‘నవీన భారత జాతిపిత’ వ్యాఖ్యలపై నితీశ్‌ కుమార్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

1 Jan, 2023 16:08 IST|Sakshi

పట్నా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని నవ భారత జాతిపితగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృత ఫడ్నవీస్‌ అభివర్ణించిన విషయం తెలిసింది. ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. నవీన భారత జాతి పిత దేశానికి ఏం చేశారని ప్రశ్నించారు. ‘వారు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడలేదు. ఆర్‌ఎస్‌ఎస్‌ కూడా స్వాతంత్య్ర పోరాటం చేయలేదు. అయినా, నవీన భారత జాతిపితగా పేర్కొన్నట్లు విన్నాం. అసలు నవీన భారత్‌కు సరికొత్త జాతి పిత ఏం చేశారు? ’ అనిఘాటుగా స్పందించారు నితీశ్‌ కుమార్‌. 

రాహుల్‌ గాంధీని ప్రధాని అభ్యర్థిగా కాంగ్రెస్‌ ప్రకటిస్తే తనకు ఎటువంటి సమస్య లేదని పేర్కొన్నారు నితీశ్‌. తాను ప్రధాని కావాలని కోరుకోవడం లేదని పునరుద్ఘాటించారు. అన్ని మిత్ర పక్షాలతో మాట్లాడి వారు ఈ అంశాన్ని ప్రకటించాలని, ప్రస్తుతం నేతలంతా భారత్‌ జోడో యాత్రలో బిజీగా ఉన్నారని గుర్తు చేశారు. బిహార్‌ విద్యాశాఖలో ఉద్యోగులకు నియామక పత్రాలు అంద జేసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. 

మరోవైపు.. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే సైతం అమృత ఫడ్నవీస్‌ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. మహాత్మా గాంధీతో ఎవరినీ పోల్చలేమని స్పష్టం చేశారు. ‘జాతిపితతో ఎవరినీ పోల్చలేం. వారి(బీజేపీ) సరికొత్త భారత్‌ కేవలం కొద్ది మంది ధనవంతుల కోసం మాత్రమే ఏర్పడింది. మిగిలిన ప్రజలు ఇంకా పేదరికంలోకి వెళ్లారు. క్షుద్భాతతో అలమటిస్తున్నారు. ఇలాంటి సరికొత్త ఇండియా మాకు అవసరం లేదు’అని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఆ వ్యాఖ్య ప్రధాని మోదీని అవమానించడమే: సంజయ్‌ రౌత్‌ ధ్వజం

మరిన్ని వార్తలు