జీతం తీసుకోని దీదీ.. ఈ టైంలో యూరప్‌ ట్రిప్పు అవసరమా?:అధిర్ రంజన్ చౌద్రీ

25 Sep, 2023 10:41 IST|Sakshi

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఐరోపా పర్యటనపై లోక్‌సభ ఎంపీ, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌద్రీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఒక పక్క రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగి ప్రజలు నానా అవస్థలు పడుతుంటే వారి నొప్పిని పట్టించుకోకుండా విలాసవంతమైన పర్యటనలకు వెళతారా అని ప్రశ్నించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం విధానాలపైనా ప్రధానిపైనా విమర్శలతో చౌదరి విరుచుకుపడ్డారు.  

అర్ధం చేసుకోలేరా?      
కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆగస్టు సెప్టెంబర్ వ్యవధిలో రాష్ట్రంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని మేము ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామని అయినా కూడా వారు దాన్ని పట్టించుకోలేదని సామాన్యులపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రికి ప్రజలు బాధను అర్ధం చేసుకునే తీరిక లేదు గానీ స్పెయి పర్యటనకు మాత్రం వీలు కుదురుతుందని ఎద్దేవా చేశారు. 

విలాసాలకు డబ్బెక్కడిది?
ముఖ్యమంత్రి ఐరోపా పర్యటనలో విలాసవంతమైన హోటల్లో బస చేయడంపై స్పందిస్తూ.. ముఖ్యామంత్రి జీతం తీసుకోకుండా కేవలం ఆమె రచనలు, పెయింటింగులు అమ్ముకుని సంపాదిస్తూ ఉంటారు. అలాంటిది రోజుకు రూ. 3 లక్షలు ఖర్చుతో మాడ్రిడ్ హోటల్లో బస చేయడానికి డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయని ఈ విలాసవంతమైన ట్రిప్‌లో ఖర్చులు ఎవరు భరించారని ఏ పారిశ్రామికవేత్త మిమ్మల్ని అక్కడికి తీసుకుని వెళ్లారని ప్రశ్నిస్తూ ప్రజలను మోసం చేయాలని చూడొద్దని అన్నారు. ఇటీవల బిశ్వ బంగ్లా పారిశ్రామిక సమావేశంలో మీరు ఖర్చు చేసిన దానిలో పది శతం వెచ్చించి ఉంటే లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చి ఉండేవని అన్నారు. 

మామూలు రైలే.. 
ఇక ప్రధాని కొత్తగా ప్రారంభించిన తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల గురించి ప్రస్తావిస్తూ.. ప్రజలకు బులెట్ ట్రైన్‌ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చి 'వందేభారత్' పేరుతో డొల్ల ట్రైన్‌లు తీసుకొస్తున్నారని ఇవి వాటి సహజ వేగంతో కాకుండా సాధారణ వేగంతోనే ప్రయాణిస్తున్నాయని దీని టికెట్టు ధర మాత్రం సామాన్యుడికి  కన్నీరు తెప్పిస్తోందని అన్నారు. యునెస్కో శాంతినికేతన్‌కు వారసత్వగుర్తింపు కల్పించడంపైన కూడా మాట్లాడుతూ శాంతినికేతన్‌కు ఎటువంటి ప్రత్యేక గుర్తింపులు అవసరం లేదని దాని ప్రత్యేకత దానికుందని అలాగే ఒక ప్రాచీన ఆలయం తప్ప ఏమీ లేని ముర్షిదాబాద్ కృతేశ్వరి గ్రామానికి ఉత్తమ్ పర్యాటక గ్రామంగా గుర్తింపు కల్పించడం సరైనది కాదని చేతనైతే అక్కడి నవాబుల కాలం నాటి నిర్మాణాలను పరిరక్షించాలని అన్నారు. 

దృష్టి మళ్లించడానికే..  
ప్రజా సమస్యలపై స్పందించకుండా వాటి నుంచి దృష్టి మళ్లించడానికి మోదీ ప్రభుత్వం ఇలాంటి అనేక అంశాలను తెరమీదకు తీసుకొస్తుందన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం ఒకే ఎన్నికలు వంటి కొత్త కొత్త అంశాలను తీసుకొచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని అన్నారు. బీజేపీ ఆలోచనా విధానం ప్రజాస్వామ్య విలువలను తుంగలోకి తొక్కుతూ పార్లమెంటును అగౌరవపరిచే విధంగా ఉందని అన్నారు.    

ఇది కూడా చదవండి: మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో గెలుపు పక్కా

మరిన్ని వార్తలు