  

చదవండి: Lok Sabha: రఘురామ వ్యాఖ్యలను తిప్పికొట్టిన ఎంపీ మిథున్‌రెడ్డి

మరిన్ని వార్తలు