పొన్నాలకు రాహుల్‌ నుంచి ఫోన్‌!.. స్పందించిన లక్ష్మయ్య..

26 Oct, 2023 18:02 IST|Sakshi

సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈరోజు ఒక పార్టీలో ఉన్న నేతల మరుసటి రోజు ఏ పార్టీలో చేరుతున్నారో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి తరుణంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల బీఆర్‌ఎస్‌లో చేరిన పొన్నాల లక్ష్మయ్యకు రాహుల్‌ గాంధీ ఆఫీసు నుంచి ఫోన్‌ రావడం పొలిటికల్‌గా హాట్‌ టాపిక్‌గా మారింది. 

వివరాల ప్రకారం.. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆఫీసు నుంచి పొన్నాల లక్ష్మయ్యకు గురువారం ఫోన్‌ కాల్‌ వెళ్లింది. ఈ సందర్బంగా పొన్నాల తిరిగి కాంగ్రెస్‌లో చేరాలనే ప్రతిపాదనను ఆయన ముందు ఉంచినట్టు సమాచారం. అలాగే, ఢిల్లీకి వచ్చి రాహుల్‌ గాంధీని కలవాలని రాహుల్‌ టీమ్‌ ఆయనను కోరింది. ఈ నేపథ్యంలో పొన్నాల నిర్ణయంపై ఉత్కంఠ చోటుచేసుకుంది. 

మరోవైపు.. ఫోన్‌ కాల్‌పై పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఈ సందర్బంగా పొన్నాల మాట్లాడుతూ.. నాకు ఎవరూ ఫోన్‌ చేయలేదు. తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నాను. 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ సేవ చేసిన పార్టీలో అనేక అవమానాలు భరించి.. నేను ఓ రాజకీయ నిర్ణయం తీసుకున్నాను. బీసీలను చీడ పురుగులు చూసినట్టు రేవంత్ రెడ్డి  ప్రవర్తన ఉంది. ఇలాంటి చిల్లర ప్రచారాలకు ప్రభావితం అయ్యే వ్యక్తిని కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

ఇదిలా ఉండగా.. సీనియర్‌ నేత పొన్నాల లక్ష్మయ్య ఇటీవలే బీఆర్‌ఎస్‌లో చేరారు. జనగామలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ సమక్షంలో పార్టీలో చేరారు. పొన్నాలకు కండువా కప్పి సీఎం కేసీఆర్‌ పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం, పొన్నాల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో ఉండి అవమానానికి గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. 45 ఏళ్లు కష్టపడినా తనకుఫలితం దక్కలేదని అన్నారు.

ముఖ్యమంత్రి అయిన మూడు నెలల్లోనే సమగ్ర కుటుంబ సర్వే చేయించిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అణగారిన వర్గాలను పైకి తీసుకురావడానికి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కేసీఆర్‌ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. జనగామ ప్రాంతంలో 80 వేల పాల ఉత్పత్తి జరుగుతుందని, వారికి ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని కోరారు. బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. 

మరిన్ని వార్తలు