మీరే నన్ను చంపేశారు.. నేనే బతికే ఉన్నానయ్య

6 Dec, 2021 16:31 IST|Sakshi

రాయగడ(భువనేశ్వర్‌): రాజు తలచుకుంటే.. కొరడా దెబ్బలకు కొదువా? అన్నట్లు బతికున్న వారిని సైతం మృతుల జాబితాలో చేర్చడం అంత కష్టమేమీ కాదని నిరూపించారు జిల్లా అధికారులు. ప్రాణాలతో ఉన్న ఓ వృద్ధురాలి పేరును ఏకంగా మృతి చెందినట్లు రికార్డుల్లోకి ఎక్కించి, ఆమెకు రావాల్సిన నెలవారీ రేషన్‌ రాకుండా చేశారు. దీంతో ఏకంగా 6 నెలల రేషన్‌ సరుకులను ఆమె అందుకోలేకపోయింది.

ప్రతినెలా రేషన్‌ షాపు దగ్గరకు వెళ్లి అడిగిన ఆమెకి నువ్వు మృతి చెందినట్లు ఉందని, రేషన్‌ ఇవ్వలేమని చెప్పడంతో బాధితురాలు లబోదిబోమంటోంది. తనకు న్యాయం చేయాలని ప్రాధేయపడుతోంది. వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని కొలనార సమితి, మేదర వీధికి చెందిన ఎమ్‌.నారాయణమ్మ(60)కు భర్త మృతి చెందిన తొలి రోజుల్లో వృద్ధాప్య పెన్షన్‌తో పాటు 35 కిలోల రేషన్‌ బియ్యం అందించేవారు. అయితే ఆరు నెలలుగా ఆయా పథకాల లబ్ధి ఆమెకి అందడం లేదు. ఎందుకని ఆరా తీసిన ఆమెకు విస్తుపోయే నిజం తెలిసింది.

జిల్లా మృతుల జాబితాలో తన పేరున్నందున రావడం లేదని తెలుసుకుంది. ప్రస్తుతం జిల్లా ఉన్నతాధికారులను కలిసిన ఆమె నేను బతికే ఉన్నానయ్యా..నాకు ప్రభుత్వ పథకాలు అందించాలని అభ్యర్థిస్తోంది.  స్పందించిన పౌర సరఫరాల శాఖ ఇన్స్‌స్పెక్టర్‌ అనిల్‌కుమార్‌ గొమాంగొ జరిగిన నిర్వాకంపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

చదవండి: ఆలీబాబా అరడజను దొంగలు.. ప్లాన్‌ ఒకరు అమలు చేసేది మరొకరు

మరిన్ని వార్తలు