కాంగ్రెస్‌లో టాక్‌.. సీఎం రేవంత్‌ సన్నిహితుడికి ఎమ్మెల్సీ?

22 Dec, 2023 19:24 IST|Sakshi

ఆ నేత తెలంగాణ సీఎం రేవంత్‌కు సన్నిహితుడు. అయినా రెండుసార్లు ఆయనతో దురదృష్టమే దోస్తీ చేసింది. అసలు దోస్తు ముఖ్యమంత్రి కావడంతో ఆ నేత రాజకీయ జీవితంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయనే టాక్ నడుస్తోంది. చట్టసభలో అడుగు పెట్టాలని ఆయన కన్న కలలు నిజం కానున్నాయా? ఎమ్మెల్యే టిక్కెట్ దక్కలేదు. ఎంపీ టిక్కెట్ హామీ దొరికింది. ఇప్పుడేమో ఎమ్మెల్సీ అంటున్నారు. ఏదో ఒక రూపంలో చట్టసభలోకి ఎంట్రీ ఇస్తారా? ఇంతకీ ఆ నేత ఎవరంటే..

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడంతో గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు మంత్రి పదవులు పొందిన వారు ఎంత సంతోషంగా ఉన్నారో వారితో పాటు ఇంకొందరు నేతలు కూడా ఆనందపడుతున్నారట. అలా సంతోషపడుతున్న వారిలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన పటేల్‌ రమేష్ రెడ్డి కూడా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న సూర్యాపేట నియోజకవర్గానికి చెందిన పటేల్ రమేష్‌ రెడ్డి ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా పోటీ చేసి చట్టసభలో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. 2016లో రేవంత్‌తో పాటు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు రమేష్ రెడ్డి. 2018లో సూర్యాపేట నుంచి ఎమ్మెల్యే టికెట్ ఆశించారు. కానీ చివరకు సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డికి అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఆ సమయంలో 2019 నల్లగొండ ఎంపీగా అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. చివరకు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీ బరిలో నిలవడంతో ఆయనకు మరోసారి భంగపాటే ఎదురైంది.

రెండుసార్లు టికెట్ ఆశించి రాకపోవడంతో తీవ్ర ఆవేదనలో ఉన్న రమేష్‌ రెడ్డికి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ చివరి నిమిషంలో మరోసారి రమేష్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ హ్యాండిచ్చింది. ఈసారి కూడా రాంరెడ్డి దామోదర్ రెడ్డికే కాంగ్రెస్ నాయకత్వం టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రమేష్‌ రెడ్డి ఎలా అయినా పోటీ చేయాలని నిశ్చయించుకుని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్ నుంచి నామినేషన్ కూడా వేశారు. కానీ ఉప సంహకరణకు చివరి రోజున కాంగ్రెస్ హైకమాండ్‌ దూతలు బుజ్జగింపులకు దిగారు. 

నల్లగొండ స్థానం నుంచి ఎంపీగా అవకాశం కల్పిస్తామని అధిష్టానంతో పాటు సిట్టింగ్ ఎంపీ ఉత్తమ్ రాతపూర్వక హామీ ఇవ్వడంతో ఆయన వెనక్కి తగ్గారు. దామోదర్ రెడ్డికి మద్దతుగా నిలిచారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు పూర్తి కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రమేష్‌ రెడ్డికి కొత్త ఆశ పుట్టిందట. ఎంపీ ఎన్నికల నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో ఏమో అనుకుంటూనే ప్రస్తుతానికైతే ఎమ్మెల్సీ ఇస్తే బాగుంటుంది పార్టీ కోసం అనేక త్యాగాలు చేసిన తనకు అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారట. ఎలాగూ సీఎం కమ్ పీసీసీ చీఫ్‌ తన చిరకాల స్నేహితుడే కావడంతో ఈసారి ఖచ్చితంగా ఎమ్మెల్సీ వస్తుందన్న ధీమాతో ఉన్నారట. 
 
శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట నుంచి పోటీ చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించిన పటేల్ రమేష్‌రెడ్డి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలను చుట్టి వచ్చేలా పాదయాత్ర చేశారు. పోటీకి అవసరమైన అన్ని వనరులను సమకూర్చుకున్నారు. ఆయనకు టికెట్ ఇప్పించేందుకు రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ, టికెట్ రాకపోవడంతో తీవ్ర నిరాశలోకి వెళ్లిపోయిన పటేల్‌ పట్ల రేవంత్‌కు కూడా సానుభూతి ఉంది. తనకు మొదటి నుంచి అండగా ఉన్న రమేష్ రెడ్డికి ఓ పదవి ఇస్తే పోలా అన్న ఆలోచనలో ఉన్నారట రేవంత్. దీంతో రాబోయే రోజుల్లో ఖాళీ అయ్యే ఏదో ఒక ఎమ్మెల్సీ స్థానంలో రమేష్‌ రెడ్డిని మండలికి పంపించే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. దీంతో రమేష్ రెడ్డి పట్టరాని సంతోషంతో ఉన్నారట. ఇన్నాళ్లు పట్టువదలని విక్రమార్కులా ప్రయత్నం చేసినందుకు ఫలితం త్వరలోనే రాబోతోందని రమేష్ రెడ్డి ఆశిస్తున్నారట. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పటేల్ రమేష్‌ రెడ్డి స్నేహితులు. ఇద్దరూ ఒకేసారి కాంగ్రెస్‌లోకి వచ్చారు. రేవంత్‌ను అదృష్టం వరించింది. పటేల్‌ను ఇప్పటివరకు దురదృష్టం వెంటాడింది. ఇప్పటికే ఆయన్ను అదృష్టం వరిస్తే మండలిలో ఎంట్రీ దొరకవచ్చనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.
 

>
మరిన్ని వార్తలు