ఈ యుద్ధంలో పేదలదే గెలుపు: మంత్రి జోగి రమేష్‌

25 May, 2023 21:38 IST|Sakshi

సాక్షి, అమరావతి: అమరావతిలో రేపు (శుక్రవారం) నిరుపేదలకు ఇళ్ల ‘పట్టా’భిషేకం జరగబోతోందని, రాష్ట్ర చరిత్రలో నిల్చిపోయే ఒక అపురూప ఘట్టం అని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. సీఎం జగన్‌ చేతుల మీదుగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు, ఇళ్ల పంపిణీ జరగబోతుందన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇది ఒక గొప్ప పండగ. 50 వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయబోతున్నాం. అలాగే వారికి ఇళ్లు నిర్మించే కార్యక్రమం కూడా రేపు ప్రారంభమవుతోందన్నారు.

మంత్రి జోగి రమేష్‌ ఏమన్నారంటే.. ఆయన మాటల్లోనే
ఈ మహత్తర కార్యక్రమం కోసం ఒక యుద్ధమే జరిగింది. నిరుపేదలు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన నిలబడిన సీఎం జగన్, వారి కోసం న్యాయ పోరాటం చేశారు. అటు పెత్తందార్ల పక్షాన నిలబడిన నరరూప రాక్షసుడు చంద్రబాబు.. అమరావతిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా విశ్వ ప్రయత్నం చేశారు. పేదలకూ సొంత ఇళ్లు ఉండాలని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తపిస్తున్న ప్రభుత్వం మనందరిది అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వరాదని అడ్డుకున్న దుర్మార్గులు చంద్రబాబు అండ్‌ కో. వాళ్ల అరాచకాలు ఏ స్థాయిలో ఉన్నాయంటే.. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జిల్లా కోర్టులు మొదలు హైకోర్టు.. చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారు. అయినా పేదల పక్షాన పోరాడిన ప్రభుత్వం తన సంకల్పాన్ని సాధించుకుంది. 

సామాజిక సమతుల్యం దెబ్బ తింటుందట!
గతంలో ఏనాడైనా ఇలాంటి మహత్కార్యాన్ని చూశామా?. అమరావతిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే, సామాజిక సమతుల్యం (డెమొగ్రఫిక్‌ బ్యాలెన్స్‌) దెబ్బ తింటుందట!. అలా సామాజిక అంటరానితనం వస్తుందట. అంటే అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నివసిస్తే రాజధానిలో అంటరానితనం వస్తుందా? అంత దారుణమా?. చంద్రబాబు సమర్థిస్తున్న పెత్తందార్లకు పాలేర్లు కావాలి. పని వాళ్లు కావాలి. అంతేకాని.. ఆ పని వాళ్లు అక్కడ ఉండకూడదు. ఆ పాలేర్లు రాజధానికి దూరంగా బతకాలి. అదీ చంద్రబాబు వైఖరి. అందుకే ఆయనకు రాజకీయాల్లో ఉండే అర్హత ఏ మాత్రం లేదు.

బాబుకు సమాధి తప్పదు:
నిరుపేదలకు ఇస్తున్న ఇంటి స్థలాన్ని సమాధితో పోల్చిన చంద్రబాబు.. తనలోని నైజాన్ని బయటకు వెళ్లగక్కాడు. అందుకే ఆయనకు భూస్థాపితం తప్పదు. గత ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూట గట్టుకున్న చంద్రబాబును, వచ్చే ఎన్నికల్లో ఆ నిరుపేదలే.. ఆ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే మళ్లీ చిత్తుగా ఓడిస్తారు. పెత్తందార్ల కోటను వారు బద్ధలు కొడతారు. అందుకు అంతా సిద్ధంగా ఉన్నారు.
చదవండి: పేదలకు ‘పట్టా’భిషేకం.. అక్కచెల్లెమ్మలకు తోడుగా..

బాబును నమ్ముకుంటే మునిగినట్లే:
రాజధాని పేరుతో పక్కా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసిన చంద్రబాబు.. నిజానికి రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌. రాజధాని పేరిట 33 వేల ఎకరాలకు ఒక వలయం పెట్టి పెత్తందారీ రాజ్యానికి కాపలా ఉంటూ.. రియల్‌ ఎస్టేట్‌ బ్రోకర్‌లా పని చేస్తున్నారు. అందుకే చంద్రబాబు అహంకార మనస్తత్త్వాన్ని ప్రజలు గమనించాలి. రాష్ట్రమంతా ఎక్కడికక్కడ ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకునేందుకు కోర్టులకు వెళ్లిన చంద్రబాబు, తన నిజ స్వరూపం బయట పెట్టారు. ఆయన ఎప్పటికైనా పెత్తందార్ల పక్షానే ఉంటారు. కాబట్టి చంద్రబాబును నమ్ముకుంటే నట్టేట మునిగినట్లే.

అందరినీ ఆహ్వానిస్తున్నాం:
అమరావతిలో ఒక గొప్ప కార్యక్రమం, పండగలా జరగబోతోంది. ప్రతిష్టాత్మకమైన ఈ కార్యక్రమానికి అమరావతి రైతులతో సహా అందరినీ ఆహ్వానిస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పును కూడా వక్రీకరిస్తూ అమరావతిలో కొందరు పెత్తందారీ మహిళలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. వాళ్లకు అండగా నిలబడి పోరాటాలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. అందుకే ఇప్పటికైనా అమరావతి రైతులు చంద్రబాబు నయవంచనను అర్ధం చేసుకోవాలని, పేదల పండగలో భాగస్వామ్యం కావాలని మంత్రి జోగి రమేష్‌ కోరారు.

మరిన్ని వార్తలు