ఇదేం మేనిఫెస్టో?: హరిరామజోగయ్య విమర్శలు

14 Nov, 2023 16:18 IST|Sakshi

సాక్షి, పశ్చిమ గోదావరి: టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై మాజీ మంత్రి, కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు హరిరామ జోగయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు కూడా మేనిఫెస్టోలో  లేవని అన్నారాయన. 

పొత్తులో ఉన్న జనసేన టీడీపీలు  ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో విడుదల చేశాయి. అయితే అది అంత ఆకర్షనీయంగా లేదని హరిరామ జోగయ్య ఓ లేఖ విడుదల చేశారు. ‘‘మేనిఫెస్టోలో ప్రజల కనీస అవసరాలు తీర్చగలిగే నిర్దిష్టమైన అంశాలు లేవు. ఇరు పార్టీలు తయారు చేసిన మినీ మేనిఫెస్టో అంత ఆకర్షనీయంగా, జనరంజకంగా లేదు. కనీసం నాలుగు కోట్ల మంది సంతృప్తి పడే విధంగా మేనిఫెస్టో రూపొందించడం శ్రేయస్కరం. 

.. పైగా అధికార వైఎస్సార్‌సీపీ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు  ఈ మేనిఫెస్టో ఏమాత్రం సరితూగదని లేఖలో ప్రస్తావించారాయన. 

సమన్వయంగా సాధించేది ఏంటి?
తెలుగు దేశం పార్టీతో పొత్తుపై వ్యతిరేకత నెమ్మదిగా బయటకు వస్తోంది. నియోజకవర్గాల వారీగా ఇరు పార్టీల మధ్య జరుగుతున్న సమన్వయ సమావేశాలు అందుకు వేదిక అవుతున్నాయి. చంద్రబాబుతో ములాఖత్‌ తర్వాత రాజమండ్రి జైలు ముందు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పొత్తు ప్రకటించారు. కానీ, క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం వేరుగా ఉంటోందని జనసేన కేడర్‌ చెబుతోంది. 

ఉమ్మడి జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా జరుగుతున్న సమన్వయ సమావేశాల్లో ఇరు పార్టీల కేడర్‌ నుంచి కొన్ని ఇబ్బందికర ప్రశ్నలు పరస్పరం ఎదురవుతున్నాయి. ‘‘ఇన్నాళ్లు టీడీపీని ఎందుకు విమర్శించారు? ఇప్పుడు ఎందుకు చంకనెక్కారు?. ఇంకెన్నాళ్లు ఎజెండా పక్కనబెట్టి పక్క పార్టీ జెండా మోద్దాం?. అసలు జనసేనకు ఎన్ని సీట్లిస్తారు? ఎక్కడెక్కడ ఇస్తారు?. రెండు పార్టీల మ్యానిఫెస్టో అంటూ ఒకటే తయారు చేస్తున్నారు.. దానికి గ్యారంటీ ఏంటీ?. తెలంగాణ తరహాలో జనసేన అభ్యర్థులుగా టీడీపీ నేతలే బరిలో దిగుతారా?. అసలు పవన్‌ కల్యాణ్‌ ఎక్కడ పోటీ చేస్తాడు? లోకేష్‌ ఎక్కడ పోటీ చేస్తాడు?. మీకే నియోజకవర్గాల్లో గ్యారంటీ లేకుంటే.. రెండు పార్టీల భవిష్యత్తుకు ఏం గ్యారంటీ ఉంటుంది?. క్షేత్ర స్థాయిలో జనసేన క్యాడర్‌ను తెలుగుదేశం నేతలు అసలు పట్టించుకోవడం లేదు, దానికేమంటారు?. కొన్ని చోట్లయితే మరీ వివక్ష చూపిస్తున్నారు, సభలు పెట్టుకుంటే వచ్చి జెండా పట్టుకోమంటున్నారు?’’.. ఇలా పలు ప్రశ్నలు లెవనెత్తినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు