జానాకు షాక్‌.. ఒక్కరౌండ్‌లో మాత్రమే...!

2 May, 2021 14:15 IST|Sakshi

సాక్షి, నల్గొండ: నాగార్జున సాగర్‌ ఉప ఎన్నికల్లో వరుస రౌండ్లలో స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తూ టీఆర్‌ఎస్‌ పార్టీ దూసుకుపోతుంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి ఇప్పటి వరకు కేవలం ఒక్క 14వ రౌండ్‌లో మాత్రమే ఆధిక్యంలోకి వచ్చారు. జానాకు కంచుకోటగా ఉన్న సాగర్‌లో టీఆర్‌ఎస్‌ మరోసారి సత్తాచాటింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తరపున ఇక్కడి నుంచి పోటీచేసిన జానారెడ్డి దివంగత నోముల నర్సింహయ్య చేతిలో ఓటమిపాలైన సంగతి తెలిసిదే. ఇక ప్రస్తుత కౌంటింగ్‌ సరళి చూస్తుంటే కారు పార్టీకి షాకిస్తామని ప్రచారంతో హోరెత్తించిన కాంగ్రెస్‌ చతికిలపడ్డట్టు స్పష్టమవుతోంది. 

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలన నిజం చేస్తూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల భగత్‌ మంచి మెజారీటీతో దూసుపోతున్నారు. నోముల భగత్‌ను వ్యూహాత్మంగా సాగర్‌ బరిలో దించిన టీఆర్‌ఎస్‌ ఓటర్ల దృష్టిని తమవైపునకు తిప్పుకోవడంలో సక్సెస్‌ అయినట్టుగా తెలుస్తోంది. తండ్రి నోముల నర్సింహయ్యపై ఉన్న అభిమానాన్ని ప్రజలు భగత్‌పైనా చూపించారు. మరోవైపు దుబ్బాక ఉప ఎన్నికలో విజయం, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీచ్చిన బీజేపీ సాగర్‌లో గెలవాలని చాలా ప్రయత్నాలే చేసింది. 

అయితే, క్షేత్రస్థాయిలో అధికార టీఆర్‌ఎస్‌ బలం ముందు కాషాయదళం తేలిపోయింది. ఇప్పటివరకు 19 రౌండ్ల కౌంటింగ్‌ జరగ్గా ఒక్క రౌండ్‌లో కూడా బీజేపీ చెప్పుకోదగ్గ ఓట్లు సాధించలేదు. టీఆర్‌ఎస్‌ 14వేల ఓట్ల మెజారీతో తొలి స్థానంలో ఉండగా.. కాంగ్రెస్‌ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక దుబ్బాక ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన అధికార టీఆర్‌ఎస్‌ సాగర్‌ ఉప ఎన్నికలో వ్యూహాత్మంగా వ్యవహరించింది. చివరివరకు అభ్యర్థిని ప్రకటించడకుండా ఆఖరి క్షణంలో నరసింహయ్య కొడుకునే బరిలోకి దించింది. తద్వారా ప్రత్యర్థి పార్టీల అంచనాలకు అందకుండా జాగ్రత్త పడింది. జానా కోటలో పాగా వేసేందుకు మరోసారి సిద్ధమైంది!

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు