Rohini Karthi 2023: Ice Apple Significance - Sakshi
Sakshi News home page

Ice Apple: కడుపు ఉబ్బరం, ఎసిడిటీ ఉన్నవారు లేత ముంజెలు తిన్నారంటే!

Published Thu, May 25 2023 9:31 PM

Rohini Karthi 2023: Ice Apple Significance - Sakshi

నేటి నుంచి రోహిణి కార్తె. రోళ్లు పగులుతాయని ప్రతీతి. ఇంకో రెండు వారాలు ఉగ్ర ఉష్ణాన్ని ఎదుర్కొనక తప్పదు. కాని ప్రతిదానికి ప్రకృతిలో విరుగుడు ఉంటుంది. మార్కెట్‌ను ముంజెలు ముంచెత్తుతున్నాయి. ఎండకు జవాబుగా తమను జుర్రుకోమంటున్నాయి. పెద్దవాళ్లు వీటిని మర్చిపోయారు. పిల్లలు చులకనగా చూస్తున్నారు. కాని ముంజె చేసే మేలు తల్లి కూడా చేయదు. కుటుంబాన్ని కాపాడే శక్తి దీనికి ఉంది. అంతేనా? ఈ ముంజెల చుట్టూ అందరికీ ఎన్నో జ్ఞాపకాలు.

ఇప్పుడు కాదులెండి... ముప్పై నలబై ఏళ్ల కింద మంచి ఎండపూట వీధుల్లో ‘తాటి ముంజెలో తాటి ముంజెలో’ అని అరపు వినిపిస్తే వంట పనిలోనో, అన్నాలు అయ్యాక కునుకులోకి వెళ్లబోతో ఉన్న అమ్మ, నానమ్మ, ఇంటికి భోజనానికి వచ్చిన నాన్న... ‘పిలువు... పిలువు’ అని పిల్లల్ని పురమాయించేవారు. పిల్లలు పరిగెత్తుకొని బయటకు వెళితే ఎవరో ఒక గ్రామీణుడు కావడిబద్దకు చెరొకవైపు  ముంజెలు కట్టిన లేత తాటాకు కట్టలతో కనిపించేవాడు.

12 తాటి ముంజెల కట్టది ఒక రేటు. 24 తాటి ముంజెల కట్టది ఒక రేటు. గీచి గీచి బేరం తెగ్గొట్టాక, ఇంట్లోకి తెచ్చి కట్ట విప్పితే అన్నీ లేతగా ఉంటే అదృష్టం. ముదురు ఎక్కువగా ఉండే నష్టం. అమ్మ  తాటిముంజెల చెక్కు తీసి, స్టీలు గిన్నెలో వాటిలో నుంచి నీరు చిమ్ముతూ ఉండగా ముక్కలుగా కోసి, కొద్దిగా చెక్కెర జల్లి మూతేసి పెట్టి (ఇప్పుడు ఫ్రిజ్‌లో పెట్టి) ‘నిద్ర పోయి లేచాక తిందాం’ అని చెప్తే నిద్ర పడితే కదా. మధ్యాహ్నం కునుకు పూర్తి కాకముందే ఆ తాటి ముంజెల్ని గబగబా తింటూ ఆఖరున ఆ చక్కెర నీరు తాగుతూ ఉంటే ఎంతో హాయి మరెంతో రుచి ఇంకెంతో మధుర జ్ఞాపకంగా నిలిచిపోయేది.

పల్లెల్లో ఎక్కడ పడితే అక్కడ తాటి చెట్లు, వాటిక్కాసిన గెలలు దొరుకుతాయి. తాటిచెట్టు ఎక్కడం ఆర్ట్‌. రాకపోతే ఒళ్లు చెక్కుకుపోతుంది. ఎక్కగలిగినవాడు కొడవలి విసిరి గెల కిందకు తెస్తే అల్లరి పిల్లలు మూగి చెక్కిన తాటి కాయల్లో నుంచి తొంగి చూసే కన్నులను కుడివేలు బొటన వేలుతో జుర్రేసి మింగేసేవారు. ఒక్కొక్కరు ఐదు పది కాయలను కూడా జుర్రేసేవారు. ఇక ఎంత ఎండలో ఆడినా డీహైడ్రేషన్‌ అవడం అసాద్యం. వడదెబ్బ అసంభవం. కడుపులో చేరిన లేత నీరు అలాంటిది.

పట్నాల్లో ఎడ్ల బండ్లలో తాటి గెలలు తెచ్చి రోడ్డుకు ఒకవైపున బండి ఆపి తాటికాయలను కొట్టి ఒక్కో కాయ ఇంత అని అమ్ముతూ ఉంటే పిల్లలు తెగమూగేవారు. పెద్దలు అక్కడిక్కడ తిని డిప్పల్ని పారేసేవారు. పిల్లలు ఆ ఖాళీ డిప్పల్లో కాస్త పెద్దవాటిని రెండు ఎంచుకుని ఒక పుల్లతో అనుసంధానించి తాడు కట్టి లాగుతూ తాటిబండి ఆట ఆడుకునేవారు. వేసవిని పంపిన భగవంతుడు తాటిచెట్టు చిటారుకొమ్మన తాటి గెలలను పెట్టి వాటిలో ముంజెలను పెట్టి ఆ ముంజెల్లో తియ్యటి నీరును పెట్టడమే దయకు సూచన. కరుణకు ఆనవాలు.

తాటి ముంజెలు పిల్లలు, పెద్దలు, గర్భిణులు, బాలింతలు అందరూ తినొచ్చు. తినాలి. వేసవిలో ఉష్ణం వల్ల ఆమ్ల, క్షార గుణాల్లో తేడా వచ్చి శరీరంలో విషకారకాలు ఉత్పన్నం అవుతాయి. వాటిని నిర్మూలం చేయాలంటే తాటి ముంజెలకు మించినవి లేవు. శరీరంలో కోల్పోయిన నీటిని ముంజెలు సమతులం చేస్తాయి. ఒంటికి చలువనిస్తాయి.

కోవిడ్‌ అనంతర నీరసంలాంటి సమస్యలను, అలసటను తరిమికొట్టే శక్తి ముంజెలకు ఉంది. అవి మార్కెట్‌లో కనపడేనన్ని రోజులు తరచూ తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి తెచ్చుకోవచ్చు. లేత తాటిముంజెల్లో ఉన్న నీరు మినరల్‌ వాటర్‌తో సమానం. తాటి ముంజెలు జీర్ణశక్తికి అద్భుతంగా తోడ్పడతాయి. కడుపు ఉబ్బరం, ఎసిడిటీ ఉన్నవారు ఉదయాన్నే గ్యాస్‌ నిండినట్టుగా భావించేవారు లేత  ముంజెలు తింటే చాలా మంచిది. గర్భిణులు తింటే తల్లికి, లోపల ఉన్న బిడ్డకు మంచిది. ఈ విషయాన్ని తమిళనాడుకు చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనతో తేల్చారు. 

రోహిణి కార్తెలో వడదెబ్బ తగలకుండా ముంజెలు కాపాడతాయి. వికారం ఉంటే పోగొడతాయి. తట్టు, పొంగులను నివారిస్తాయి. కాలేయాన్ని ఉత్సాహపరుస్తాయి. అధిక బరువు ఉన్నవారు వీటిని ఒకపూట ఆహారంగా తీసుకుంటే (వీటితో పాటు ఒక పండు తింటే) బరువు తగ్గుతారు. సీజన్‌లో వచ్చే ఫలాలు ఆ సీజన్‌లో వచ్చే సమస్యలను దూరం చేస్తాయని అందరికీ తెలుసు. వేసవిలో వచ్చే ముంజెలు వేసవి సమస్యలకు సమాధానం చెప్తాయి.

ముదురు తాటిముంజెలు తినకూడదు. పిల్లలకు పెట్టకూడదు. కడుపునొప్పి వస్తుంది. ఇప్పుడు మార్కెట్‌లో పాలిథిన్‌ కవర్లలో ముంజెలు అమ్ముతున్నారు. పిల్లలు పోజులకు పోయినా తప్పనిసరిగా తినిపించాలి. వీటిని ఇంగ్లిష్‌లో ‘ఐస్‌ యాపిల్స్‌’ అంటారని చెప్తే పేరు నచ్చయినా తింటారు. చల్లగా తినండి. ఎండను జయించండి.
  

Advertisement
Advertisement