జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ప్రకటన.. కమిటీ ఏర్పాటు..

1 Sep, 2023 10:02 IST|Sakshi

కేంద్రం ముందున్న అంశం :  జమిలి ఎన్నికలు

ప్రధాన లక్ష్యం : ఒకే దేశం - ఒకే ఎన్నిక

తొలి అడుగు : రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో కమిటీ

ప్రత్యేక వ్యూహం : పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లు

1967 వరకు దేశవ్యాప్తంగా లోక్ సభ, రాష్ట్రాలకు ఒకే ఎన్నిక

ఢిల్లీ: జమిలి ఎన్నికలపై కేంద్రం కీలక ముందడుగు వేసింది. ఒకే దేశం-ఒకే ఎన్నిక అంశంపై కమిటీని నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని 16 మందితో కూడిన ఈ కమిటీ జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలను పరిశీలించి రిపోర్టును సమర్పించనుంది. 

ప్రత్యేక సమావేశాల్లోనే జమిలి బిల్లు.?

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు ప్రకటించిన వెంటనే  కేంద్రం ఈ కమిటీని నియమించింది. పార్లమెంట్‌ ప్రత్యేక సెషన్‌లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఒక దేశం.. ఒకే ఎన్నిక బిల్లు పెట్టే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.

అయిదు రాష్ట్రాల్లో యథాతధం.?

అయితే షెడ్యూలు ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ లోగా అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగాలి, కొత్త ప్రభుత్వాలు ఏర్పడాలి. దానికి గాను ఎన్నికల సంఘం ముందున్న గడువు డిసెంబర్ 13, 2023.  తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరగాలి.  ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకున్నా.. వాటికి సంబంధం లేకుండా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిషన్ ఒకటి వచ్చే సోమవారం మధ్యప్రదేశ్ లో పర్యటించనుంది.

లా కమిషన్ కసరత్తు

వన్ నేషన్, వన్ ఎలక్షన్ ద్వారా లోక్‌సభ ఎన్నికలు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనను అధ్యయనం చేసిన లా కమిషన్ ఆఫ్ ఇండియా కూడా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.  కేంద్రం నుంచి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు కానీ పార్లమెంట్‌లో ప్రధాని మోదీ ఈ అంశంపై పలుమార్లు మాట్లాడిన విషయం తెలిసిందే. బీజేపీ మేనిఫెస్టోలో కూడా ఈ అంశం ఉంది.  

మొదట్లో జమిలీ ఎన్నికలే..
1967 వరకు భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా ఉండేది. నాలుగు సార్వత్రిక ఎన్నికలు ఈ విధంగానే జరిగాయి. 1968-69లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలు ముందస్తుగా రద్దు చేయబడిన తర్వాత ఈ పద్ధతి ఆగిపోయింది. లోక్‌సభ కూడా మొదటిసారిగా 1971లో షెడ్యూల్ కంటే ఒక సంవత్సరం ముందుగా రద్దు చేయబడింది. ఆ తర్వాత మధ్యంతర ఎన్నికలు నిర్వహించారు.  

ఇదీ చదవండి: ప్రత్యేక సమావేశాలు.. వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుకు బీజేపీ ప్లాన్‌!

మరిన్ని వార్తలు