Oxygen Shortage: మోదీ సర్కార్‌పై చిదంబరం ఫైర్‌

20 Jul, 2021 21:18 IST|Sakshi

అబద్దాలు, అసత్యాలతో మాయం చేసే  ఆర్ట్‌

మోదీ సర్కార్‌పై   కాంగ్రెస్‌ నేత పీ చిదంబరం  ఫైర్‌

గుడ్డి, చెవిటి  సర్కార్‌కు నిజాలు కనపడవు, వినపడవు

సాక్షి, న్యూఢిల్లీ: కరోనా సెకండ్‌వేవ్‌లో ఆక్సిజన్‌ కొరత కారణంగా ఒక్కరు  మరణం కూడా నమోదు కాలేదని  కేంద్రం తాజాగా ప్రకటించడం దుమారాన్ని రాజేసింది. దీనిపై ప్రతిపక్షపార్టీనాయకులు, ఇతరనేతలు కేంద్రంపై దుమ్మెత్తి పోశాయి. ముఖ్యంగా  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఆర్థిక మంత్రి పీచిదంబరం మరోసారి నరేంద్రమోదీ సర్కార్‌పై ధ్వజమెత్తారు. గుడ్డి, చెవిటి ప్రభుత్వం సత్యాన్ని చూడలేదు, నిజాలను వినలేదంటూ  మండిపడ్డారు. ప్రతీ విషాదాన్ని అబద్దాలు, అసత్యాలతో మాయం చేసే ఆర్ట్‌ ప్రభుత్వం సొంతమని ఆయన ఎద్దేవా చేశారు.

మొదట వ్యాక్సీన్ల కొరత లేదన్నారు. మధ్యప్రదేశ్‌లో టీకాల కొరత ఏర్పడింది. దేశంలో చాలా టీకా కేంద్రాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇపుడు ఆ‍క్సిజన్‌ కొరత కారణంగా మరణాల నివేదికలు లేవని కేంద్రం చెబుతోందంటూ మండిపడ్డారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేశారు. మరణాలు లేవని ప్రకటించలేదు... మరణాల నివేదికలు లేవని మాత్రమే మంత్రిగారు ప్రకటించారు దీన్ని గమనించాలంటూ  ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

కరోనా రెండో  దశలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాతాల్లో  ఆక్సిజన్‌ కారణంగా కరోనా  మరణాలు సంభవించలేదని ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు తెలియజేశారు. అయితే ఆక్సిజన్‌కు డిమాండ్‌లో భారీగా పెరగడంతో  రాష్ట్రాల మధ్య సమాన పంపిణీకి కేంద్రం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. మొదటి దశలో 3,095 మెట్రిక్ టన్నులతో పోలిస్తే రెండోదశలో దాదాపు 9,000 మెట్రిక్ టన్నులకు చేరిందని వివరించింది. ఏప్రిల్ 15 న  మొదటి కేటాయింపు జరగ్గా, తీవ్రతను బట్టి ఎప్పటికపుడు సమీక్షిస్తూ ఆక్సిజన్‌ కేటాయింపులు చేశామని పేర్కొన్నారు.  2021 మే 28 నాటికి  అధిక భారం ఉన్న  26 రాష్ట్రాలకు మొత్తం 10,250 మెట్రిక్ టన్నుల కేటాయించినట్టు వెల్లడించారు.

మరిన్ని వార్తలు