సర్కారు ఎవరిదో నిర్ణయించేది ఆ రెండు జిల్లాలే!

13 Apr, 2021 03:48 IST|Sakshi

పశ్చిమబెంగాల్‌లో విజయాన్ని నిర్ధారించే ‘పరగణ’ జిల్లాలు

కోల్‌కతా: నార్త్‌ 24 పరగణ, సౌత్‌ 24 పరగణ.. పశ్చిమబెంగాల్‌లో ఈ రెండు జిల్లాలు తృణమూల్‌ కాంగ్రెస్‌కు కంచుకోటలు. ఈ కోటలను బద్దలు కొట్టి టీఎంసీ ఓటమికి బాటలు వేయాలనేది బీజేపీ ప్రణాళిక. ఈ రెండు జిల్లాల్లో మరోసారి అత్యధిక స్థానాలు గెలుపొందడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలన్నది టీఎంసీ ఆలోచన. మొత్తం 294 స్థానాల అసెంబ్లీలో ఈ రెండు జిల్లాలకు కలిపి 64 సీట్లు ఉన్నాయి. నార్త్‌ 24 పరగణలో 33, సౌత్‌ 24 పరగణలో 31 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. సౌత్‌ 24 పరగణలో మైనారిటీల ప్రాబల్యం ఎక్కువ. ఈ రెండు జిల్లాలకు బంగ్లాదేశ్‌తో సరిహద్దులున్నాయి.

శరణార్థుల జనాభా కూడా ఇక్కడ ఎక్కువ. 1980లో 24 పరగణ జిల్లాను అప్పటి లెఫ్ట్‌ ప్రభుత్వం రెండు జిల్లాలుగా విభజించింది. మొదట్లో ఈ ప్రాంతంలో వామపక్షాలకు గట్టి పట్టు ఉన్నప్పటికీ క్రమంగా టీఎంసీ పుంజుకుని, లెఫ్ట్‌ బలాన్ని తగ్గించేసింది. నందిగ్రామ్, సింగూర్‌ ఉద్యమాలు ఈ ప్రాంతంలో టీంఎసీని మరింత బలోపేతం చేశాయి. 2011, 2016 ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో దాదాపు అన్ని స్థానాలను టీఎంసీ గెల్చుకుంది. 2016లో నార్త్‌ పరగణలో 27, సౌత్‌ పరగణలో 29 స్థానాలను టీఎంసీ గెల్చుకుంది.

2019 లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో నార్త్‌ పరగణలో బీజేపీ కొంతవరకు ప్రభావం చూపగలిగింది. ‘బెదిరింపులతో, ప్రలోభాలతో 2019 ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావం చూపింది. కానీ ఆ తరువాత మేం జాగ్రత్తపడ్డాం. పార్టీ బలోపేతానికి తగిన చర్యలు తీసుకున్నాం’ అని నార్త్‌ 24 పరగణ జిల్లా టీఎంసీ అధ్యక్షుడు జ్యోతిప్రియొ తెలిపారు. పార్టీలో పెరుగుతున్న అంతర్గత విబేధాలు, మత ఘర్షణల కారణంగా రెండు జిల్లాల్లోనూ టీఎంసీ బలం కొంత తగ్గింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని ప్రచారాస్త్రంగా చేపట్టి, శరణార్ధులను ఆకర్షించి 2019 లోక్‌సభ ఎన్నికల్లో నార్త్‌ 24 పరగణ జిల్లాలో ఉన్న ఐదు స్థానాల్లో రెండింటిని బీజేపీ గెల్చుకోగలిగింది.

అలాగే, అక్కడ ప్రబలంగా ఉన్న మథువా వర్గంలో పట్టు సాధించింది. నార్త్‌ 24 పరగణలోని 14 అసెంబ్లీ స్థానాల్లో మథువాలు నిర్ణయాత్మక శక్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఈ రెండు జిల్లాల నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు సహా పెద్ద ఎత్తున పార్టీ నేతలు బీజేపీలో చేరడం టీఎంసీకి ఆందోళనకరంగా మారింది. కొత్తగా వచ్చిన ఇండియన్‌ సెక్యులర్‌ ఫ్రంట్‌(ఐఎస్‌ఎఫ్‌) సౌత్‌ 24 పరగణ జిల్లాలో టీఎంసీకి చెందిన మైనారిటీ ఓట్లను చీల్చే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఎన్నికల్లో ఐఎస్‌ఎఫ్‌ కాంగ్రెస్, లెఫ్ట్‌లతో కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల ప్రచారం సాయంతో నార్త్‌ 24 పరగణలో 60% సీట్లను సాధిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ ధీమాగా ఉన్నారు. 

మరిన్ని వార్తలు