KTR Vs Karnataka: రీట్వీట్‌ చేసిన కేటీఆర్‌.. తప్పుపట్టిన కర్ణాటక మంత్రి.. అసలు ఏమైంది?

4 Apr, 2022 20:07 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: హౌసింగ్‌.కామ్‌, ఖాతాబుక్‌ సీఈవో రవీష్‌ నరేష్‌ కొన్ని రోజుల క్రితం చేసిన ఓ ట్వీట్‌ ప్రస్తుతం రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. రవీష్‌ నరేష్‌ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందించడం.. కేటీర్‌కు కర్ణాటక కాంగ్రెస్‌ చీఫ్‌ డీకే శివకూమార్‌ కౌంటర్‌ ఇవ్వడానికి తోడు మంత్రి అశ్వత్నారయన్ కూడా మండిపడటం.. రాజకీయపరంగా దుమారం రేపుతోంది. అసలేం జరిగిందంటే.. కర్ణాటక రాజధాని బెంగళూరులో మౌలిక సదుపాయాలు సరిగా లేవంటూ రవీష్‌ నరేష్‌ ట్వీట్‌ చేశారు.‘బెంగళూరులో(భారత సిలికాన్‌ వ్యాలీ) ఐటీ సెక్టార్‌ అభివృద్ధి చెంది ఎన్నో స్టార్టప్‌లు బిలియన్ డాలర్ల పన్నులు చెల్లిస్తున్నాయి అయినప్పటికీ అధ్వానమైన రోడ్లు, విద్యుత్‌ కోతలు, నీటి సరఫరాక ఇబ్బందులు, పాడైన ఫుట్‌పాత్‌ల సమస్యలున్నాయి. భారత్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో సిలికాన్‌ వ్యాలీ కంటే మెరుగైన మౌలిక సదుపాయలు కలిగి ఉన్నాయి’ అంటూ ట్వీట్‌ చేశారు.

అయితే ఈ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందించారు. మీరంతా హైదరాబాద్‌కు రావొచ్చని, ఇక్కడ ఉత్తమ సదుపాయాలు ఉన్నాయంటూ పేర్కొన్నారు. ‘మీ బ్యాగులు సర్దుకుని హైదరాబాద్‌కి రండి. మా దగ్గర మెరుగైన భౌతిక మౌలిక సదుపాయాలు, మంచి సామాజిక మౌలిక సదుపాయాలు ఉన్నాయి. మా విమానాశ్రయం అత్యుత్తమమైనది & నగరంలోకి రావడం బయటికి వెళ్లడం చాలా ఆనందంగా ఉంది.  ముఖ్యంగా మా ప్రభుత్వం ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు,& సమ్మిళిత వృద్ధి(3 i) సూత్రాలపై దృష్టి పెట్టింది.’ అని రీట్వీట్‌ చేశారు. 
చదవండి: రాజకీయ నేతల మధ్య ఛాలెంజ్‌కి దారి తీసిన స్టార్టప్‌ కంపెనీ!

తాజాగా కేటీఆర్‌ ట్వీట్‌పై కర్ణాటక ఉన్నత విద్యాశాఖ మంత్రి సీఎన్ అశ్వత్నారయన్ మండిపడ్డారు. బెంగళూరుకు చెందిన పారిశ్రామికవేత్తను బ్యాగ్‌లు సర్దుకుని హైదరాబాద్‌కు వచ్చేయండంటూ చెప్పడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కేటీఆర్‌ మాటతీరు సరైనదిగా లేదని, ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి దురుసు మాటలు  మాట్లాడం సరికాదని హితవు పలికారు. ఒకరిని మరొకరు కిందకు లాగేందుకు ప్రయత్నించడం ఏ ప్రభుత్వానికీ శ్రేయస్కరం కాదని సూచించారు. మనమంతా భారతీయులం, మనమంతా కలిసి ప్రపంచంతో పోటీ పడాలని స్ట్రాంగ్‌ కౌంటరిచ్చారు.

అదే విధంగా కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌లకు కర్ణాటక బీజేపీ శాఖ ఘాటుగా రిప్లై ఇచ్చింది. మీరిద్దరూ ఇక బ్యాగులు సర్దుకోవాలని కౌంటర్‌ వేసింది. నచ్చిన చోటుకి వెళ్లేందుకు ఇద్దరు స్నేహితులు సిద్ధంగా ఉండాలని సూచించింది. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు కర్ణాటక వైభవం కాపాడడంతో పాటు తెలంగాణలోనూ మరింత పురోగమించేదిశగా పయనించేలా చేస్తామని చెప్పింది. 

ఇక కేటీఆర్‌ సవాల్‌ను తను స్వీకరించినట్లు  క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ పేర్కొన్నారు. ‘నా మిత్రుడు కేటీఆర్‌.. మీ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నా. 2023లో క‌ర్నాట‌క‌లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి వ‌స్తుంది. మా హయాంలో బెంగుళూరుకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం.’ అని కేటీఆర్‌కు పరోక్షంగా కౌంటర్‌ వేశారు. అయితే కేటీఆర్ కూడా వెంటనే బదులిచ్చారు. ‘శివ‌కుమార్ అన్నా.. క‌ర్నాట‌క రాజ‌కీయాల గురించి నాకు అంత‌గా తెలియ‌దు. అక్క‌డ ఎవ‌రు గెలుస్తారో చెప్ప‌లేను. కానీ మీరు విసిరిన స‌వాల్‌ను స్వీక‌రిస్తున్న‌ా. దేశ యువ‌తకు ఉద్యోగాలు కల్పించడంలో, దేశ ప్రగతికి హైద‌రాబాద్‌, బెంగుళూరు న‌గ‌రాల మ‌ధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ ఉండాలి.  మౌళిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఐటీ, బీటీల‌పై ఫోక‌స్ పెడుదాం. కానీ హ‌లాల్‌, హిజాబ్ లాంటి అంశాల‌పై కాదు’ అని మంత్రి కేటీఆర్ అన్నారు.
చదవండి: కేంద్రం మెడలు వంచే వరకూ పోరాడుతాం: మంత్రి గంగుల

మరిన్ని వార్తలు