ఏపీ పరువు తీయడానికే బాబు ఢిల్లీ టూర్‌

26 Oct, 2021 04:47 IST|Sakshi

ఏపీ నుంచే దేశం మొత్తానికి గంజాయి వెళుతున్నదనేది ఓపెన్‌ సీక్రెట్‌ అని టీడీపీ హయాంలో బాబు కేబినెట్‌లో చర్చించలేదా?

స్కూల్‌ బస్సుల్లో కూడా గంజాయి రవాణా చేస్తున్నారని మీ కేబినెట్‌లో మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు చెప్పలేదా?

గంజాయి అక్రమ రవాణాలో ‘పెద్దల’ హస్తం ఉందని మీ కేబినెట్‌ మంత్రులే చెప్పింది నిజం కాదా?

ప్రధానిని బూతులు తిట్టిన, అమిత్‌షాపై రాళ్లు వేసిన వీడియోలు రాష్ట్రపతికి చూపించారా?

వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ విమర్శ

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ పరువు తీయడానికే చంద్రబాబు తన బృందంతో ఢిల్లీ వెళ్లారని వైఎస్సార్‌సీపీ ఎంపీ మార్గాని భరత్‌ ధ్వజమెత్తారు. తనకు అధికారం దక్కలేదన్న అక్కసుతో చంద్రబాబు అబద్ధాలు, అవాస్తవాలు పోగేసుకుని ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిశారని.. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు, ఇక్కడ యువత డ్రగ్స్‌కు బానిసలైపోయినట్టు నిస్సిగ్గుగా ఆరోపణలు చేశారని మండిపడ్డారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి కుట్ర రాజకీయాలు చంద్రబాబుకు కొత్తకాదని, ఎన్టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆయనపై చెప్పులు వేయించిన ఘనుడని ధ్వజమెత్తారు. ఓటుకు కోట్లు కేసు వ్యవహారం మెడకు చుట్టుకున్నప్పుడు కూడా చంద్రబాబు ఢిల్లీ వెళ్లారని, ఆ కేసు నుంచి బయట పడేందుకు చివరకు ఏపీకి హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదాను కూడా తాకట్టు పెట్టారని ఆరోపించారు. ఎంపీ భరత్‌ ఇంకా ఏమన్నారంటే..

గంజాయి రవాణాపై అప్పటి మీ మంత్రులు ఏమన్నారో మర్చిపోయారా
‘ఏపీ నుంచే దేశం మొత్తానికి గంజాయి వెళుతున్న విషయం ఓపెన్‌ సీక్రెట్‌’ అని మీరు సీఎంగా ఉన్నప్పుడు కేబినెట్‌లో చర్చించలేదా? స్కూల్‌ బస్సుల్లో కూడా గంజాయి రవాణా చేస్తున్నారని మీ కేబినెట్‌ మంత్రులు గంటా, అయ్యన్నపాత్రుడు చెప్పలేదా? గంజాయి అక్రమ రవాణాలో పెద్దల హస్తం ఉందని స్వయానా మీ కేబినెట్‌ మంత్రులే చెప్పింది నిజం కాదా. వాస్తవాలు ఇలా ఉంటే.. రాష్ట్ర యువతపై టీడీపీ డ్రగ్స్‌ నెపం మోపుతోంది.

బూతుల్ని సమర్థించుకోవడానికే..
సాక్షాత్తు ప్రధాన మంత్రిని బూతులు తిట్టిన సీడీలను, అమిత్‌ షా తిరుపతి వచ్చినప్పుడు రాళ్లు రువ్వించిన వీడియోలను రాష్ట్రపతికి చూపించారా? బాబు అండ్‌ కో మాట్లాడిన బూతులను సమర్థించుకోవడానికే చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు. ఎన్నికల్లో గెలవలేనని తెలిసిన బాబు ఆర్టికల్‌ 356 కోరుతున్నట్టున్నారు. దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతికి అబద్ధాలు, అవాస్తవాలు చెప్పినందుకు, స్టేట్‌ స్పాన్సర్డ్‌ టెర్రరిజం అనే నెపాన్ని వేస్తున్న బాబు అండ్‌ కోను అరెస్ట్‌ చేసి అండమాన్‌ దీవుల్లాంటి చోటకు పంపిస్తే ప్రజలు హర్షిస్తారు.

అసాంఘిక శక్తులకు రారాజు చంద్రబాబు
అసాంఘిక శక్తులకు రారాజు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిడితే, అందుకు ప్రజలు స్పందిస్తే, దాన్ని అల్లర్లుగా సృష్టించాలని బాబు చూస్తున్నారు. గతంలోనూ మత, కుల రాజకీయాలు చేసి రాష్ట్రంలో చిచ్చు పెట్టాలని బాబు తీవ్ర ప్రయత్నం చేశారు. ఇప్పుడు డ్రగ్స్‌ రాజకీయాలు తీసుకొస్తూ అందులో బూతు రాజకీయాలు కలుపుతున్నారు.  

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు