Munugode Politics: టీఆర్‌ఎస్‌లో టికెట్‌ లొల్లి.. అసమ్మతి లేఖాస్త్రం.. చల్లార్చే యత్నం

11 Aug, 2022 01:50 IST|Sakshi

కూసుకుంట్లకు టికెట్‌ ఇవ్వొద్దంటున్న మునుగోడు టీఆర్‌ఎస్‌ నేతలు

ఆయనకిస్తే ఓటమి ఖాయమంటూ అధినేతకు లేఖ

మంత్రి జగదీశ్‌రెడ్డితో భేటీ

ఇదే అంశం స్పష్టీకరణ

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నికను ఎదుర్కొనేందుకు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ సహా అన్ని రాజకీయ పార్టీలు సన్నాహాలు వేగవంతం చేస్తున్నాయి. అయితే అధికార పార్టీలో అసమ్మతి సెగ రాజుకుంటోంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే తాము ఆయనతో కలసి పనిచేసే పరిస్థితి లేదంటూ పార్టీకి చెందిన నియోజకవర్గ ముఖ్య నేతలు సుమారు పది మంది పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు ఇటీవల లేఖ రాశారు. తాజాగా బుధవారం మంత్రి జగదీశ్‌రెడ్డికి కూడా ఇదే విషయం తేల్చి చెప్పారు.  

పార్టీ పూర్తిగా దెబ్బతిందన్న నేతలు
మునుగోడు ఉప ఎన్నికను సవాలుగా తీసుకుంటున్న టీఆర్‌ఎస్‌ అధిష్టానం మునుగోడు నేతల అసంతృప్తిని చల్లార్చేందుకు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అందులో భాగంగా నియోజకవర్గానికి టీఆర్‌ఎస్‌ అసమ్మతి నేతలు బుధవారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్రభాకర్‌రెడ్డి వైఖరితో నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ పూర్తిగా దెబ్బతిందని, ఆయనకు మరోమారు పోటీకి అవకాశం ఇస్తే భారీ ఓట్ల తేడాతో ఓటమి ఖాయమని స్పష్టం చేశారు. ‘శ్మశానం చేసి రాజ్యమేలినట్లు’గా ఉంటుందని మంత్రికి చెప్పారు. అన్ని విషయాల్లోనూ కూసుకుంట్ల జోక్యం పెరిగిపోయిందని, కేడర్‌ను పట్టించుకోకుండా సొంత లావాదేవీల్లో మునిగి తేలుతున్నారని ఆరోపించినట్లు తెలిసింది.

తొందరపడొద్దన్న మంత్రి 
అయితే ఉప ఎన్నిక ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతలెవరూ తొందరపాటుగా వ్యవహరించవద్దని అసమ్మతి నేతలకు జగదీశ్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. అన్ని కోణాల్లోనూ పరిశీలించిన తర్వాతే పార్టీ అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. త్వరలో సీఎం కేసీఆర్తో పాటు పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌తోనూ భేటీ జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆయా భేటీల్లో పార్టీ అధిష్టానానికి తమ సమస్యలు వివరిస్తామని బుధవారం నాటి సమావేశానికి హాజరైన టీఆర్‌ఎస్‌ నేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. మినిస్టర్స్‌ క్వార్టర్స్‌లోని ఆఫీసర్స్‌ క్లబ్‌లో జరిగిన ఈ భేటీలో కర్నాటి విద్యాసాగర్, నారగోని రవికుమార్, నారాయణపురం, మునుగోడు, నాంపల్లి జడ్పీటీసీ సభ్యులు, చౌటుప్పల్‌ మాజీ జడ్పీటీసీ బుచ్చిరెడ్డి, చౌటుప్పల్‌ ఎంపీపీ, సింగిల్‌ విండో చైర్మన్, పార్టీ మండల కమిటీ మాజీ అధ్యక్షుడు, నారాయణపురం ఎంపీపీ, మునుగోడు, నాంపల్లి వైస్‌ ఎంపీపీలు తదితరులు పాల్గొన్నారు.

మినిస్టర్స్‌ కార్వర్స్‌ టూ ప్రగతిభవన్‌
మంత్రుల నివాస సముదాయంలో సుదీర్ఘ భేటీ అనంతరం అసంతృప్త నేతలను వెంటబెట్టుకొని మంత్రి జగదీశ్‌ రెడ్డి ప్రగతిభవన్‌కు వెళ్లారు. అయితే అధికారిక కార్యక్రమాలతో కేసీఆర్‌ బిజీగా ఉండడంతో వారు ఆయనతో భేటీ అయ్యేందుకు అవకాశం దొరకలేదని తెలిసింది. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, పార్టీ జిల్లా ఇన్‌చార్జి తక్కలపల్లి రవీందర్‌ రావు అసమ్మతి నేతలతో సుమారు అరగంట పాటు భేటీ అయ్యారు. మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన పూర్తి సమాచారం సీఎం వద్ద ఉందని, స్థానిక పార్టీ నేతలు, కార్యకర్తల అభిప్రాయం తీసుకున్న తర్వాతే టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని కేసీఆర్‌ ప్రకటిస్తారని వారు స్పష్టం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తన ప్రయోజనాల కోసమే ఈ ఉప ఎన్నిక తెచ్చారనే విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు. పార్టీ ఎంపిక చేసిన అభ్యర్థిని కలసికట్టుగా గెలిపించుకోవాల్సిన బాధ్యత నియోజకవర్గ నేతలపైనే ఉంటుందని చెప్పారు. 

ఉప ఎన్నికకు సిద్ధం: జగదీశ్‌
మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్‌రెడ్డి తెలిపారు. ప్రజలు కూడా పార్టీ విషయంలో సానుకూలంగా ఉన్నారని చెప్పారు. ప్రగతిభవన్‌లో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి గెలిపించుకుంటామని చెప్పారు. తన పదవికి అర్ధాంతరంగా రాజీనామా చేసిన రాజగోపాల్‌ రెడ్డి ఎమ్మెల్యేగా మునుగోడును అభివృద్ధి చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు. తన స్వార్ధం కోసమే ఉప ఎన్నిక పరిస్థితి తెచ్చారన్నారు. మునుగోడులో గత నాలుగేళ్లలో కోల్పోయిన అభివృద్ధిని, రాబోయే ఎన్నికల్లో తెచ్చుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. నియోజకవర్గంలో పార్టీ నేతలు గ్రూపులుగా విడిపోయి సమావేశాలు నిర్వహిస్తున్నట్టు వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు.
చదవండి: మునుగోడులో టీఆర్‌ఎస్‌కు ఊహించని షాక్‌!

మరిన్ని వార్తలు